జేడీఎస్ నేత కుమార స్వామి, కాంగ్రెస్ నేతలు గులాంనభీ ఆజాద్, సిద్ధరామయ్య
కర్ణాటకలో జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ ఆచితూచి స్పందిస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకు ఈ సర్కార్‌కు ఇబ్బందులు తలెత్తకుండా చూడడమో తక్షణ అవసరంగా ముందుకు సాగుతోంది. ఆ రాష్ట్రంలో బీజేపీని అధికారానికి దూరంగా పెట్టడంతో పాటు, లోక్‌సభ ఎన్నికల నేపధ్యంలో వివిధ రాష్ట్రాల్లో వీలైనన్ని ఎక్కువ భాగస్వామ్యపక్షాలకు చేరువయ్యేలా మంచి ఇమేజీ సాధనకు ప్రయత్నాలు సాగిస్తోంది. ఇటీవల ఎన్నికల్లో 78 సీట్లు సాధించినా , కేవలం 38 సీట్లు గెలుచుకున్న జేడీఎస్‌కు ప్రభుత్వ ఏర్పాటులో బేషరతు మద్ధతునివ్వడంతోనే కాంగ్రెస్ దీర్ఘకాల వ్యూహం స్పష్టమవుతోంది.
దీని ద్వారా జేడీఎస్‌కు జూనియర్ భాగస్వామిగా కొనసాగేందుకు మానసికంగా సిద్ధమైంది. కేబినేట్ కూర్పు, ఇతర కీలకాంశాల విషయంలో పట్టు విడుపులు ప్రదర్శించనున్నట్లు వెల్లడవుతోంది. 2006లో జేడీఎస్, బీజేపీల మధ్య చెరి 20 నెలలు సీఎం సీటును పంచుకోవాలనే ఒప్పందం బెడిసికొట్టిన దరిమిలా ఈసారి కాంగ్రెస్ ముఖ్యమంత్రి పీఠాన్ని సైతం కోరుకోవడం లేదు. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో బీజేపీ వ్యతిరేక, సెక్యులర్, ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు సొంత రాజకీయ ప్రయోజనాలు సైతం వదులుకునేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.
కర్ణాటకలో సంకీర్ణాన్ని సజావుగా కొనసాగించడం ద్వారా బీఎస్‌పీ, ఎస్‌పీ, తృణముల్ కాంగ్రెస్, ఎస్‌సీపీ, తదితర పార్టీల మద్ధతు కూడగట్టే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్ ఎన్నికల్లో అధికార బీజేపీకి చెక్ పెట్టడం ద్వారా లోక్‌సభ ఎన్నికలకు సానుకూల ధృక్పథంతో ముందుకు సాగాలని ఆశిస్తోంది.
జేడీఎస్ లక్ష్యం లోక్‌సభ ఎన్నికలే
జేడీఎస్ కురువృద్ధుడు హెడీ దేవెగౌడ కూడా తమ రాజకీయ ప్రాధాన్యాలను స్పష్టం చేశారు. తాము రాబోయే పెద్దయుద్ధానికి సిద్ధమవుతున్నట్లు(లోక్‌సభ ఎన్నికలకు) ప్రకటించారు. కర్ణాటకలో సెక్యులర్ విలువలున్న సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నారు. గతంలో బీజేపీతో చేతులు కలపడం వల్ల ఏర్పడిన మచ్చను తన కుమారుడు కుమారస్వామి ఇప్పుడు చెరుపుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. బీజేపీని అధికారానికి రాకుండా చేయాలన్నదే తమ ఉమ్మడి లక్ష్యమన్నారు. 2004-06 మధ్యకాలంలో చేసిన పొరపాట్లను కాంగ్రెస్-జేడీఎస్ గ్రహించాయని, ప్రస్తుత సంకీర్ణ సర్కార్ ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేస్తుందన్నవిశ్వాసం వ్యక్తం చేశారు. తమ తదుపరి లక్ష్యం లోక్‌సభ ఎన్నికలేనని, బీజేపీకి వ్యతిరేకంగా కర్ణాటకలో అన్ని సెక్యులర్ పార్టీలు ఒకే వేదికపైకి రావడం తక్షణ అవసరమని పేర్కొన్నారు.
గతఅనుభవాలు పునరావృతం కాకుండా..
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మాదిరిగానే 2004లోనూ బీజేపీకి 80 సీట్లు, కాంగ్రెస్‌కు 65 సీట్లు, జేడీఎస్‌కు 58 సీట్లు రావడంతో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. వొక్కలిగల నాయకుడు డీకే శివకుమార్, ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులకు మంత్రి పదవులు ఇవ్వొద్దంటూ జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ విధించిన షరతులతో మొదటి నుంచిఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. అప్పుడు జేడీఎస్‌లో ఉన్న డిప్యూటీ సీఎం సిద్ధరామయ్య ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం చేపట్టిన‘ అహిందా ర్యాలీ’ లను దేవెగౌడ తీవ్రంగా వ్యతిరేకించారు.
పార్టీని లేదా అహిందాలలో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలంటూ సిద్ధూపై తెచ్చిన ఒత్తిడి ఫలించకపోవడంతో ఆయనను బహిష్కరించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్న హెచ్‌డీ కుమారస్వామి ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మలచుకుని, పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేలను కూడగట్టారు.జేడీఎస్‌ను చీల్చేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని ఆరోపిస్తూ తన 40 మంది ఎమ్మెల్యేలతో కలసి బీజేపీతో దోస్తీకట్టారు. దీంతో ఆ సంకీర్ణ సర్కార్ పతనమైంది. దేవెగౌడ తన కొడుకు కుమారస్వామిని జేడీఎస్ నుంచి బహిష్కరించారు.
2006లో బీజేపీ-జేడీఎస్‌ల మధ్య చెరి 20 నెలలు అధికారాన్ని పంచుకోవాలనే ఒప్పందంతో ప్రభుత్వం ఏర్పడింది. మొదట కుమారస్వామి సీఎం పదవిని చేపట్టి 20 నెలల పదవీకాలం పూర్తయ్యాక బీజేపీకి అధికార మార్పిడి సందర్భంలో సమస్యలు తలెత్తాయి. ఆ తర్వాత సీఎంగా ప్రమాణం చేసినా బలనిరూపణకు జేడీఎస్ ఎమ్మెల్యేలు మద్ధతివ్వకపోవడంతో ఏడు రోజుల్లోనే యడ్యూరప్ప రాజీనామా చేయాల్సి వచ్చింది. కర్ణాటకలో ఈ పరిణామాలు పునరావృతం కాకూడదనే ఇప్పుడు కాంగ్రెస్ మరిన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది.
-సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment