
యడియూరప్ప
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలకపాత్ర పోషించిన 17 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. దీనికి సంబంధించి యడియూరప్ప మాట్లాడిన ఆడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జేడీఎస్ అధినేత, మాజీ సీఎం కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.
ఈ 17 మంది విశ్వాస పరీక్షకు హాజరుకాకుండా ముంబైలోని ఓ స్టార్ హోటల్‌కు తరలించడం సహా అన్ని ఏర్పాట్లను బీజేపీ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్‌షా పర్యవేక్షించారని యడియూరప్ప చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి. బీజేపీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆ 17 మంది ఎమ్మెల్యేలు తమ కుటుంబాలను వదిలి రెండు మూడు నెలల పాటు ముంబైలో ఉన్నారు. వారంతా మన ప్రభుత్వ ఏర్పాటుకు సహాయం చేశారు. నన్ను నమ్మి వారంతా తమ పదవులకు రాజీనామా చేశారు. వాళ్లకు అన్యాయం చేసి సీఎం అయ్యి నేరం చేశాననే భావన నాలో కలుగుతుంది. మీకు ఈ విషయాలన్నీ తెలియవు. మనం వాళ్లకి అండగా ఉండాలి’అని యడియూరప్ప వ్యాఖ్యానించారు.
సుప్రీం కోర్టును ఆశ్రయిస్తా: కుమారస్వామి
యడియూరప్ప వ్యాఖ్యలతో బీజేపీ నిజస్వరూపం బయటపడిందని కుమారస్వామి ఆరోపించారు. రెబల్ ఎమ్మెల్యేల విషయంలో యడియూరప్ప తనంతట తానే వాస్తవాలను బయటపెట్టారని అన్నారు. ఈ విషయంలో వీడియో క్లిప్పింగుల ఆధారంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని శనివారం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment