సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం పడిపోవడానికి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రధాన కారణమని వార్తలు వినిపిస్తోన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ రెబల్స్ వెనుక ఆయన హస్తం ఉందంటూ జేడీఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా వారి ఆ వార్తలను నిజం చేస్తూ.. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే శివరాం హెర్బర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తామంతా సిద్దరామయ్య సూచనల మేరకే నడుచుకున్నామంటూ బాంబు పేల్చారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘కర్ణాటకలో నెలకొన్న అనిశ్చితికి సిద్దరామయ్యే కారణం. పార్టీకి దూరంగా ఉండమని కొద్ది రోజుల క్రితం ఆయన మాకు చెప్పారు. కానీ ఇప్పుడు మమ్మల్నే నిందిస్తున్నారు. మేమంతా ఏకతాటిపై ఉన్నాం. అందరం కలిసే నిర్ణయం తీసుకున్నాం. మేం బీజేపీలో చేరుతున్నామనేది అబద్ధం’ అని తెలిపారు.
శివరాం వ్యాఖ్యలపై కన్నడ రాజకీయాల్లో పెను దుమారం చేలరేగుతోంది. ఈ నేపథ్యంలో హెర్బర్ వ్యాఖ్యలపై సిద్దరామయ్య స్పందించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారని. ఇంకోసారి ఇలాంటి ఆరోపణలు చేస్తే వారికి గట్టిగా బుద్ధి చెప్తానని ట్వీట్ చేశారు. విశ్వాస పరీక్షలో ప్రభుత్వాన్ని కాపాడటానికి తనవంతు కృషి చేశానని సిద్దూ చెప్పుకొచ్చారు. కాగా కర్ణాటక సంక్షోభం అనంతరం స్థానిక నేతలపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ పతనం వెనుక సిద్దరామయ్య ఉన్నారన్న వార్తలు కాంగ్రెస్ అధిష్టానం దృషికి కూడా వెళ్లాయి. దీంతో ఆయనపై పార్టీ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: ప్రభుత్వ పతనం వెనుక కాంగ్రెస్!
ఇదిలావుండగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా శుక్రవారం సాయంత్రం యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు తెలపకుండా ఉండేందుకు మరోసారి రెబల్స్‌ను బుజ్జగింజే ప్రయత్నంలో పడ్డారు జేడీఎస్, కాంగ్రెస్ నేతలు. మరోవైపు వారి రాజీనామాలపై అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. దీంతో కర్ణాటక రాజకీయాల ఉత్కంఠ మరికొన్ని రోజులు సాగనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment