ఒక్క నిమిషం ఆలోచించండి
– ఆత్మహత్యకు పాల్పడేవారికి ఎస్పీ సూచన
– నగరంలో ఆత్మహత్యల నివారణ దినోత్సవ ర్యాలీ
కర్నూలు(హాస్పిటల్): ఆత్మహత్య చేసుకునే వారు.. కనిపెంచిన అమ్మ గురించి ఒక్క నిమిషం ఆలోచించాలని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ సూచించారు. ఆత్మహత్యల నివారణ దినాన్ని పురస్కరించుకుని కర్నూలు మైండ్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం వాకింగ్ నిర్వహించారు. కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ.. జ్యోతి వెలిగించి ప్రారంభించారు. విద్యార్థుల ఆత్మహత్యల గురించి మాట్లాడుతూ వారిపై ఎన్నో ఆశలు, ప్రేమాభిమానాలు పెట్టుకున్న తల్లిదండ్రుల గురించి ఆలోచించాలన్నారు. సమాజంలో ప్రతి చోటా ఒత్తిడి ఉంటుందని చెప్పిన ఎస్పీ.. దాన్ని ఎదుర్కోవడంపై దృష్టి పెట్టాలి తప్ప ఆత్మహత్యకు పాల్పడవద్దన్నారు. విద్యాసంస్థల్లో అధ్యాపకులు, తల్లిదండ్రులు ఈ దిశగా విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఆత్మహత్యల నివారణకు నడక కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని, నడవడటమే కాదు సమాజాన్ని సైకియాట్రిస్ట్‌లు నడిపించాలని సూచించారు. కాలేజి, పాఠశాలలు సందర్శించి విద్యార్థులకు కౌన్సెలింగ్ చేయాలని కోరారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి మాట్లాడుతూ అన్ని విషయాల్లో ఒత్తిడి పెరిగిన క్రమంలో వారి ప్రవర్తనను గమనిస్తూ ఉంటే ఆత్మహత్యలను చాలా వరకు నివారించవచ్చన్నారు. ఏపీ సైకియాట్రిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ కె.నాగిరెడ్డి, డాక్టర్ బి. రమేష్‌బాబు, ఐఎంఏ కర్నూలు శాఖ అధ్యక్షులు డాక్టర్ బి. శంకరశర్మ, కార్యదర్శి డాక్టర్ సి. మల్లికార్జున, మానసిక వైద్యులు హరిప్రసాద్, రంజిత్‌కుమార్, రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.