సాక్షి, బెంగళూరు: రాజకీయ సంక్షోభంలో ఉన్న కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ సిద్ధమయింది. ఈరోజు సాయంత్రం ఆరుగంటలకు రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్పీకారం చేయనున్నారు. దీనికి గవర్నర్, కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. అయితే సీఎంగా యడ్యూరప్ప ప్రమాణం చేసిన అనంతరం అసెంబ్లీలో బల నిరూపణ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న రాజకీయ సంక్షోభం కారణంగా విశ్వాస నిరూపణకు గవర్నర్ అనూహ్యాంగా వారికి ఏడు రోజుల సమయం ఇచ్చారు. జూలై 31న శాసనసభలో యడ్యూరప్ప బల పరీక్షను ఎదుర్కోనున్నారు.
గవర్నర్ వారికి ఏడు రోజుల సమయం కేటాయించడంపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శాసనసభను బీజేపీ ఓ ప్రయోగశాలగా మార్చిందని మండిపడింది. రాజ్యాంగంలో ఏ అధికారణ ప్రకారం గవర్నర్ మెజార్టీకి తక్కువగా ఉన్న పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారని ప్రశ్నించింది. ఈచర్య సిగ్గుచేటని ఘటుగా స్పందించింది. ఈ మేరకు పార్టీ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌ను పావుగా ఉపయోగించుకుంటోందని విమర్శించింది.
గతంలోలా అసెంబ్లీలో బలం సరిపోక మరోసారి యడ్యూరప్ప రాజీనామా చేయక తప్పదని కాంగ్రెస్ జోస్యం చెప్పింది. మరోవైపు యడ్యూరప్ప విశ్వాసపరీక్షపై బీజేపీ నేతలు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టారు. రెబల్ ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునేందుకు కేంద్ర నాయకత్వం ఆపార్టీ నేతలను రంగంలోకి దింపింది. కాంగ్రెస్ కూడా మరోసారి రెబల్స్‌ను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తోంది. ఇదిలావుండగా రెబల్స్‌పై స్పీకర్ తీసుకునే నిర్ణయం ఉత్కంఠగా మారింది. ఇదివరకే ముగ్గురు సభ్యులపై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment