న్యూజిలాండ్ ఎన్నికల్లో జెసిండా ఘన విజయం | Jacinda Ardern wins landslide victory in New Zealand election | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్ ఎన్నికల్లో జెసిండా ఘన విజయం

Published Sat, Oct 17 2020 4:54 PM | Last Updated on Sat, Oct 17 2020 5:33 PM

Jacinda Ardern wins landslide victory in New Zealand election - Sakshi

న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్(40)మరోసారి విజయ పతాకాన్ని ఎగుర వేశారు. న్యూజిలాండ్ సార్వత్రిక ఎన్నికలలో ఆమె ఘన విజయం సాధించారు. కరోనాను విజయవంతంగా అరికట్టడంలో ఆమె చేసిన  కృషి, సమర్ధవంతమైన పాలన ఆమెకు అఖండ విజయాన్ని సాధించి పెట్టాయి. దేశంలోని ఏకసభ్య పార్లమెంటులో 120 స్థానాల్లో 64 స్థానాల్లో మెజార్టీతో దూసుకుపోతోంది. పార్టీ. సగానికి పైగా సీట్లు గెలిస్తే, లేబర్ పార్టీ తొలి సింగిల్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర సృష్టించనుంది. దీంతో ఓటమిని అంగీకరించిన ప్రధాన ప్రతిపక్ష జాతీయ పార్టీ నాయకుడు జుడిత్ కాలిన్స్ ఆర్డెర్న్‌ను అభినందించారు. 

విజయం అనంతరం ఆక్లాండ్‌లో తన మద్దతుదారులతో జెసిండా మాట్లాడారు. రాబోయే మూడేళ్ళలో తాను చేయవలసిన పని చాలా ఉందని వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారితో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం, సామాజిక అసమానతల పరిష్కారం తనముందున్న సవాళ్లని ఆమె పేర్కొన్నారు. గతంకంటే మరింత ఎక్కువ శ్రమించాల్సి ఉంటుందని, అయితే కరోనా సంక్షోభం నుంచి చాలా వేగంగా బయటపడతామన్న ధీమాను వ్యక్తం చేశారు. కోవిడ్-19 కట్టడిలో తమ ప్రభుత్వానికి ప్రజాభిప్రాయ సేకరణలాంటిదంటూ లేబర్ పార్టీ ఘన విజయంపై ఆర్థిక మంత్రి గ్రాంట్ రాబర్ట్‌సన్ సంతోషం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.  

ఆర్డెర్న్ లేబర్ పార్టీ 49 శాతానికి పైగా ఓట్ షేర్ ను దక్కించుకుంది.1930 తరువాత ఇదే అతిపెద్ద ఓట్ షేర్ అని భావిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష నేషనల్ పార్టీ 27 శాతానికి పరిమితమైంది. జెసిండా ప్రజాదరణ, మానియాకు ఇది నిదర్శనమని పొలిటికల్ వెబ్‌సైట్ డెమోక్రసీ ప్రాజెక్ట్ విశ్లేషకుడు జెఫ్రీ మిల్లెర్ వ్యాఖ్యానించారు. ఆమె సూపర్ స్టార్ బ్రాండ్‌కు లభించిన వ్యక్తిగత విజయమని పేర్కొన్నారు. వెల్లింగ్టన్ విక్టోరియా విశ్వవిద్యాలయానికి చెందిన రాజకీయ వ్యాఖ్యాత బ్రైస్ ఎడ్వర్డ్స్ మాట్లాడుతూ, 80 సంవత్సరాలలో న్యూజిలాండ్ ఎన్నికల చరిత్రలో ఇదే అతిపెద్ద విజయమని వ్యాఖ్యానించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement