మామా.. సీఎం మామా! | Madhya Pradesh Election Result 2023: BJP Records Dominant Win In Madhya Pradesh | Sakshi
Sakshi News home page

మామా.. సీఎం మామా!

Published Mon, Dec 4 2023 4:41 AM | Last Updated on Mon, Dec 4 2023 4:41 AM

Madhya Pradesh Election Result 2023: BJP Records Dominant Win In Madhya Pradesh - Sakshi

మధ్యప్రదేశ్‌లో బీజేపీ సాధించిన ఘనవిజయం రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరిచింది. కాంగ్రెస్‌తో హోరాహోరీగా సాగిన పోరులో బీజేపీ గెలవవచ్చని భావించినా, ఈ స్థాయి విజయం మాత్రం అనూహ్యమే. ఎందుకంటే మధ్యలో 15 నెలల కాంగ్రెస్‌ పాలనను మినహాయిస్తే రాష్ట్రంలో 20 ఏళ్లుగా బీజేపీదే అధికారం. ఈ నేపథ్యంలో కొద్ది నెలల క్రితం దాకా కూడా కొట్టొచ్చినట్టుగా కని్పంచిన ప్రభుత్వ వ్యతిరేకతను ఆ పార్టీ, ముఖ్యంగా సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సమర్థంగా అధిగమించిన వైనం అబ్బురపరిచేదే. రాష్ట్ర ప్రజలు ప్రేమగా ‘మామ’ అని పిలుచుకునే చౌహాన్‌ ఈ విషయంలో ముందునుంచే పక్కాగా వ్యవహరిస్తూ వచ్చారు.

ఒక్కొక్కటిగా పలు ప్రజాకర్షక పథకాలను తెరపైకి తెస్తూ ప్రజల్లో అసంతృప్తిని తగ్గించగలిగారు. ప్రధాని నరేంద్ర మోదీ మేనియా, బూత్‌ స్థాయి నుంచి పక్కా ఎన్నికల ప్రణాళిక, పారీ్టపరంగా వ్యవస్థాగతమైన బలం వంటివన్నీ అందుకు తోడయ్యాయి. వ్యక్తిగతంగా శివరాజ్‌కు ఉన్న మంచి పేరు కూడా బాగా కలిసొచ్చింది. వివాదాలకు దూరంగా నిరాడంబర వ్యక్తిత్వంతో రాష్ట్ర ప్రజల మనసుల్లో ఆయన పట్ల మొదటి నుంచీ ఉన్న సానుకూల భావన ఓట్ల రూపంలోనూ ప్రతిఫలించింది. ఇక సమన్వయరాహిత్యం కాంగ్రెస్‌ పార్టీని ఈసారి బాగా దెబ్బ తీసింది. పీసీసీ చీఫ్‌ కమల్‌నాథ్, అగ్ర నేత దిగి్వజయ్‌సింగ్‌ మధ్య విభేదాలు ప్రచార పర్వంలో పలుసార్లు తెరపైకి వచ్చాయి.

‘లాడ్లీ’ సూపర్‌ హిట్‌...
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పలు ప్రజాకర్షక పథకాలకు శివరాజ్‌ తెర తీస్తూ వచ్చారు. అధికారంలోకి వస్తే నారీ సమ్మాన్‌ నిధి పేరిట ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామన్న కాంగ్రెస్‌ హామీకి ప్రతిగా లాడ్లీ బెహనా యోజన తీసుకొచ్చారు. ప్రతి మహిళకు నెలకు రూ.1,250 చొప్పున ఇచ్చే ఈ పథకం బాగా హిట్టయింది. ఈ మొత్తాన్ని క్రమంగా నెలకు రూ.3,000కు పెంచుతానని కూడా శివరాజ్‌ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 2.72 కోట్ల మహిళా ఓటర్లుంటే, ఏకంగా కోటిన్నర మంది మహిళలు దీని లబి్ధదారులు! ఇది బీజేపీకి బాగా కలిసి వచి్చందని భావిస్తున్నారు. అంతేగాక శివరాజ్‌పై అధిష్టానం అభిప్రాయాన్ని మార్చడం ద్వారా ఆయన్ను తిరిగి సీఎం అభ్యర్థి రేసులో బలంగా నిలిపింది.

అంతర్గత సమస్యలను అధిగమిస్తూ...
ఎన్నికల వేడి మొదలయ్యే నాటికి మధ్యప్రదేశ్‌లో బీజేపీ పరిస్థితి అంత ఆశాజనకంగా కూడా ఏమీ లేదు. సుదీర్ఘ కాలంగా సీఎంగా ఉన్న 64 ఏళ్ల శివరాజ్‌ పని కూడా అయిపోయిందని, ఈ ఎన్నికలతో ఆయన రాజకీయ కెరీర్‌కు తెర పడ్డట్టేనన్న ప్రచారమూ జరిగింది. ప్రభుత్వ వ్యతిరేకతను తప్పించుకునేందుకు అధిష్టానం కూడా ఆయన ప్రాధాన్యతను క్రమంగా తగ్గిస్తూ వచి్చంది. సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటించలేదు. ఇటు బీజేపీలో అంతర్గతంగా కూడా పరిస్థితులు గొప్పగా లేవు. నేతల గ్రూపు తగాదాలతో పాటు కార్యకర్తల్లోనూ నిస్తేజం ఆవహించిన పరిస్థితి! అలాంటి స్థితిని క్రమంగా బీజేపీకి అనుకూలంగా మార్చడంలో, నేతల్లో ఐక్యత సాధించడంతో పాటు కార్యకర్తల్లో ఉత్తేజం నింపడంలో శివరాజ్‌ విజయం సాధించారు. తనను సీఎం అభ్యరి్థగా ప్రకటించకపోయినా ఎన్నికల బాధ్యతలను తలకెత్తుకుని నడిపించారు.

మేరా బూత్, సబ్‌ సే మజ్‌బూత్‌...
2018 అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీకి స్వల్ప దూరంలో ఆగిపోయిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి బీజేపీ ముందునుంచే చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచి్చంది. గత జూలై నుంచే పూర్తిస్థాయిలో రంగంలోకి దిగింది. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ను రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జిగా, మరో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ఆయనకు డిప్యూటీగా నియమించింది. ఇంకోమంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ను పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ కనీ్వనర్‌గా వేసి ప్రతి విషయంలోనూ ముందునుంచే శ్రద్ధ తీసుకుంది.

ఇక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను, 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ప్రధాని మోదీ సూచించిన ‘మేరా బూత్, సబ్‌ సే మజ్‌బూత్‌’ కార్యక్రమం మధ్యప్రదేశ్‌లో ఈసారి బీజేపీకి మంచి ఫలితాలిచి్చంది. బలమైన స్థానిక నేతల్లో ఒక్కొక్కరికి ఒక్కో బూత్‌ పరిధిలో పార్టీ అవకాశాలను బలోపేతం చేసే బాధ్యతను నాయకత్వం అప్పగించింది. వారి పనితీరును ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తూ ప్రోత్సహించింది. దీనికి తోడు మోదీ కూడా రాష్ట్రంలో ప్రచారంతో హోరెత్తించారు 14 ర్యాలీల్లో పాల్గొన్నారు. ఆయన ప్రసంగాలకు యువతతో పాటు మహిళలు విపరీతంగా స్పందించారు. ‘ఎంపీ (మధ్యప్రదేశ్‌) మనసులో మోదీ, మోదీ మనసులో ఎంపీ’ నినాదం బాగా ప్రజల్లోకి వెళ్లింది.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement