
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయ సంక్షోభంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్దరామయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీకి మద్దతు తెలుపుతూ రెబల్ ఎమ్మెల్యేలు రాజకీయ విలువలను సమాధి చేశారని అన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ, 25 కోట్ల నుంచి 50 కోట్ల వరకు బీజేపీ నేతలు వెచ్చించారని, ఆ డబ్బాంతా ఎక్కడి నుంచి తెస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయాలను భ్రష్టు పట్టించే విధంగా పార్టీకి వెన్నుపోటు పొడిచిన తిరుగుబాటు దారులపై అనర్హత వేటు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా మారిన కర్ణాటక రాజకీయం చివరిదశకు చేరుకున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రసంగం అనంతరం విశ్వాసపరీక్ష నిర్వహిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
సభలో మెజార్టీకి కావాల్సిన సంఖ్యాబలం 103 కాగా. సభకు హాజరయిన బీజేపీ సభ్యులు 105 మంది ఉన్నారు. మరోవైరు రెబల్స్‌తో మైనార్టీలో పడిపోయిన కాంగ్రెస్-జేడీఎస్ సభ్యుల సంఖ్య 101 మాత్రమే. స్పీకర్, నామినేటేడ్ సభ్యులను మినహాయిస్తే అధికారపక్షం బలం 99కి పడిపోతుంది. సభకు గైర్హాజరు అయిన వారిలో 15 మంది రెబల్స్, ఓ స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. అనారోగ్యంతో ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు సభకు హాజరుకాలేదు. స్పీకర్ విశ్వాస పరీక్ష చేపడితే కుమారస్వామి ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. రాజధాని బెంగళూరులో పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment