ఆయన ధైర్యమే ఒక సైన్యమయ్యింది.. ఒదిగి ఉన్న ఓర్పే అగ్ని కణమై మండింది.. పెను నిశ్శబ్దమే.. దిక్కులు పిక్కటిల్లేలా విజయనాదం మోగించింది.. అణచివేసే అన్యాయాన్ని అంతం చేసేలా.. బడుగు జీవుల ఆశా దీపమై.. కన్నీళ్లు తుడిచే నాయకుడిగా నిలబెట్టింది..ఆ జన నాయకుడికి కృష్ణా తీరం సాహో అంటూ జై కొట్టింది. కనీవినీ ఎరుగని రీతిలో ఓట్ల తు‘ఫ్యాన్’ను సృష్టించింది. ఉద్దండులను సైతం మట్టికరిపిస్తూ గెలుపు పతాక ఎగరవేసింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ సత్తా చాటింది. 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏకంగా 14 కైవసం చేసుకుంది.
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ సత్తా చాటింది. ఫ్యాన్ సునామీకి సైకిల్ ముక్కచెక్కలైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని ఆధిక్యం దక్కింది. బెజవాడ ఇక అభివృద్ధి పథంలో పయనించనుంది.
ఓట్లతోనే మాట్లాడారు..
పల్లె, పట్టణ ఓటర్లు ఏకమయ్యారు. ఫ్యాన్‌పై అభిమానం చూపారు. ఓట్ల వర్షం కురిపించారు. రూ. కోట్లు కుమ్మరించిన వారిని ఓట్లతో తిప్పి కొట్టారు. తిరుగులేని రీతిలో జవాబిచ్చారు. రైతు వర్గాల్లో, పల్లె జనాల్లో తమకే పట్టు ఉందని బీరాలు పలికిన టీడీపీ సైకిల్‌కు పంచరు చేశారు. మచిలీపట్నం, ఏలూరు ఎంపీ అభ్యర్థులను ఏకపక్షంగా గెలిపించారు. బ్రహ్మాండమైన విజయాన్ని అందించారు. విజయవాడ పార్లమెంటు స్థానానికి సంబంధించి టీడీపీ అభ్యర్థి కేశినేని నాని ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి.. కేవలం రెండు నియోజకవర్గాలతో సరిపెట్టుకున్న టీడీపీ.. గన్నవరం నియోజకవర్గంలో కొద్దిపాటి మెజార్టీతో బయటపడింది.
ఆది నుంచి మెజార్టీ అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యత కనబర్చిన వైఎస్సార్‌సీపీ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు, ముఖ్య నాయకులుగా చెలామణి అయిన కొల్లురవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, కేఎస్ జవహర్, బొడె ప్రసాద్ లాంటి వారికి ఓటమి తప్పలేదు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 11న జరిగాయి. 16 నియోజకవర్గాల నుంచి 205 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. అలాగే రెండు పార్లమెంటు స్థానాల్లోనూ 27 మంది పోటీలో నిలిచారు. ఎన్నికలు ముగిసినప్పటి నుంచి జిల్లాలో స్తబ్దుగా ఉన్న వాతావరణం నిన్నటి నుంచి వేడిగా మారింది. ఎన్నికలు ముగిశాక కౌంటింగ్‌కు 43 రోజులు వేచి చూసిన అభ్యర్థులు గురువారం కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉత్కంఠగా ఫలితాల సరళిని గమనించారు.
కంచుకోటకు బీటలు..
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి కృష్ణా జిల్లా ఆ పార్టీకి అండగానే నిలుస్తూ వస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలతోపాటు 10 అసెంబ్లీ స్థానాల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మరో స్థానంలోనూ ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీని గెలిపించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో వాణిజ్య నగరమైన విజయవాడ భాగమవడం.. అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రావడంతో జిల్లా అభివృద్ధిపై ప్రజలు ఎన్నో ఊహించుకున్నారు. అయితే టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ ప్రజాహిత కార్యక్రమాలు ఏమీ చేపట్టకపోవడంతో ప్రజలు ఆపార్టీకి దిమ్మతిరిగే తీర్పు ఇచ్చారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేతకు ఓట్లతో హారతి పట్టారు. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు మాదిరిగానే 13 నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ స్పష్టమైన మెజార్టీ రావడంతో దేశం కోట ముక్కచెక్కలైంది.
ఆధిక్యం దోబూచులాట..
గన్నవరం అసెంబ్లీ స్థానం లెక్కింపు కేంద్రంలో టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావ్‌ల మధ్య ఆధిక్యం దోబూచులాడగా.. వెంకట్రావ్ మొదటి నుంచి ఫలితాల సరళిని గమనించారు. అయితే కౌంటింగ్ కేంద్రానికి రాని వంశీ చివరలో మొరాయించిన ఈవీఎంలు లెక్కింపు విషయంలో కలెక్టర్ ఇంతియాజ్‌తో మాట్లేందుకు సాయంత్రం కౌంటింగ్ కేంద్రానికి వచ్చారు. చివరకు ఈవీఎంల స్థానంలో వీవీప్యాట్లలోని స్లిప్‌లను లెక్కిం చగా 820 ఓట్లతో వంశీ బయటపడ్డారు.
హోరాహోరీ..
సెంట్రల్ అసెంబ్లీ స్థానం లెక్కింపు కేంద్రంలో టీడీపీ అభ్యర్థి బొండా ఉమా, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మల్లాది విష్టుల నడుమ నువ్వా నేనా అన్నట్లు హోరాహోరి పోరు జరిగింది. మొదట కొన్ని రౌండ్లపాటు ఆధిక్యంలో ఉన్న వైఎస్సార్‌సీపీ 15 రౌండ్ ముగిసే సరికి 64 ఓట్లతో టీడీపీ అభ్యర్థి బొండా ముందంజలోకి వచ్చారు. ఇక అప్పటి నుంచి రౌండు రౌండ్‌కూ ఆయన ఆధిక్యం ప్రదర్శిస్తూ వచ్చారు. చివరకు 17వ రౌండ్ వచ్చే సరికి 1659 ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నారు. చివరి మూడు రౌండ్లలో మెజార్టీ నీదా నాదా అన్నట్లు సాగి.. చివరకు మల్లాది విష్ణు 19 ఓట్లతో గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment