సీఎం నివాసం ధవళగిరి
సాక్షి బెంగళూరు: మంత్రివర్గంలో చోటు ఆశించిన పలువురు శాసనసభ్యులు డాలర్స్ కాలనీలోని ముఖ్యమంత్రి నివాసం ధవళగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. నేడు (శనివారం) కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కర్ణాటక రానున్న సందర్భంగా మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని ఆశావహులు జోరు పెంచారు. ఈమేరకు సీఎం యడియూరప్పతో ఎవరికి వారు లాబీయింగ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు కర్తవ్యం నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం నివాసం వద్ద కొందరు ఎమ్మెల్యేలు మీడియాకు తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఉమేశ్ కత్తి, కె.గోపాలయ్య, గోలిహట్టి శేఖర్, ఎం.చంద్రప్ప, సోమశేఖరరెడ్డి, రేణుకాచార్య, జ్ఞానేంద్ర, మాజీ మంత్రులు ఎంటీబీ నాగరాజు, ఆర్.శంకర్ మత్తికెరెలోని సీఎం నివాసానికి శుక్రవారం వెళ్లి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రివర్గంలో తమకు చోటు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
శనివారం ఉదయం ప్రత్యేక విమానం ద్వారా అమిత్‌షా బెంగళూరు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్యాలెస్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మధ్యాహ్నం 12 గంటలకు పాల్గొంటారు. తర్వాత సాయంత్రం 4 గంటలకు హుబ్బళి బయలుదేరి వెళ్తారు. అక్కడ పౌరసత్వ సవరణ చట్టంపై జాగృతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆదివారం ఉదయం ఢిల్లీ వెళ్తారు. కాగా అమిత్‌షా శుక్రవారమే కర్ణాటక వస్తారని భావించారు. కానీ ఆయన ఉన్నఫలంగా నిర్ణయం మార్చుకుని శనివారానికి వాయిదా వేసుకున్నారు.
అమిత్‌షాతో నేడు సీఎం భేటీ
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు శనివారం కర్ణాటక రానున్నారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప భేటీ అయి మంత్రివర్గ విస్తరణ గురించి చర్చిస్తారని తెలిసింది. ఈమేరకు ఇప్పటికే మంత్రివర్గం జాబితా కూడా సీఎం సిద్ధం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాలకు ముందే కేబినెట్ విస్తరిస్తారా? లేక తర్వాతా? అనేది కూడా నేడు తేలనుంది. మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలి? ఏ శాఖ ఇవ్వాలనే దానిపై అమిత్‌షాతో సీఎం యడియూరప్ప చర్చించనున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కాగా ఉప ఎన్నికల్లో గెలిచిన వారందరికీ మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని సీఎం ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఓడిన వారిని మంత్రిమండలిలోకి తీసుకోవాలా? వద్దా? అనే దానిపై అమిత్‌షాతో చర్చించి తీర్మానిస్తారు. దీనికి తోడు పార్టీలో ఎన్నో ఏళ్లుగా ఉంటూ ఎమ్మెల్యేలుగా గెలుస్తున్న సీనియర్ నేతలను కూడా కేబినెట్‌లోకి తీసుకునే విషయమై మాట్లాడుతారు.
Comments
Please login to add a commentAdd a comment