కెనడా మసీదులో కాల్పులు... ఆరుగురు మృతి
క్వీబెక్ సిటీ: కెనడా క్వీబెక్ సిటీ మసీదులో ఇద్దరు సాయుధులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మృతిచెందారు. మరో 17 మంది గాయపడ్డారు. ఆదివారం రాత్రి ముసుగు లు ధరించిన ఇద్దరు వ్యక్తులు తుపాకులతో వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపా రని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతులం తా 35–70 ఏళ్ల మధ్య వయస్కులన్నారు. ఇది ఉగ్రవాదుల చర్యని, దేశ నిర్మాణంలో కీలకమైన ముస్లింలపై దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సోమవారం చెప్పారు.
ప్రార్థనలు, శరణార్థులకు ఆశ్రయంగా ఉన్న కేంద్రంపై దాడికి పాల్పడటం దారుణమని, ఇలాంటి అర్థరహిత చర్యలకు దేశంలో స్థానం లేదని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసు ప్రతినిధి క్రిస్టియన్ కౌలంబ్ చెప్పారు. పోలీసులు కూడా దీన్ని ఉగ్రవాద చర్యగానే భావి స్తున్నారు. ఇందులో మరొకరి ప్రమేయం కూడా ఉందని అనుమాని స్తున్నారు. ఈ దాడి వెనుక ఉద్దేశమేమిటన్నది ఇంకా స్పష్టం కాలేదు.