తీవ్రవాదుల జాబితాను విడుదల చేసిన యెమెన్
ప్రముఖ తీవ్రవాద సంస్థ అల్ఖైదా యెమెన్ దేశంలో విధ్వంసం సృష్టించేందుకు సమాయత్తమైంది. అందుకు దేశంలోని విదేశీ కార్యాలయాలు, సంస్థలను లక్ష్యంగా చేసుకుందని ఆ దేశ హోంమంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆ సంస్థకు చెందిన 25 మంది తీవ్రవాదుల పేర్ల జాబితాను సోమవారం సాయంత్రం యెమెన్ రాజధాని సనాలో ఆ దేశ హోంమంత్రిత్వశాఖ విడుదల చేసింది.
ఆ తీవ్రవాదుల సమాచారం అందజేసిన లేదా ఆచూకీ తెలిపిన వారికి భద్రతా దళాలు రూ.23 వేల అమెరికన్ డాలర్లు పారితోషకంగా అందజేయనున్నాయని తెలిపింది. అయితే యెమెన్ ఆ ప్రకటన విడుదల చేయడంతో ముస్లిం దేశాల్లోని తమ దేశానికి చెందిన 20 దౌత్యకార్యాలయాలను అమెరికా వారం రోజులపాటు మూసివేసింది. యెమెన్లోని అల్ఖైదా శాఖ అత్యంత ప్రమాదకరమైనదని ఇటీవలే వాషింగ్టన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.