తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్ : కర్ణాటక ఆసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించి తమ పార్టీని గెలిపించారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ అన్నారు. ఆయన సమక్షంలో సామాజిక కార్యకర్త భువన రెడ్డి, జంగు ప్రహ్లాద్ సోమవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా విలేకరులతో లక్ష్మణ్ మాట్లాడుతూ... కర్ణాటకలో గవర్నర్ ఆదేశాలతోనే యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవి చేపట్టారని, కానీ కాంగ్రెస్-జేడీఎస్ కుట్రలు చేసి ఆయనను పది నుంచి దించేశాయని విమర్శించారు. సీఎం పదవిని తాకట్టు పెట్టి జేడీఎస్‌ను కాంగ్రెస్ లోబర్చుకుందని దుయ్యబట్టారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కుట్రలో భాగస్వాములుగా ఉన్నారని ఆరోపించారు.
ఒకప్పుడు కత్తులు దూసుకున్న జేడీఎస్, కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీని అధికారంలోకి రాకుండా కుట్రలు పన్నుతున్నాయని అన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేస్తున్న ఉద్యమాలు బూటకమన్నారు. ఈ రెండు పార్టీలు కూడా కలిసిపోతాయని, కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్ పావుగా మారిందని ఎద్ధేవా చేశారు. టీఆర్‌ఎస్-కాంగ్రెస్ కవల పిల్లలని వ్యాఖ్యానించారు. జేడీఎస్‌కు మద్దతు ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని, హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలకు బస ఏర్పాటు చేసి వారికి కావాల్సిన ఏర్పాట్లు చేసింది కేసీఆర్ అని అన్నారు.
దేశవ్యాప్తంగా బీజేపీ ఒకవైపు ఉంటే మిగిలిన పార్టీలన్నీ మరొకవైపు అనే పరిస్థితి వచ్చిందన్నారు. ఒంటరిగా బీజేపీని ఎదుర్కోలేక కాంగ్రెస్ వైరుధ్యాలున్న పార్టీలతో కలిసి ఎదుర్కోవాలని అనుకుంటోందని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని సంక్షేమ పథకాలు గులాబీ దండుకే పరిమితం, అయ్యాయని ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణాలో కూడా టీఆర్‌ఎస్‌ది జేడీఎస్ పాత్రేనని అన్నారు.
కాగా, ఎస్సీ వర్గీకరణ చేపట్టాలంటూ తెలంగాణ మహా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి బీజేపీ కార్యాలయం వద్ద నిరసనకు దిగింది. లక్ష్మణ్ వినతిపత్రం తీసుకోవడంతో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులు శాంతించారు.
Comments
Please login to add a commentAdd a comment