వెల్లింగ్టన్: కరోనాను కట్టడి చేసిన దేశంగా న్యూజిలాండ్ పేరు మార్మోగిపోయింది. 102 రోజులుగా ఒక్క కరోనా కేసు లేకపోవడంతో ఓరకంగా పండగ వాతావరణమే నెలకొంది. అయితే కరోనాను నిర్మూలించినందుకుగానూ ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డర్న్ ఆక్లాండ్‌లోని రాధాకృష్ణుల ఆలయాన్ని సందర్శించారంటూ తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కష్ణాష్టమి సందర్భంగా ఈ వార్త మరింత ప్రాధాన్యం సంతరించుచుకుంది. ఇందులో ఆమె ఆలయంలోకి ప్రవేశించే ముందు తన పాదరక్షలను బయటే వదిలి గుడిలోకి అడుగు పెట్టారు. హారతి పూజలో పాల్గొన్నారు. అనంతరం ప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే ఆమె భారతీయ సాంప్రదాయ వంటకమైన పూరీ, పప్పును తింటున్న ఫొటో సైతం నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. అయితే గతంలోనే న్యూజిలాండ్‌ను కోవిడ్ ఫ్రీగా ప్రకటించే సమయంలో జెసిండా హిందూ ఆలయానికి వెళ్లారని మరో ప్రచారమూ జరుగుతోంది. (మానవాళికి మంచిరోజులు! )
నిజంగానే జెసిండా ఆర్డర్న్ గుడికి వెళ్లారు. కానీ కరోనా కట్టడికి, ఆలయ సందర్శనకు ఎలాంటి సంబంధమూ లేదు. వచ్చే నెలలో ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఆమె ఆలయానికి వెళ్లారు. అంతేకాక న్యూజిలాండ్ గతంలో కోవిడ్ ఫ్రీ దేశంగా ప్రకటించుకున్నప్పటికీ జూన్ 8న మళ్లీ కొత్తగా కరోనా కేసులు వెలుగు చూశాయి. ఆ తర్వాత 100 రోజులపాటు కరోనా ఊసే కనిపించకుండా పోగా మంగళవారం మళ్లీ కొత్త కేసులు బయటపడ్డాయి. కాబట్టి కరోనాను నియంత్రించిన ఆనందంలో ఆ దేశ ప్రధాని గుడిని సందర్శించలేదు. ఎందుకంటే, న్యూజిలాండ్ ఇప్పుడు కరోనా ఫ్రీ దేశం కాదు. ఇదిలా వుండగా 2018 జనాభా లెక్కల ప్రకారం న్యూజిలాండ్‌లో నివసించే భారతీయుల సంఖ్య 2.44 లక్షలుగా ఉండగా, అందులో హిందువుల సంఖ్య 1.23 లక్షలుగా ఉంది. (న్యూజిలాండ్‌లో కరోనా జీరో)
వాస్తవం: కరోనాను కట్టడి చేసినందుకుగానూ న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డర్న్ హిందూ ఆలయాన్ని సందర్శించలేదు.
Comments
Please login to add a commentAdd a comment