
సాక్షి, బెంగళూరు : విశ్వాస తీర్మానంపై మరికాసేపట్లో ఓటింగ్ జరగనుండగా కన్నడ రాజకీయం కీలక ఘట్టానికి చేరింది. గంట గంటకి ఆసక్తికర మలుపులు తిరుగుతోన్న ‘కర్నాటకం’లో తాజాగా ముఖ్యమంత్రి కుమారస్వామి మరోసారి స్పీకర్ రమేశ్‌కుమార్‌ను కలిశారు. బలపరీక్షకు సిద్ధంగా కావాలని స్పీకర్ సూచించగా, మరోవైపు సీఎం తనకుఓటింగ్‌కు మరి కొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే స్పీకర్ మాత్రం బలపరీక్ష ప్రక్రియ ఇవాళే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ఓటింగ్‌కు ముందే ముఖ్యమంత్రి కుమారస్వామి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. రాత్రి ఏడు గంటలకు కుమారస్వామి గవర్నర్ వాజుభాయ్ వాలా అప్పాయింట్ మెంట్ కోరారని వార్తలు రాగా.. అయితే ఆ వార్తలను సీఎంవో కార్యాలయ వర్గాలు ఖండించాయి.
చదవండి: బలపరీక్షకు ముందే కుమారస్వామి రాజీనామా..?
సభ 10 నిమిషాలు వాయిదా
అటు విశ్వాస తీర్మానంపై విధానసభలో చర్చ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది. చర్చను సాగదీయకుండా త్వరగా ముగించాలని స్పీకర్ సభ్యులను కోరారు. ప్రతి ఎమ్మెల్యే 10 నిమిషాలు మాత్రమే మాట్లాడాలని సూచించారు. అయితే బలపరీక్ష తక్షణమే నిర్వహించాలంటూ బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగటంతో స్పీకర్ సభను 10నిమిషాల పాటు వాయిదా వేశారు. మరోవైపు విశ్వాస పరీక్ష వద్దని కాంగ్రెస్ పట్టుబడుతోంది. కాగా 15మంది కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామా, ఇద్దరు స్వతంత్రుల మద్దతు ఉపసంహరణతో కుమారస్వామిప్రభుత్వం మైనార్టీలో పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సంకీర్ణ సర్కార్‌కి స్పీకర్ సహా 102మంది సభ్యుల బలముంది. ఇద్దరు స్వతంత్రుల మద్దతుతో బీజేపీ బలం 107కు పెరిగింది. సభలో బలపరీక్ష గట్టెక్కాలంటే 105మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేయాలి. ఇప్పటికే 15మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా.. రాజీనామా చేయకున్నా మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బలపరీక్షకు దూరంగా ఉంటున్నారు.
జేడీఎస్‌కి మద్దతిస్తున్న బీఎస్పీ ఎమ్మెల్యే మహేష్ కూడా సభకు గైర్హాజరయ్యారు. కాబట్టి బలపరీక్షపై ఓటింగ్ జరిగితే, కుమారస్వామి సర్కార్ కూలి కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్‌కి ఇక కాలం చెల్లినట్టే భావించాలి. బలపరీక్షపై ఓటింగ్ జరిగితే ప్రభుత్వం కూలిపోవడం తప్పనిసరి. ఒకవేళ అదే జరిగితే 107మంది సభ్యుల బలంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేకుంటే రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో గవర్నర్... రాష్ట్రపతి పాలనకు ఆదేశాలు ఇవ్వవచ్చు. కాగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం ఏదైనా రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితులు నెలకొంటే రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి గవర్నర్ సిఫార్సు చేయవచ్చు. ఇప్పటివరకూ కర్ణాటకలో ఐదుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు.
Comments
Please login to add a commentAdd a comment