సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడానికి కారణం ఎవరు. అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువ స్థానాలు గెలుకుచుకున్న జేడీఎస్‌కు సీఎం పదవి దక్కడంతో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెరవెనుక చక్రం తిప్పారా?. అంటూ కన్నడ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. మంగళవారం జరిగిన విశ్వాసపరీక్షలో కుమారస్వామి ప్రభుత్వం సభ విశ్వాసాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేయగా.. నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప సిద్ధమయ్యారు. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ నేతల తీరుపై రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో సీనియర్ నాయకులు ఉండి బీజేపీ వ్యూహాలకు చెక్ పెట్టలేకపోయారంటూ రాష్ట్ర నేతలపై అసహనంగా ఉన్నట్లు సమాచారం.
ముఖ్యంగా సిద్దరామయ్యపై వ్యవహారంపై రాహుల్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, పతానానికి కారణం ఆయనే అంటూ మండిపడుతున్నారని తెలిసింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. సీఎంగా కుమారస్వామి పదవీ బాధ్యతలు చేపట్టనప్పటి నుంచీ ప్రభుత్వంపై సిద్దరామయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో కాంగ్రెస్‌కు అన్నీ తానై నడిపించిన తనను కాదని, అతి తక్కువ స్థానాలు గెలుచుకున్న జేడీఎస్‌కు, అందులోనూ తనకు గిట్టని కుమారస్వామికి సీఎం పదవి కట్టబెట్టడంపై రామయ్య గుర్రుగా ఉన్నారంటూ పెద్దస్థాయిలో చర్చ కూడా జరిగింది. అంతేకాదు సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలబడదని, రానున్న ఏడాదిలోపు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పులు చోటుచేసుకుంటాయని గతంలో ఆయన వ్యాఖ్యానించిన సందర్భాలెన్నో. మరోవైపు కుమారస్వామితో పాటు, మాజీ ప్రధాని దేవెగౌడ సైతం సిద్దరామయ్య తీరుపై అనేకసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సిద్దూ కుట్రపన్నుతున్నారని, తమకు వ్యతిరేకంగా వ్యూహాలు రచిస్తున్నారంటూ బహిరంగ ప్రకటనలు కూడా చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తొలినాటి నుంచి వీరి మధ్య సరైన అవగహన లేనట్లు బయటపడింది. దీనికి తోడు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు ఘోర పరాజయం పాలవ్వడం సంకీర్ణంలో విభేదాలు మరింత పెరిగాయి. జేడీఎస్-కాంగ్రెస్ కూటమి రాష్ట్ర వ్యాప్తంగా 28 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయగా.. ఇరు పార్టీలు కేవలం ఒక్కో స్థానానికి మాత్రమే పరిమితమయ్యాయి. దేవెగౌడ సైతం ఓటమి చవిచూడక తప్పలేదు. ఫలితాల అనంతరం సిద్దరామయ్య మాట్లాడుతూ.. జేడీఎస్‌తో పొత్తు కారణంగా తాము ఎంతో నష్టపోయామని ఏకంగా మీడియా సమావేశంలోనే విమర్శించారు. దేవెగౌడ, కుమారస్వామి కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలూ చేశారు. దీంతో కన్నడ పంచాయతీ కాంగ్రెస్ పెద్దల దగ్గరకు వెళ్లడంతో సిద్దరామయ్య అధిష్టానం ఆగ్రహానికి కూడా గురయ్యారు.
ఇదిలావుండగా తాజాగా ప్రభుత్వం పడిపోవడానికి కూడా కారణం ఆయనే అని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ప్రభుత్వంపై తిరుగుబాటుకు దిగిన ఎమ్మెల్యేలు అత్యధిక మంది సిద్దరామయ్య వర్గానికి చెందినవారే ఉన్నారు. రెబల్స్ వెనుక సిద్దూ హస్తం ఉందంటూ జేడీఎస్ మొదటి నుంచి చెబుతూనే ఉంది. అయినా కూడా కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోలేదని ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇరుపార్టీల మధ్య ఉన్న విభేదాలను ప్రతిపక్ష బీజేపీ ఆసరాగా చేసుకుని రెబల్స్‌ను తమపైపు తిప్పుకున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చివరికి ఉన్న ప్రభుత్వం ఊడిపోయి.. బీజేపీ ఖాతాలోకి మరో రాష్ట్రం చేరబోతోంది.
Comments
Please login to add a commentAdd a comment