యడియూరప్ప స్థానంలో యువ సీఎం! | Hot Debate On Karnataka to Get New CM | Sakshi
Sakshi News home page

యడియూరప్ప స్థానంలో యువ సీఎం!

Published Mon, Nov 30 2020 11:34 AM | Last Updated on Mon, Nov 30 2020 6:51 PM

Hot Debate On Karnataka to Get New CM - Sakshi

సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం మార్పు గతకొంత కాలంగా రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. సీఎం బీఎస్‌ యడియూరప్ప(77) వయసు పెరిగిపోయిందని, పనిలో చురుకుదనం లోపించిందని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలోనూ కొందరు అమాత్యులు యడ్డీపై గుర్రుగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో కర్మ, కర్త, క్రియ అన్నీ తానై వ్యవహరించిన యడియూరప్పకు ప్రభుత్వ ఏర్పాటు అనంతరం కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలో చాలామందికి మంత్రిపదవులు కట్టాబెట్టారు. అయితే సీఎం నిర్ణయం సొంత పార్టీ నేతలకు ఏమాత్రం మింగుడుపడటంలేదు. ఎంతో కాలంగా పార్టీలో కొనసాగుతున్న తమను కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి మంత్రి పదవులు ఇవ్వడం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. (సీనియర్ల అసంతృప్తి.. సీఎంను తప్పించండి)

ఈ విషయం కాస్తా ముఖ్యమంత్రి చెవినపడటంతో కొద్దికాలంలో మంత్రివర్గాన్ని విస్తరిస్తానని అసంతృప్తులకు నచ్చజెప్పారు. ఇలా ఏడాది గడుస్తున్నా కేబినెట్‌ విస్తరణ చేపట్టకపోవడంతో అసంతృప్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యడ్డీని వెంటనే సీఎం కుర్చి నుంచి దించివేయాలని ఓ సమావేశాన్ని సైతం ఏర్పాటు చేసుకుని రహస్య తీర్మానం చేశారు. ఈ క్రమంలోనే కరోనా వైరస్‌ తెచ్చిన విపత్తుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంభవించిన భారీ వరదలు ఆయనకు మరింత తలనొప్పిని తెచ్చిపెట్టాయి. దీంతో సీఎం పీఠం మార్పు అనే వార్తలు మరోసారి ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పెద్దల నుంచి పిలుపందుకున్న యడియూరప్ప.. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వివరించారు. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను సీఎం వెల్లడించకపోవడంతో యడ్డీ స్థానంలో కొత్త సీఎంను నియమించేందుకు కేంద్ర పెద్దలు సిద్ధమయ్యారనే టాక్‌ వినిపించింది. (కరోనా తెచ్చిన కష్టం: యడ్డీ కుర్చీకి ఎసరు!)

ఆయన స్థానంలో ఓ యువనేతకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని కన్నడ వర్గాల ద్వారా తెలుస్తోంది. గతంలో మహారాష్ట్ర, త్రిపుర, గోవాలో అనుసరించిన వ్యూహాన్ని ఇక్కడా అమలు చేయాలని బీజేపీ పెద్దలు యోచిస్తున్నట్లు సమాచారం. పార్టీ సిద్ధాంతాల ప్రకారం 75 ఏళ్లు పైబడిన వారు ఎవరూ కూడా పార్టీ పదవుల్లో ఉండకూడదు. ఈ నియమాన్ని అనుసరించే 77 ఏళ్ల యడ్డీని సీఎం పదవీ బాధ్యతల నుంచి తప్పిస్తారని చర్చ సాగుతోంది. మరోవైపు సీఎం మార్పు వార్తలను బీజేపీ కర్ణాటక చీఫ్‌ నలిన్‌ కుమార్‌ కాటిల్‌ కొట్టిపారేశారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు (డిసెంబర్‌) ముగిసే వరకు సీఎం మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకునేదిలేదని తేల్చిచెప్పారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని స్పష్టం చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement