దేశానికి హృదయ స్థానమైన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోరు ఉచితాల జాతరను తలపిస్తోంది. ప్రజలకు ఉచిత పథకాలు ప్రకటించడంలో ప్రధాన పార్టీలైన అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ రెండూ నువ్వా నేనా అన్నట్టుగా పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓటరు ఎవరిని ‘సముచితంగా ఆదరిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది...
మధ్యప్రదేశ్‌లో దీర్ఘకాలంగా బీజేపీ, కాంగ్రెస్ ద్విముఖ పోరు కొనసాగుతూ వస్తోంది. ఈసారి బీఎస్పీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బరిలో ఉన్నా ప్రధాన పోరు మాత్రం మళ్లీ ఆ రెండింటి మధ్యేనని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయం కోసం సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ (64), పీసీసీ చీఫ్ కమల్‌నాథ్ (76) సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి ఎలాగైనా అధికారాన్ని నిలుపుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంది.
ముఖ్యంగా దక్షిణాదిన తాము అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక కాంగ్రెస్‌కు చేజారిన అనంతరం జరుగుతున్న కీలక అసెంబ్లీ ఎన్నిక కావడంతో దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్ర మంత్రులతో పాటు పలువురు సీనియర్ ఎంపీలను కూడా ఇప్పటికే అసెంబ్లీ బరిలో దింపింది. తద్వారా మధ్యప్రదేశ్‌లో విజయం తనకెంత ముఖ్యమో చెప్పకనే చెప్పింది. వీటన్నింటికీ మోదీ చరిష్మా తోడై ఈసారి కూడా గట్టెక్కిస్తుందని ఆశిస్తోంది. ‘ఎంపీ కే మన్ మే మోదీ...’నినాదంతో ఊరూవాడా హోరెత్తిస్తోంది.
అంతేగాక సీనియర్లలో విభేదాలు తలెత్తకుండా, ప్రభుత్వ వ్యతిరేకత నేరు గా పార్టీ విజయావకాశాలపై పడకుండా చూసేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే చౌహాన్‌ను సీఎం అభ్యర్థిగా కూడా ప్రచారం చేయకుండా గుంభనంగా వ్యవహరిస్తోంది. నిన్నటితరం బీజేపీ దిగ్గజాలై న ఎల్‌కే అద్వానీ కాలానికి చెందిన నేటికీ బీజేపీలో చురుగ్గా ఉన్నది బహుశా ఆయనొక్కరే. ఇక కాంగ్రెస్ కూడా వర్గాలవారీగా ఓట్ల వేటలో పడింది. దళితుడైన పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే 35 ఎస్సీ స్థానాలపై లోతుగా దృష్టి సారించినట్టు సమాచారం.
ప్రచారంలో పెద్దలు...
రాష్ట్రంలో ఎన్నికల ప్రచార బరిలో అన్ని పార్టీల నుంచీ అగ్రనేతలు ఇప్పటికే బరిలో దిగారు. బీజేపీ నుంచి ప్రధానిమోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సుడిగాలి పర్యటనలు చేయనున్నారు.
- కాంగ్రెస్ ప్రచార భారాన్ని ఖర్గేతో పాటు రాహు ల్, ప్రియాంక మోస్తున్నారు. కమల్‌నాథ్‌కు దన్ను గా వెటరన్ నేత దిగ్విజయ్ సింగ్ నిలుస్తున్నారు.
- ఆప్ నుంచి కేజ్రీవాల్, భగవంత్ మాన్ మరిన్ని సభలూ, సమావేశాలకు ప్లాన్ చేస్తున్నారు.
బీజేపీ..
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చిన నేపథ్యంలో ఈసారి ఏ చిన్న అవకాశాన్నీ వదలకూడదన్న అభిప్రాయంలో బీజేపీ ఉంది. అందుకే గిరిజన, ఓబీసీ, మహిళా... ఇలా ఓటర్లను సెగ్మెంట్లవారీగా విభజించుకుని మరీ లోతుగా దృష్టి పెడుతోంది. వీటికి తోడుగా హిందూత్వ కార్డు ఎలాగూ అండగా ఉంటుందని ఆశిస్తోంది. సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రధానంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని పలు ఉచిత పథకాలు ప్రకటించారు.
- లాడ్లీ బెహనా యోజన కింద రాష్ట్రంలోని 1.32 కోట్ల మహిళలకు అందుతున్న నెలవారీ ఆర్థికసాయాన్ని ఏకంగా రూ.3,000కు పెంచుతామని పేర్కొన్నారు.
- గత జూన్‌లో ఈ పథకాన్ని మొదలు పెట్టినప్పుడు ఈ సాయం తొలుత రూ.1,000 ఉండగా రూ.1,250కి, తర్వాత రూ.1,500కు పెంచారు. ఆర్థికంగా వెనకబడ్డ మహిళలకు ఉద్దేశించిన ఈ పథకంపై సర్కారు ఇప్పటికే ఏకంగా ఏటా రూ.16,000 కోట్లు వెచ్చిస్తోంది.
- రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ అందజేస్తామని ప్రకటించారు.
కాంగ్రెస్..
పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ కూడా వరుసబెట్టి ఇప్పటికే పలు ఉచిత పథకాలు ప్రకటించారు. ఓ బీసీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
- మహిళలకు నారీ సమ్మాన్ నిధి’పేరుతో నెలకు రూ.1,500 అందజేస్తామని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ప్రకటించారు.
- ప్రతి ఇంటికీ రూ.500కే ఎల్పీజీ సిలిండర్ అందజేస్తామని పేర్కొన్నారు.
- రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు పాత పెన్షన్ పథకాన్ని తిరిగి తెస్తామని ప్రకటించారు.
- రాష్ట్రంలో ఏకంగా 45 శాతమున్న ఓబీసీలకు రిజర్వేషన్లను 14 శాతం నుంచి 27 శాతానికి పెంచుతామని కమల్‌నాథ్ ప్రకటించారు. ఆయన సీఎంగా ఉండగా ఈ మేరకు నిర్ణయం తీసుకోగా కోర్టు దాన్ని కొట్టేసింది.
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని కూడా ప్రకటించారు.
పార్టీల భక్తి బాట...
- ఓట్ల వేటలో భాగంగా మధ్యప్రదేశ్‌లో బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా ఈసారి భక్తి బాట పట్టడం విశేషం.
- ఆలయాల పునరి్నర్మాణం, సుందరీకరణపై చౌహాన్ పెద్ద ఎత్తున దృష్టి పెట్టారు. ఇందుకు రూ.3,000 కోట్లు వెచ్చిస్తున్నారు. ప్రఖ్యాత ఉజ్జయినీ మహాకాళేశ్వర మందిరాన్ని, దాని అనుబంధ మ్యూజియాలను మెరుగు పరుస్తున్నారు.
- ఖాండ్వా జిల్లాలోని ప్రఖ్యాత ఓంకారేశ్వర్‌లో 108 అడుగులతో ఆది శంకరుల విగ్రహాన్ని ఇటీవలే ఆవిష్కరించారు.
- కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ కూడా ఇటీవల జబల్‌పూర్‌లో నర్మదా నదిలో పాల్గొన్నారు. జై నర్మద, జై బజరంగ బలి అంటూ నినాదాలతో ఆకట్టుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్‌నాథ్ కూడా పలు మతపరమైన కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్
ఆప్, బీఎస్పీ కూడా...
ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ కూడా ఈసారి బలంగా ఉనికి చాటుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ఆ పార్టీ పాలిత పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి రాష్ట్రంలో నాలుగుసార్లు పర్యటించారు. ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు.
- ఉచిత విద్య, వైద్యం, కరెంటు అందిస్తామని ఆప్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment