
న్యూఢిల్లీ: 2019లో కర్ణాటకలో కాంగ్రెస్ నేతృత్వంలో అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పెగసస్ స్పైవేర్‌ను ఉపయోగించారని కాంగ్రెస్ నేతలు మంగళవారం బీజేపీని విమర్శించారు. పెగసస్ స్పైవేర్ లిస్టులో అప్పటి ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, ఉపముఖ్యమంత్రి జి. పరమేశ్వర, మాజీ సీఎం సిద్దరామయ్యల కార్యదర్శులు ఉన్నారని ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా బీజేపీపై విరుచుకుపడ్డారు. పెగసస్‌ను వినియోగించుకొని మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో దీనిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంమంత్రిగా కొనసాగే హక్కు అమిత్‌షాకు లేదని వ్యాఖ్యానించారు.