సాక్షి, బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ పార్టిలో వర్గపోరు పెరుగుతోంది. ఎవరికి వారు వర్గాలుగా మారి సీఎం కురీ్చపై టార్గెట్ పెట్టారు. ఇందులో ముఖ్యంగా సిద్ధరామయ్య వర్గం, డీకే శివకుమార్ వర్గం పేర్లు కీలకంగా వినిపిస్తున్నాయి. ఈ సమయంలో గురువారం హోసపేట నగరంలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ రానున్న ఐదేళ్ల పాటు తానే సీఎంగా కొనసాగుతానని వ్యాఖ్యలు చేయడంతో డీకే శివకుమార్ వర్గం నోటిలో పచ్చి వెలక్కాయ పడ్డట్లయ్యింది.
రెండున్నరేళ్ల తర్వాత అధికార మార్పిడితో తాను సీఎం అవుతానని ఆశలు పెట్టుకున్న డీకే శివకుమార్‌కు ఈ వ్యాఖ్యలు మింగుడు పడడం లేదు. ముఖ్యమంత్రిగా ఆరు నెలలు పూర్తి చేసుకున్న సిద్ధరామయ్య రానున్న ఐదేళ్లపాటు తానే సీఎంగా కొనసాగుతానని నర్మగర్భంగా వ్యాఖ్యలు చేయడంపై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. సీఎం వ్యాఖ్యలపై అనుకూల, ప్రతికూల వ్యాఖ్యానాలను రాజకీయ విశ్లేషకులు చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టిలో ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రెండున్నరేళ్ల తర్వాత తానే సీఎం అనే ఆశలతో ఉన్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాత్రం తాను కేవలం హైకమాండ్ మాట మాత్రమే వింటానని, ఎవరేమి చెప్పినా పట్టించుకోనని తెలిపారు. ఇదే సమయంలో కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమని బాహాటంగా వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ లోలోపల ఎవరి వర్గానికి వారు మద్దతు ప్రకటిస్తూ వస్తున్నారు.
ఈ విషయంపై మంత్రి ప్రియాంక్ ఖర్గే శుక్రవారం మైసూరులో విలేకరులతో మాట్లాడుతూ సీఎం వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, ఎవరిని కొనసాగించాలి, ఎవరికి అడ్డుకట్ట వేయాలనే విషయం తమ అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. మరో మంత్రి కేఎన్ రాజణ్ణ శుక్రవారం తుమకూరులో మాట్లాడుతూ మాజీ డీప్యూటీ సీఎం, హోం మంత్రి పరమేశ్వరకు కూడా సీఎం అయ్యే అర్హత ఉందని పేర్కొన్నారు.
తుమకూరులో హోం మంత్రి పరమేశ్వర మాట్లాడుతూ సీఎం వ్యాఖ్యలపై తాను స్పందించబోనని చెప్పారు. అధికార పంపిణీ కేవలం సీఎం, డీసీఎం మధ్యజరిగిన చర్చ అని, అసలు ఢిల్లీలో ఎలాంటి ఒప్పందం జరిగిందనే విషయంపై వారిద్దరికే స్పష్టమైన అవగాహన ఉందని, అలాంటప్పుడు ఇది సత్యం, ఇది అబద్ధమని తానే వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. అయితే రామనగర ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ మాత్రం డీసీఎం డీకే శివకుమార్‌కు మద్దతు పలికారు.
పోస్టు ఖాళీగా లేదు కదా!
ఖాళీగా లేని ముఖ్యమంత్రి పదవిపై అవసరంగా చర్చ సాగుతోందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు, ఎంపీ డీకే సురేశ్ అన్నారు. ఇలాంటి చర్చకు అర్ధం లేదని వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుతం సిద్ధరామయ్య సీఎంగా ఉన్నారు. సీఎం పోస్టు ఖాళీగా లేదు. ఆ పదవి ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే దీనిపై చర్చించాలి. ఇప్పుడు మాట్లాడుకోవడం వల్ల లాభం ఏమిటి?’ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment