న్యూఢిల్లీ: ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత వాగ్దానాలను తప్పుబడుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని స్వీకరించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. ‘ఓటర్ల నుంచి రాజకీయ లబ్ది పొందేందుకు పార్టీలు చేస్తున్న ఈ ఉచిత తాయిలాల ప్రకటనలు, వాగ్దానాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. వీటిపై నిషేధం విధించేలా కేంద్ర ఎన్నికల సంఘం తగు చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వండి’ అంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ పిల్‌ను దాఖలుచేశారు.
ఈయన తరఫున సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా బుధవారం సుప్రీంకోర్టులో వాదించారు. ‘ ఉచిత వాగ్దానాలిచ్చే రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దుచేసి, ఆయా పార్టీల ఎన్నికల గుర్తులను స్తంభింపజేయాలి’ అని కోరారు. ‘ ఇది చాలా ముఖ్యమైన అంశం. ఈ పిటిషన్‌ను వీలైనంత త్వరగా విచారిస్తాం. ఏ తేదీన విచారించాలన్న దానిపై గురువారం బోర్డ్‌లో చర్చిస్తాం’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం పేర్కొంది.
లోక్‌సభ ఎన్నికల తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజే ఉచితాలపై పిల్ దాఖలవడం గమనార్హం. ‘‘ప్రజాధనంతో నిర్హేతుకమైన ఉచిత పథకాలు ప్రకటించడంతో ఓటర్లు ఎన్నికల ప్రక్రియలో ప్రభావితమయ్యే అవకాశం చాలా ఎక్కువ. పోటీ పార్టీల విజయావకాశాలనూ ఇవి దెబ్బతీస్తాయి. పారదర్శకమైన ఎన్నికల క్రతువుకు ఇది విఘతం. ఉచితాలు ప్రజాస్వామ్య విలువల మనుగడనే ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. ప్రజాస్వామ్య స్పూర్తికి గొడ్డలిపెట్టు’’ అని పిటిషనర్ పేర్కొన్నారు.
‘‘ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న ఈ ఉచితాలు ఒక రకంగా ఓటర్లకు లంచాలు ఇవ్వడం లాంటిదే. అధికార పార్టీ మళ్లీ అధికారంలో కొనసాగడానికి ఇది ఒక మార్గంలా పనికొస్తోంది. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ఇలాంటి ధోరణులకు చెక్ పెట్టాల్సిందే. ఇందులోభాగంగా ఎన్నికల గుర్తుల(రిజర్వేషన్, అలాట్‌మెంట్) ఉత్తర్వు, 1968లోని సంబంధిత పేరాలో అదనపు షరతులను ఈసీ జతచేయాలి. ఎన్నికలకు ముందు ప్రజాధనంతో నిర్హేతుక ఉచితాల వాగ్దానాలు చేయొద్దని పార్టీలకు షరతు విధించాలి’ అని పిటిషనర్ కోర్టును కోరారు.
Comments
Please login to add a commentAdd a comment