ముంబై : జేడీఎస్, కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు వారు బస చేసిన హోటల్ వద్దకు చేరుకున్న మంత్రి డీకే శివకుమార్‌ను ముంబై పోలీసులు అడ్డగించిన సంగతి తెలిసిందే. హోటల్‌లో రూం బుక్ చేసుకున్నప్పటికి లోపలికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకోవటంతో మండిపడ్డ ఆయన అక్కడినుంచి వెనుదిరగలేదు. రెబల్ ఎమ్మెల్యేలతో మాట్లాడేంత వరకు హోటల్ వద్దనుంచి కదిలేది లేదని తేల్చి చెప్పారు. వర్షంలో తడుస్తూ అక్కడే ఉండి పోయారు. సీఎం కుమారస్వామి, డీకే శివకుమార్ వల్ల తమకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలంటూ రెబల్ ఎమ్మెల్యేలు ముంబై పోలీస్ కమిషనర్‌కు లేఖ రాయటంతో సదరు హోటల్ యాజమాన్యం శివకుమార్ బుకింగ్‌ను రద్దు చేసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోవాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జూలై 12 వరకు 144 సెక్షన్‌ను అమలు చేస్తూ అధికారులు ఆదేశాలు జారీచేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మేము.. మా స్నేహితులు 30,40 సంవత్సరాల నుంచి కలిసి రాజకీయాల్లో ఉంటున్నాం. తల్లీదండ్రులకు, భార్యాభర్తలకు, అన్నదమ్ములకు, స్నేహితులకు మధ్య ఒక్కోసారి బేధాభిప్రాయాలు వస్తుంటాయి. అంత మాత్రాన శాశ్వతంగా దూరమై పోరు. సంసారంలో గొడవలు వచ్చి భార్య బయటకు వెళ్లిపోతే విడాకులు ఇచ్చేసినట్లేనా? సంసారంలో ఇవన్నీ మామూలే. ఎవరో ఒకరు వారి మధ్య సయోధ్య కుదర్చాలి. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. ఈ రోజు ఎమ్మెల్యేలు గొడవపడి బయటకు వచ్చేశారు. బయటకు వచ్చేసినంత మాత్రాన కాంగ్రెస్‌తో శాశ్వతంగా బంధాలు తెంచుకున్నట్లు కాదు. నాతో కలిసి ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నవారు ఈ రోజు బయటకు వచ్చేశారు. అందుకే వాళ్లతో మాట్లాడదామని నేను ఇక్కడకు వచ్చాను. పోలీసులు నన్ను అడ్డగించారు. ఈ బీజేపీ వాళ్లు నాటకాలు చేస్తున్నార’’ని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment