number of crimes
-
నగర మహిళపై పెరిగిన నేరాల సంఖ్య
న్యూఢిల్లీ: నగర మహిళలపై జరుగుతున్న నేరాల సంఖ్య ఏయేటికాయేడు పెరుగుతోంది. పోలీసులందించిన వివరాల ప్రకారం 2013తో పోలిస్తే 2014లో 31.6 శాతం మేర పెరిగాయి. 2013లో 12,410 కేసులు నమోదు కాగా 2014, డిసెంబర్ 15నాటికి ఈ సంఖ్య 14,687కి చేరుకుంది. 2013లో నమోదైన అత్యాచారాల సంఖ్య 1,571 కాగా మరుసటి సంవత్సరం అది 2,069కి చేరుకుంది. అత్యాచార కేసు నిందితుల్లో 420 మంది బాధితురాలి ఇరుగుపొరుగువారే. మరో 920 మంది స్నేహితులు, 283 మంది బంధువులు, 66 మంది సహోద్యోగులు ఉన్నారు. కొత్త వాళ్లు 84 మంది మాత్రమే. 586 అత్యాచార కేసులకు సంబంధించి నిందితులందరికీ బాధిత మహిళలతో సంబంధాలు ఉన్నాయి. ఇదిలాఉంచితే 2013లో 879 లైంగిక వేధింపు కేసులు నమోదు కాగా 2014కు వచ్చేసరికి ఆ సంఖ్య 1,282కు చేరుకుంది. ఇక వరకట్న వేధింపు కేసులు 2013లో 137 కాగా మరుసటి సంవత్సరం ఇది 147కు చేరుకుంది. పెట్రోలింగ్ వాహనాలను రంగంలోకి దించాం నగరంలో మహిళలపై నేరాల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో కమిషనర్ భీంసేన్ బస్సిని మీడియా ప్రశ్నించగా ‘859 పెట్రోలింగ్ వాహనాలను రంగంలోకి దించాం. విధులు ముగించుకుని రాత్రిపూట ఆలస్యంగా ఇంటికి చేరుకునే మహిళల కోసం పెట్రోలింగ్ విధులను నిర్వర్తించే సిబ్బందికి తగు సూచనలు, సలహాలు ఇచ్చాం. ద్విచక్ర వాహనాలపై గస్తీని పెంచడంతోపాటు అత్యవసర స్పందన బృందాన్ని కూడా రంగంలోకి దించాం. ఉదయం, సాయంత్రం సమయాల్లో బాలికల పాఠశాలలు, కళాశాలల వద్ద పోలీసు సిబ్బందిని మోహరిస్తున్నాం. దీంతోపాటు నగర మహిళల్లో ఆసక్తిఉన్నవారికి ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ ఇప్పిస్తున్నాం. గత ఏడాది మొత్తం 15,583 మందికి ఈ తరహా శిక్షణ ఇచ్చాం’అని అన్నారు. -
తుప్పు పట్టిన ‘భద్రత’..!
సాక్షి, ముంబై: నగర భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గతంలో జరిగిన 26/11 ఘటన నుంచి ఇంకా పాఠాలు నేర్చుకోనట్లుగానే ప్రవర్తిస్తోంది. నగరంలో నేరాల సంఖ్య పెరుగుతోంది.. ఉగ్రవాదుల దాడుల భయమూ వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో నగర రక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న భద్రతా సిబ్బందికి తగిన ఆయుధ సంపత్తిని సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ఉగ్రవాదుల దాడులను సమర్ధవంతంగా తిప్పి కొట్టేందుకు కొన్ని కీలక సంస్థల వద్ద నియమించిన భద్రతా సిబ్బంది వద్ద ఇప్పటికీ పాత కాలం నాటి ఆయుధాలే ఉన్నాయి. మారుతున్న కాలాన్ని బట్టి మావోలు, ఉగ్రవాద సంస్థలు సైతం ఆధునిక ఆయుధాలు సమకూర్చుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం ప్రత్యేకంగా స్థాపించిన మహారాష్ట్ర భద్రత దళానికి చెందిన జవాన్లవద్ద ఇప్పటికీ 1948 కాలం నాటి ఆయుధాలు ఉండడం గమనార్హం. 26/11 ఘటన తర్వాత తేరుకున్న ప్రభుత్వం నగర భద్రత నిమిత్తం అనేక కీలక సంస్థల వద్ద ప్రత్యేకంగా బలగాలను నియమించింది. ఇందులో మెట్రో, మోనో, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెబీ, మహాలక్ష్మి మందిరం, ఓఎన్జీసీ, జేఎన్పీటీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఐఐటీ, ఐటీఐ తదితర 20 అత్యంత కీలక ప్రాంతాల్లో బందోబస్తును పటిష్టం చేశారు. అయితే ఆయా ప్రాంతాలు ఇప్పటికీ సురక్షితంగా లేవనే ఆశ్చర్యకరమైన విషయం ఓ దిన పత్రిక నిర్వహించిన అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో సమస్యాత్మక ప్రాంతాలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్థిక సంస్థలు, ప్రార్థన స్థలాలు, విద్యా, వైద్య సంస్థల భద్రత కోసం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు (సీఐఎస్ఎఫ్) మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ‘మహారాష్ట్ర భద్రత దళం’ ను 2011లో స్థాపించింది. ఈ దళంలో పనిచేసే జవాన్లకు పోలీసు అధికారులకు ఉన్న హోదా కల్పించింది. కాని ఈ దళం కోసం తీసుకున్న సుమారు 15 వందల జవాన్లలో కేవలం 577 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. ఇందులో కేవలం 388 మందికి శిక్షణ ఇచ్చి ఆయుధాలు, 189 మందికి లాఠీలు ఇచ్చారు. మిగతావారిని వెయిటింగ్లో పెట్టింది. ముంబై పోలీసు శాఖ చెత్త సామాగ్రి కింద జమకట్టిన మస్కెట్-410 మోడల్ బందూకులనే ఈ దళానికి ఇవ్వడం ఇక్కడ గుర్తించాల్సిన విషయం. ఒక్కోక్క జవానుకు ఒక తుపాకీ, ఐదు బులెట్లు ఇచ్చారు. ఇవి 1948 కాలం నాటివి కావడంతో పాడైపోయాయి. వాటి కి మేకులు కొట్టి సరిచేసి సెలోటేప్ అతికించి ఇచ్చారు. అవి భయపెట్టడానికి తప్ప ఇంక దేనికీ పనికిరావని తెలుస్తోంది. కాగా ఏకే-47, ఏకే-56 లాంటి అత్యాధునిక ఆయుధాలతో దాడులకు దిగే ఉగ్రవాదులను ఈ జవాన్లు ఎంతవరకు అడ్డుకుంటారనేది బిలియన్ డాలర్ల ప్రశ్న. -
మహిళలపై అకృత్యాల్లో ఉమ్మడి ఏపీ టాప్
తాజాగా విడుదలైన ఎన్సీఆర్బీ నివేదికలో వెల్లడి 2013లో మహిళలపై జరిగిన నేరాల కేసులు 32,809 హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో మహిళలపై జరిగిన నేరాల సంఖ్య గణనీయంగా పెరిగింది. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజాగా వెల్లడించిన 2013 గణాంకాల ప్రకారం మహిళలపై జరుగుతున్న నేరాల్లో ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2012 నాటి లెక్కలతో పోలిస్తే... మహిళలపై నేరాలకు సంబంధించి దాదాపు ప్రతి అంశంలోనూ పెరుగుదల నమోదైంది. 2012లో రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు వ్యతిరేకంగా సంబంధించి 28, 171 కేసులు నమోదు కాగా... 2013 నాటికి ఆ సంఖ్య 32,809కి చేరింది. 2012లో దేశంలోనే అత్యధిక కేసులతో ప్రథమ స్థానంలో నిలిచిన పశ్చిమ బెంగాల్ 2013లో 29,826 కేసులతో రెండో స్థానానికి వచ్చింది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 10.59 శాతం కేసులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే రాష్ట్రంలోనే రిజిస్టరయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఏడాది కాలంలో 1,635 అత్యాచారాలు (2012లో 1,341), 1,595 కిడ్నాప్‌లు (2012లో 1,403), 492 మంది వరకట్న వేధింపుల మరణాలు (2012 లో 504) నమోదయ్యాయి. మహిళలపై జరుగుతున్న నేరాల్లో సగానికిపైగా పరిచయస్తులు, బంధువులవల్లే జరిగినవని ఎన్సీఆర్బీ వెల్లడించింది. ఎస్సీ, ఎస్టీలపై దాడుల్లో నాలుగో స్థానం ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించిన కేసుల నమోదులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్ (7078), బీహార్ (6,721), రాజస్థాన్ (6,475) తరవాత ఆంధ్రప్రదేశ్‌లో 3,270 కేసులు నమోదయ్యాయి.