సాక్షి, బెంగళూరు : కర్ణాటక శాసనసభ మధ్యాహ్నం మూడు గంటల వరకూ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం గురువారం ఉదయం 11 గంటలకు విధానసభలో ముఖ్యమంత్రి కుమారస్వామి సర్కారుపై బలపరీక్ష చర్చ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి బలపరీక్ష కోసం ప్రవేశపెట్టిన తీర్మానంపై మధ్యాహ్నం వరకూ చర్చ కొనసాగగా....స్పీకర్ సభను భోజన విరామం కోసం మూడింటి వరకూ వాయిదా వేశారు. మరోవైపు 15మంది రెబల్ ఎమ్మెల్యేలు సహా మొత‍్తం 21మంది సభకు గైర్హాజరు అయ్యారు. విశ్వాస తీర్మానంపై ఓటింగ్ కోసం బీజేపీ పట్టుపట్టగా, సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. కుమరస్వామి సర్కార్ మైనార్టీలో పడిందన్న బీజేపీ ఎమ‍్మెల్యేలు...బల నిరూపణ చేసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పక్షనేత, మాజీ సీఎం సిద్ధరామయ్య ఘాటుగా స్పందించారు. సుప్రీంకోర్టు వాదనల్లో న్యాయమూర్తులు, న్యాయవాదులెవరూ విప్‌పై మాట్లాడలేదన్న ఆయన సభకు హాజరు కాకుంటే రెబల్ ఎమ్మెల్యేలు విప్ ధిక్కరించినట్లేనని అన్నారు, పార్టీ నాయకుడిగా విప్ జారీ చేసే హక్కు తనకు ఉందని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అసమ్మతి ఎమ్మెల్యేల భవితవ్యం తేలేవరకూ విశ్వాస పరీక్ష జరపటం సరికాదని అన్నారు. మరోవైపు తమ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలన్నింటికీ సమాధానం చెబుతామని ముఖ్యమంత్రి కుమారస్వామి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment