
సాక్షి, బెంగళూరు: ‘సిద్ధరామయ్యే నా తొలి శత్రువు. బీజేపీ కాదు’అని జేడీఎస్ మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి స్పష్టం చేశారు. సీఎల్పీ నాయకుడు సిద్ధరామయ్యపై మూడు రోజుల నుంచి జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధరామయ్యే కారణమని ఆరోపించారు, తాను సీఎం కావడాన్ని ఆయన ఏమాత్రం సహించలేకపోయారని మీడియాతో ఆదివారం వ్యాఖ్యానించారు.
తన సన్నిహిత ఎమ్మెల్యేల ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతూ చివరికి వారి చేత రాజీనామాలు చేయించి, ప్రభుత్వం కూలిపోవడానికి కారకులయ్యారని మండిపడ్డారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగాలని కాంగ్రెస్ పార్టీ అధిస్టానం సూచించడంతో, ఇష్టం లేకపోయినా బలవంతంగా తనను ముఖ్యమంత్రిగా అంగీకరించారన్నారు. ఆయన ఒత్తిడి మేరకే రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసులో సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని అన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో తాను ముఖ్యమంత్రిగా కాకుండా, క్లర్క్‌లాగా పనిచేశానని అన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ నేతలు తనపై పెత్తనం చేసేవారని, కలెక్టర్లు సహా అందరి బదిలీలు వారు చెప్పినట్లే చేశానని తెలిపారు.
సాయంత్రానికి మాట మార్పు..
ఈ వ్యాఖ్యల అనంతరం సాయంత్రానికే కుమారస్వామి మాట మార్చారు. తానెప్పుడూ సిద్ధరామయ్య తన తొలి శత్రువు అని చెప్పలేదని తెలిపారు. డిజిటల్ మీడియా విలేకరులకు కొన్ని రోజుల క్రితం ఇచ్చిన సందేశాన్ని తాజాగా కొందరు మార్చి చెబుతున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment