సమావేశం అనంతరం మీడియాతో రజనీకాంత్.. ఇన్‌సెట్‌లో వజుభాయ్-యెడ్యూరప్ప
సాక్షి, చెన్నై: కర్ణాటక రాజకీయ పరిణామాలపై సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. రజనీ మక్కల్ మండ్రమ్ మహిళా విభాగం కార్యకర్తలతో ఆదివారం రజనీ భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీపై రజనీ విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని పరిహసించాలని చూసిందని, కానీ, చివరకు న్యాయమే గెలిచిందని రజనీ వ్యాఖ్యానించారు.
‘కర్ణాటకలో గత కొన్ని రోజులుగా నాటకీయ పరిణామాలు నడిచాయి. ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ గడువు కోరితే.. గవర్నర్ ఏకంగా 15 రోజుల సమయం ఇచ్చారు. అంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని పరిహసించాలని యత్నించారు. కానీ, చివరకు ఏం జరిగింది? న్యాయస్థానం జోక్యం చేసుకోవటంతో పరిస్థితులు మారిపోయాయి. ఈ విషయంలో సుప్రీం కోర్టు తీర్పు హర్షించదగ్గ విషయం. ఎట్టకేలకు ప్రజాస్వామ్యం వర్థిల్లింది. కర్ణాటకలో జరిగిన విషయాన్ని పాలకులందరూ గమనించాలి’ అని రజనీ పేర్కొన్నారు.
ఎన్నికల గురించి... 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై రజనీ కాంత్ స్పష్టత ఇవ్వలేకపోయారు. ‘ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. ఎన్నికల తేదీలు ప్రకటించినప్పుడు నిర్ణయం తీసుకుంటాం. ఇంకా పార్టీని ప్రకటించలేదు కదా. అయినా అన్నింటికి మేం సిద్ధంగా ఉన్నాం. ఇక పొత్తుల గురించి ఇప్పుడే మాట్లడటం సరికాదు. పార్టీ ప్రకటించలేదు కాబట్టే కమల్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి వెళ్లలేకపోయా. భవిష్యత్తులో మాత్రం సమావేశాలకు ఖచ్ఛితంగా హాజరవుతా. కావేరీ జలాల బోర్డు, కర్నాటక ఆధీనంలో కాకుండా.. సీనియర్ ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో ఉంటేనే తమిళనాడుకు న్యాయం జరుగుతుంది’ అని రజనీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment