సాక్షి, ముంబై: నగర భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గతంలో జరిగిన 26/11 ఘటన నుంచి ఇంకా పాఠాలు నేర్చుకోనట్లుగానే ప్రవర్తిస్తోంది. నగరంలో నేరాల సంఖ్య పెరుగుతోంది.. ఉగ్రవాదుల దాడుల భయమూ వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో నగర రక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న భద్రతా సిబ్బందికి తగిన ఆయుధ సంపత్తిని సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది.
ఉగ్రవాదుల దాడులను సమర్ధవంతంగా తిప్పి కొట్టేందుకు కొన్ని కీలక సంస్థల వద్ద నియమించిన భద్రతా సిబ్బంది వద్ద ఇప్పటికీ పాత కాలం నాటి ఆయుధాలే ఉన్నాయి. మారుతున్న కాలాన్ని బట్టి మావోలు, ఉగ్రవాద సంస్థలు సైతం ఆధునిక ఆయుధాలు సమకూర్చుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం ప్రత్యేకంగా స్థాపించిన మహారాష్ట్ర భద్రత దళానికి చెందిన జవాన్లవద్ద ఇప్పటికీ 1948 కాలం నాటి ఆయుధాలు ఉండడం గమనార్హం. 26/11 ఘటన తర్వాత తేరుకున్న ప్రభుత్వం నగర భద్రత నిమిత్తం అనేక కీలక సంస్థల వద్ద ప్రత్యేకంగా బలగాలను నియమించింది.
ఇందులో మెట్రో, మోనో, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెబీ, మహాలక్ష్మి మందిరం, ఓఎన్‌జీసీ, జేఎన్‌పీటీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఐఐటీ, ఐటీఐ తదితర 20 అత్యంత కీలక ప్రాంతాల్లో బందోబస్తును పటిష్టం చేశారు. అయితే ఆయా ప్రాంతాలు ఇప్పటికీ సురక్షితంగా లేవనే ఆశ్చర్యకరమైన విషయం ఓ దిన పత్రిక నిర్వహించిన అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో సమస్యాత్మక ప్రాంతాలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్థిక సంస్థలు, ప్రార్థన స్థలాలు, విద్యా, వైద్య సంస్థల భద్రత కోసం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు (సీఐఎస్‌ఎఫ్) మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ‘మహారాష్ట్ర భద్రత దళం’ ను 2011లో స్థాపించింది. ఈ దళంలో పనిచేసే జవాన్లకు పోలీసు అధికారులకు ఉన్న హోదా కల్పించింది.
కాని ఈ దళం కోసం తీసుకున్న సుమారు 15 వందల జవాన్లలో కేవలం 577 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. ఇందులో కేవలం 388 మందికి శిక్షణ ఇచ్చి ఆయుధాలు, 189 మందికి లాఠీలు ఇచ్చారు. మిగతావారిని వెయిటింగ్‌లో పెట్టింది. ముంబై పోలీసు శాఖ చెత్త సామాగ్రి కింద జమకట్టిన మస్కెట్-410 మోడల్ బందూకులనే ఈ దళానికి ఇవ్వడం ఇక్కడ గుర్తించాల్సిన విషయం. ఒక్కోక్క జవానుకు ఒక తుపాకీ, ఐదు బులెట్లు ఇచ్చారు. ఇవి 1948 కాలం నాటివి కావడంతో పాడైపోయాయి. వాటి కి మేకులు కొట్టి సరిచేసి సెలోటేప్ అతికించి ఇచ్చారు. అవి భయపెట్టడానికి తప్ప ఇంక దేనికీ పనికిరావని తెలుస్తోంది. కాగా ఏకే-47, ఏకే-56 లాంటి అత్యాధునిక ఆయుధాలతో దాడులకు దిగే ఉగ్రవాదులను ఈ జవాన్లు ఎంతవరకు అడ్డుకుంటారనేది బిలియన్ డాలర్ల ప్రశ్న.
తుప్పు పట్టిన ‘భద్రత’..!
Published Sun, Dec 28 2014 10:38 PM | Last Updated on Sat, Sep 2 2017 6:53 PM
Advertisement
Advertisement