జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యే విశ్వనాథ్
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ ఆదివారం అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కుమారస్వామి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన 14 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. వీరిలో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు జేడీ(ఎస్)కు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. అనర్హత వేటు వేయడం చట్టవిరద్దమని, రేపు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని జేడీ(ఎస్) రెబల్ ఎమ్మెల్యే విశ్వనాథ్ తెలిపారు. తమపై అనర్హత వేటు వేయడాన్ని చట్ట విరుద్ధంగా భావిస్తున్నానని, అందుకే ఈ విషయమై తాను సుప్రీంను ఆశ్రయిచంనున్నట్లు స్పష్టం చేశారు. స్పీకర్ నిర్ణయం చట్టవిరుద్ధంగా ఉందని, సుప్రీంకోర్టులోనే తమకు న్యాయం జరుగుతుందని మరో రెబల్ ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ ఓ వీడియో విడుదల చేశారు.
(చదవండి : కర్ణాటక స్పీకర్ సంచలన నిర్ణయం)
కాగా స్పీకర్ తాజా నిర్ణయంతో వేటు పడిన మొత్తం సభ్యుల సంఖ్య 17కి చేరింది(ఇదివరకే ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు వేశారు). మరోవైపు సోమవారం అసెంబ్లీలో బలనిరూపణ ఉంటుందని, సభ్యులంతా దీనికి హాజరుకావాలంటూ స్పీకర్ ఆదేశాలు జారీచేశారు. శుక్రవారం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన యడియూరప్ప.. సోమవారం అసెంబ్లీలో బలనిరూపణ చేయాల్సి ఉన్న విషయం తెలిసిందే. 17 మంది ఎమ్మెల్యేలపై వేటు పడటంతో కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 207కు పడిపోయింది. బల నిరూపణకు కావల్సిన బలం 105. భాజపాకి 105మంది సొంత పార్టీ సభ్యులతో పాటు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దీంతో రేపు బల పరీక్షలో సీఎం యడియూరప్ప నెగ్గేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment