సాగునీటి వనరుల కల్పనతోనే.. రైతు ఆత్మహత్యల నివారణ
- బతికేందుకు తలకు మించిన భారం మోస్తున్నారు
- సాగునీరిస్తే సబ్సిడీలు కూడా అడగరు
- ‘సాక్షి’తో రైతు ఆత్మహత్యల నివారణ కమిటీ సభ్యులు
అనంతపురం అగ్రికల్చర్ : సాగునీటి వనరుల కల్పన, వ్యవసాయోత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం లాంటివి కల్పిస్తే అనంతపురం జిల్లాలో రైతు ఆత్మహత్యలను గణనీయంగా తగ్గించవచ్చని కేంద్ర ప్రభుత్వ రైతు ఆత్మహత్యల నివారణ కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖకు చెందిన ఆగ్రో ఎకనామిక్ రీసెర్చ్ సెంటర్ (ఏఈఆర్‌ఎస్) రీసెర్చ్ ఆఫీసర్ డాక్టర్ ఎం.నాగేశ్వరరావు, రీసెర్చ్ అసోసియేట్స్ డాక్టర్ కె.రాంబాబు, డాక్టర్ పి.రాముతో కూడిన బృందం మూడు రోజుల జిల్లా పర్యటనను సోమవారం ముగించుకుంది. ఈ సందర్భంగా సాయంత్రం వారు నగరంలోని ఓ ప్రైవేట్ అతిథి గృహంలో ‘సాక్షి’తో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రైతు ఆత్మహత్యలకు దారితీసిన కారణాలు, కుటుంబాల స్థితిగతులు, భవిష్యత్తులో వారికి ఎలాంటి సహకారం అవసరం, ఆత్మహత్యల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశాలపై తెలంగాణలోని వరంగల్, మెదక్ జిల్లాలలో 50 కుటుంబాలు, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, గుంటూరు జిల్లాల్లో 15 కుటుంబాలను కలిసి అధ్యయనం చేస్తున్నామన్నారు. ఇప్పటికే తెలంగాణ జిల్లాలు, రాష్ట్రంలోని గుంటూరులో పూర్తి చేయగా.. ఇప్పుడు ఇక్కడ ముగిసిందన్నారు. డిసెంబర్ ఆఖరులోగా కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామన్నారు.
జిల్లా రైతులకు నీళ్లిస్తే చాలు
గత మూడు రోజులుగా వ్యవసాయశాఖ అధికారుల సహకారంతో జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన 15 బాధిత కుటుంబాలను, మరికొందరు రైతులను కలిసి వివిధ అంశాలపై అధ్యయనం చేశామన్నారు. బుక్కపట్నం, ఓడీచెరువు, కదిరి, అనంతపురం రూరల్, గార్లదిన్నె, శింగనమల, బుక్కరాయసముద్రం, నార్పల, గుత్తి మండలాల పరిధిలోని 14 గ్రామాల్లో పర్యటించామన్నారు. ‘రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. వారి ఇంట అప్పులు కుప్పలుగా ఉన్నాయి. పంటలు పండించడానికి తలకు మించిన భారం మోస్తున్నారు. కొందరు ఎక్కువ భూమిని కౌలుకు తీసుకుని తీవ్రంగా నష్టపోయారు. కుటుంబ పోషణ, పిల్లల చదువులు, పెళ్లిళ్లు కష్టంగా కనిపిస్తోంది. వర్షాభావ పరిస్థితులు కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. పంటలు పండించేందుకు నీటి కొరత వేధిస్తోంది. నీళ్ల కోసం అప్పులు చేసి బోర్లు వేయిస్తున్నారు. అందులో 90 శాతం ఫెయిల్ అవుతున్నాయి. గుత్తి మండలం కొత్తపేటలో కె.నారాయణస్వామి అనే రైతు తనకున్న రెండున్నర ఎకరాల పొలంలో ఏకంగా 9 బోర్లు వేయించినా ఒక్కదాంట్లో కూడా నీరు రాలేదు. అప్పులు రూ.4 లక్షలకు పైబడి కావడంతో తీర్చే స్తోమత లేక ఆత్మహత్యకు తెగించాడు. ఒక్కోసారి టమాట, ఉల్లి, ఇతరత్రా ఉద్యాన ఉత్పత్తులకు కూడా సరైన గిట్టుబాటు కాక తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమస్యల వల్ల జిల్లాలో రైతుల పరిస్థితి దారుణంగానే కనిపిస్తోంద’ని అన్నారు. ‘ఆత్మహత్యలు తగ్గించాలంటే రైతులకు సాగునీళ్లు ఇవ్వాలి. సమృద్ధిగా నీళ్లుంటే అన్ని రకాల పంటలు పండించే సత్తా వీరికి ఉంది. నీళ్లు, మార్కెటింగ్ ఉంటే ఇన్‌పుట్‌సబ్సిడీ, ఇన్సూరెన్స్, ఇతరత్రా రాయితీలు కూడా అడిగే పరిస్థితి కనిపించడం లేదు. రైతులు కూడా అవసరం లేకున్నా పెట్టుబడులు ఎక్కువ పెడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా భూముల్లో ఉప్పుశాతం ఎక్కువగా ఉన్నందున ఆశించిన దిగుబడలు రావడం లేదు. వేరుశనగ, కంది పంటల సాగు ఇక్కడ శరణ్యం. పంటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులు, ఎరువుల యాజమాన్యం, హెల్ప్‌లైన్, కౌన్సెలింగ్ సెంటర్ల ద్వారా రైతుల్లో చైతన్యం తీసుకువస్తే ఆత్మహత్యలను బాగా తగ్గించడానికి అవకాశం ఉంద’ని వివరించారు.