సాక్షి, ఖమ్మం: అసెంబ్లీ ఎన్నికలకు మరో ఐదు నెలలు సమయం ఉండగానే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయింది. రాజకీయ వర్గాలు ముందుగా ఊహించినట్టుగానే ఖమ్మం గడ్డపై నుంచి ఆ పార్టీ తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ జనం నడుమ ఖమ్మంలో జరిగిన బహిరంగ సభ ఎన్నికల ప్రచార సభను తలపించింది.
కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నింపడంతో పాటు కర్ణాటక విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను మట్టి కరిపించాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునివ్వడం ద్వారా పార్టీ శ్రేణులు ఎన్నికల రంగంలోకి దూకాలనే సంకేతా లిచ్చారు. బీఆర్‌ఎస్‌ను బీజేపీ ‘బీ’టీంగా అభి ర్ణిస్తూనే.. కర్ణాటకలో బీజేపీని ఓడించినట్టుగానే ఇక్కడ బీఆర్‌ఎస్‌ను ఓడించి తీరుతామని ఆయన శపథం చేశారు. బీఆర్‌ఎస్‌పై తీవ్రంగా మాటల దాడి చేసిన రాహుల్‌గాంధీ, ఖమ్మం సభలోనే పార్టీ ఎన్నికల ప్రచార వ్యూహాన్ని అమలుచేసే ప్రయత్నం చేశారు.
ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక్కటేనని చెప్పే ప్రయత్నం గట్టిగానే చేశారు. తెలంగాణలో బీజేపీ లేనేలేదని చెప్పడంతో పాటు వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో అమీతుమీ తేల్చుకుంటామని స్పష్టం చేశారు. తాము బీఆర్‌ఎస్‌ను దగ్గరకు రానిచ్చేది లేదని స్పష్టం చేసిన రాహుల్.. కాంగ్రెస్‌ను వదిలి వెళ్లిన వారు మళ్లీ పార్టీలోకి రావాలంటూ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఆలోచనా విధానం ఉన్నవారి కోసం తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పడం ద్వారా తెలంగాణలో పార్టీకి మరింత శక్తి సాధించి పెట్టే మార్గాన్ని తెరిచారు.
గతంలో పీసీసీ అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు కూడా ఇదే కావడం, కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిన నేతలు మళ్లీ రావాలని ఇప్పుడు రాహుల్ కోరడం ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. మొత్తంమీద కర్ణాటక స్ఫూర్తిని, బీఆర్‌ఎస్‌పై యుద్ధ రీతిని ప్రకటిస్తూ.. పార్టీ కేడర్‌కు భవిష్యత్ కర్తవ్యాన్ని నిర్దేశిస్తూ రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం కాంగ్రెస్‌పార్టీని ఎన్నికల మూడ్‌లోకి తీసుకెళ్లిందని రాజకీయ వర్గాలు చెపుతున్నాయి.
అడ్డంకులు సృష్టించినా..
జనగర్జన సభ జరగకుండా అధికార బీఆర్‌ఎస్ అనేక అడ్డంకులు సృష్టించిందని, అయినా నిర్బంధాన్ని అధిగమించి లక్షలాది మంది కేడర్ కదం తొక్కారనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా, లారీలు, ఆటో యూనియన్లను బెదిరించి, పెద్ద ఎత్తున చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, సభకు వెళ్లే వాహనాలకు పెట్రోల్ పోయవద్దని బంకు యజమానులను బెదిరించారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
అంతేకాక ఖమ్మం నగరంలో నీటి సరఫరా నిలిపివేసి, ఆర్టీఏ అధికారుల ద్వారా ప్రైవేట్ వాహనదారులను బెదిరించి, సభకు వెళ్తే రూ.లక్ష సాయం చేయబోమని, ప్రభుత్వ పథకాలు కట్‌చేస్తామని చెప్పి జనం రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారనేది కాంగ్రెస్ నేతల ఆరోపణ. ఇంత చేసినా ఈ సభకు వచ్చిన జనసందోహాన్ని చూస్తే ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉన్న పట్టు ఏమిటో అర్థమవుతోందని వారంటున్నారు. ఇక, ఈ సభ ద్వారా సీఎల్పీనేత భట్టి విక్రమార్క 1,200 కిలోమీటర్లకు పైగా చేసిన పాదయాత్రకు భారీ ముగింపు పలికినట్టయింది.
Comments
Please login to add a commentAdd a comment