
న్యూఢిల్లీ: వరుసగా రెండోసారి కేంద్రంలో విజయదుందుభి మోగించిన బీజేపీకి ఎన్నికల హామీల అమలు సవాల్‌గా మారనుంది. వాగ్దానాల అమలుకు రూ. లక్షలాది కోట్ల నిధులను సమీకరించాల్సి ఉండటమే అందుకు కారణం. బీజేపీ సంకల్ప పత్ర పేరిట విడుదల చేసిన మేనిఫెస్టోలో భారీగా హామీలు గుప్పించింది. ముఖ్యంగా 2025 నాటికి దేశ ఆర్థిక రంగాన్ని 5 లక్షల కోట్ల డాలర్లకు, 2032 నాటికి 10 లక్షల కోట్ల డాలర్లకు చేరుస్తామని, వ్యవసాయ రంగంలో రూ. 25 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని, రూ. లక్ష వరకు వడ్డీలేని సాగు రుణాలు ఇస్తామని హామీ ఇచ్చింది. 60 వేల కి.మీ. జాతీయ రహదారులను నిర్మిస్తామని, 100 కొత్త ఎయిర్‌పోర్టుల కార్యకలాపాల ప్రారంభం, 400 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, పన్నుల తగ్గింపు, మౌలిక వసతుల రంగంలో 2024 నాటికి రూ. 100 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని పేర్కొంది. దేశానికి స్వాతంత్య్రం లభించి వందేళ్లు పూర్తయ్యే 2047కి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామని మేనిఫెస్టో విడుదల సందర్భంగా మోదీ హామీ ఇచ్చారు. 2018–19 సంవత్సరానికి దేశ ఆర్థిక వృద్ధి రేటు ఐదేళ్ల కనిష్టానికి 7 శాతంగా నమోదవడం ప్రతికూలంశంగా పరిణమించనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల హామీల అమలుకు కమలదళం ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తుందో వేచి చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment