బాంద్రా-వరోలి రాజీవ్‌గాంధీ సీలింక్‌పై ఆత్మహత్యల నివారణకు, ఉగ్రవాద దాడుల..
ముంబై: బాంద్రా-వరోలి రాజీవ్‌గాంధీ సీలింక్‌పై ఆత్మహత్యల నివారణకు, ఉగ్రవాద దాడుల నుంచి రక్షణ కల్పించాలని దాఖలైన పిటిషన్‌పై, వెంటనే స్పందించాలని బాంబే హైకోర్టు రాష్ర్ట హోంశాఖతోపాటు, అధికారులకు మంగళవారం నోటీసులు జారీ చేసింది.
అదేవిధంగా సీలింక్‌పై టోల్ వసూలు చేస్తున్న ఎంఈపీఐడీ, కేబుల్ బ్రిడ్జిపై కమీషన్ తీసుకొంటున్న ఎమ్‌ఎస్‌ఆర్‌డీసీకి కూడా నోటీసులను జారీ చేసింది. మూడు వారాల్లో ఈ నోటీసులకు సమాధానం చెప్పాలని జస్టిస్ పీవీ హర్దాస్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.మాజీ జర్నలిస్టు కేతన్ తిరోడ్కర్ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. 4.8 కి లోమీటర్ల పొడవైన ఈ వంతెనపై ఎంఈపీఐడీ, ఎంఎస్‌ఆర్‌డీసీ ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదని పేర్కొన్నాడు. అదేవిధంగా ఇప్పటికే ఐదు ఆత్మహత్యల కేసులు ఈ సీలింక్‌పై నమోదయ్యాయని పేర్కొన్నాడు. కేవలం ఆరు సీసీ టీవీలు మాత్రమే ఉన్నాయని, మొత్తం 80 సీసీటీవీల నిఘా అవసరం ఉందన్నారు.
వంతెనపై నెట్ ఏర్పాటుకు నిర్ణయం
సాక్షి, ముంబై: సీలింక్ ఆత్మహత్యలకు వేదికగా మారిన సీలింక్ వంతెన మొత్తం వల ‘నెట్’ను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. మహరాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంఎస్‌ఆర్డీసీ) అధికారులతోపాటు జోన్-3 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్.జయ కుమార్ తదితరులు సమావేశమై వంతెనపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించి నెట్ ఏర్పాటుకు నిర్ణయించారు.
ఈ వంతెనపై మరోసారి ఆత్మహత్యల సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎమ్మెస్సార్డీసీ అధికారి తెలిపారు. వంతెనపై ఉన్న రేలింగ్ ఎత్తును మరింత పెంచాలని సూచించారు. ఇక్కడ ఈ బ్రిడ్జిపై ఎక్కడ ఆత్మహత్యలకు ఎక్కువ పాల్పడుతున్నారో ఆ స్థలంలో సీసీ టీవీలను కూడా అమర్చాలన్నారు. ఈ సీసీటీవీ కెమెరాలను తమ కంట్రోల్ రూంకు అనుసంధానం చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. తాము ఈ బ్రిడ్జి మొత్తంగా నిఘా ఉంచవచ్చని అన్నారు. సీసీ టీవీ కెమెరాల సహాయంతో బ్రిడ్జిపై వాహనాలను నిలిపిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచవచ్చని మరో అధికారి పేర్కొన్నారు.
వంతెనపై భద్రతా సిబ్బందిని మోహరించడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందిస్తారని చెప్పారు. ఎమ్మెస్సార్డీసీ చీఫ్ ఇంజినీర్ అరుణ్ దేవ్‌ధర్ మాట్లాడుతూ.. ఈ వంతెన రేలింగ్ ఎత్తును పెంచేందుకు పర్యావరణ నిపుణుల సలహాను కూడా కోరామని చెప్పారు. ఈ వంతెనపై తరచూ పెట్రోలింగ్ నిర్వాహించాలని ట్రాఫిక్ పోలీస్ చీఫ్ బి.కె.ఉపాధ్యాయ సిబ్బందికి ఆదేశించారు. ఎవరైతే ఈ వంతెనపై వాహనాలను నిలుపుతారో వారిపై జరిమానాతోపాటు కేసులు నమోదు చేయనున్నట్లు నిర్ణయించినట్లు చెప్పారు. అంతేకాకుండా వీరిపై కేసు కూడా నమోదు చేయనున్నట్లు ఉపాధ్యాయ తెలిపారు.