
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లు న్యూజిలాండ్ మసీదు ఘటనతో సంతోష పడతారు
దుబాయ్ : న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్ మసీదులో గత శుక్రవారం జరిగిన మారణకాండపై ఓ వ్యక్తి అభ్యంతరకర కామెంట్ చేసి చిక్కుల్లో పడ్డాడు. దుబాయ్ కేంద్రంగా పనిచేసే ట్రాన్స్‌గార్డ్ సెక్యురిటీ సంస్థ ఉద్యోగి ఒకరు .. 50మంది ప్రాణాలు కోల్పోయిన న్యూజిలాండ్ కాల్పుల ఘటనపై ఫేస్‌బుక్‌లో రెచ్చగొట్టే పోస్టు చేశాడు. ‘పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లు న్యూజిలాండ్ మసీదు ఘటనతో సంతోష పడతారు. ప్రతి శుక్రవారం మసీదులపై ఇలాంటి దాడులు జరిగేలా చూడాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. భారత్‌లో కూడా ఇదే తరహా ఘటనలు జరగాలి. ఆ మతస్తులను ఎప్పుడూ నమ్మలేం’ అంటూ రాసుకొచ్చాడు. రోణి సింగ్ పేరుతో పేస్‌బుక్‌లో ఫేక్ అకౌంట్ సృష్టించి మత విద్వేషం ప్రదర్శించాడు. ఈ పోస్టు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో ట్రాన్స్‌గార్డ్ అప్రమత్తమైంది. అంతర్గత విచారణ చేపట్టి నిందితున్ని గుర్తించింది. అతన్ని సంబంధిత అధికారులకు అప్పగించింది.
(న్యూజిలాండ్ సంచలన నిర్ణయం)
‘జీరో టాలరెన్స్ పాలసీ ఉన్న దుబాయ్‌లో ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించేది లేదు. అందుకే న్యూజిలాండ్ ఘటనపై అభ్యంతరకర కామెంట్లు చేసిన సదరు వ్యక్తిని అధికారులకు అప్పగించాం. అతను చట్టపరంగా విచారణ ఎదుర్కోక తప్పదు’ అని ట్రాన్స్‌గార్డ్ సెక్యురిటీ సంస్థ ఎండీ గ్రెగ్ వార్డ్ స్పష్టం చేశాడు. అయితే, సదరు వ్యక్తి పేరు, వివరాలను మాత్రం సంస్థ వెల్లడించలేదు.
(చదవండి : న్యూజిలాండ్ కాల్పుల కలకలం.. 49 మంది మృతి)