ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో అత్యధిక సీట్లున్న రాష్ట్రం మధ్యప్రదేశ్. 230 స్థానాలకు ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్ 17న పోలింగ్ జరగగా డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడనున్నాయి. గత రెండు దశాబ్దాలుగా తమకు కంచుకోటగా ఉన్న రాష్ట్రాన్ని బీజేపీ నిలుపుకోనుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. గత ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ పట్టుమని 15 నెలలు కూడా మనుగడ సాగించలేకపోయింది. జ్యోతిరాదిత్య సింధియా తన విధేయులైన ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ మారడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది.
2023లో పెరిగిన ఓటింగ్
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి అత్యధిక ఓటింగ్ జరిగింది. గతంలో కంటే ఎక్కువ మంది పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేశారు. 2023 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 76.22 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక్కడ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 74.97 శాతం ఓటింగ్ జరిగింది. 2023 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి. అదే రోజున ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ ఓట్ల లెక్కింపు కూడా జరగనుంది. మిజోరంలో కౌంటింగ్‌ను ఒకరోజు వాయిదా వేశారు.
2,533 మంది అభ్యర్థులు
మధ్యప్రదేశ్‌లోని 230 నియోజకవర్గాల్లో 2,533 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే ఉన్నప్పటికీ బహుజన సమాజ్ పార్టీ, ఆజాద్ సమాజ్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, ఆమ్‌ఆద్మీ వంటి పార్టీలు కూడా గణనీయమైన స్థానాల్లో పోటీ చేశాయి. కాగా ఈ ఎన్నికల్లో 5.59 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
బీజేపీ వరుస విజయాలకు బ్రేకులు
మధ్యప్రదేశ్‌లో వరుసగా మూడు పర్యాయాలు గెలుస్తూ వచ్చిన బీజేపీకి 2018లో కాంగ్రెస్ బ్రేకులు వేయగలిగింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ కేవలం 109 స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే 116 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ను మాత్రం కాంగ్రెస్ అందుకోలేకపోయింది. స్వతంత్రులు, ఇతర పార్టీల ఎమ్మెల్యేల సాయంతో కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది ఎంతోకాలం నిలవలేదు. పార్టీలో కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా తనతో సహా 21 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరారు. దీంతో పట్టుమని 15 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment