
వెల్లింగ్‌టన్: మహమ్మారి కోవిడ్-19 (కరోనా వైరస్) విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తవుతున్నాయి. ప్రాణాంతక వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపడతున్నాయి. పలు యూరప్ దేశాలు ఇప్పటికే లాక్‌డౌన్ ప్రకటించగా... భారత్ మంగళవారం రాత్రి నుంచి 21రోజుల పాటు లాక్‌డౌన్ విధించింది. ఈ క్రమంలో నెల రోజుల పాటు దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అర్డెర్న్ మంగళవారం అర్ధరాత్రి ప్రకటన చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని పిలుపునిచ్చారు. నిత్యావసర సరుకుల కొసం మినహా ఎవరూ ఇంటి
నుంచి బయటకు రాకూడదన్నారు.
(చదవండి: కరోనా వైరస్: ఎందుకంత ప్రమాదకారి?)
ఈ మేరకు... ‘‘కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు.. ఈరోజు అర్ధరాత్రి నుంచి నాలుగు వారాల పాటు ఇంట్లోనే ఉందాం. ప్రాణంతక వైరస్ వ్యాప్తి గొలుసును తెంచేద్దాం. పరిస్థితులు చేజారకముందే జాగ్రత్తపడదాం. నాలుగు వారాల తర్వాత మనం ఏ మేరకు విజయం సాధించామో తెలుస్తుంది’’ అని జెసిండా పార్లమెంటులో ప్రకటించారు. మీ ప్రతీ కదలిక ఇప్పుడు ప్రతీ ఒక్కరిని ప్రభావితం చేస్తుంది. మీకో ఉపాయం చెప్పనా.. ఎవరూ మీ దగ్గరికి రాకుండా ఉండాలంటే కోవిడ్-19 సోకినట్లుగా నటించండి’’ అని పేర్కొన్నారు.
(చదవండి: బాధ్యత మరిచి... బలాదూర్‌గా తిరిగేసి...)
కాగా దాదాపు 50 లక్షల జనాభా కలిగిన న్యూజిలాండ్‌లో ఇప్పటివరకు 250 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కరోనా ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేసిన జెసిండా ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. లాక్‌డౌన్ నేపథ్యంలో చిరు వ్యాపారులు, ఉద్యోగులకు ఆర్థిక సాయం అందించేందుకు బిలియన్ డాలర్ల నిధులను కేటాయించింది. అదే విధంగా ఇంటి అద్దెలు పెంచకుండా... కిరాయిదార్లకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సామాజిక, భౌతిక దూరం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇక న్యూజిలాండ్‌లో ఎమర్జెన్సీ విధించడం ఇది రెండోసారి. 2011లో భారీ భూకంపం సంభవించిన నేపథ్యంలో తొలిసారి అత్యవసర పరిస్థితి విధించింది.
Comments
Please login to add a commentAdd a comment