ఉష్ణోగ్రత తగ్గింపే లక్ష్యం | Temperature reduction is only targets | Sakshi
Sakshi News home page

ఉష్ణోగ్రత తగ్గింపే లక్ష్యం

Published Sun, Dec 13 2015 5:23 AM | Last Updated on Sun, Sep 3 2017 1:57 PM

ఉష్ణోగ్రత తగ్గింపే లక్ష్యం

ఉష్ణోగ్రత తగ్గింపే లక్ష్యం

2100 నాటికి భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుదల
2 డిగ్రీల కంటే తక్కువే ఉండాలి: పారిస్ సదస్సులో తీర్మానం

 
 పదమూడు అన్న అంకె పాశ్చాత్య దేశాల్లో అశుభ సూచకం. అయితే నవంబరు 30న పారిస్‌లో మొదలైన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21వ సమావేశం మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఘన విజయం సాధించింది. పదమూడు రోజల తీవ్ర చర్చోపచర్చల తరువాత... భూమిపై మనిషి మనుగడను ప్రశ్నార్థకం చేసే భూతాపోన్నతిని రెండు డిగ్రీల కంటే తక్కువ స్థాయికి పరిమి తం చేస్తామని దాదాపు 196 దేశాలు అంగీకరించడం మానవ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయం గా పేర్కొనడం ఏమాత్రం అతిశయోక్తి కాబోదు. చేతి చమురు వదులుతుందన్న భయంతో అమెరికా వంటి అగ్రరాజ్యాలు కొంత బెట్టుచూపినా...  కాలుష్యం మోతాదు ఆధారంగా దేశాలు తగ్గింపు విషయంలో బాధ్యతలు పంచుకోవాలన్న భారత్, చైనాలు పట్టుబట్టినా... వాతావరణం మారిపోతే అందరికంటే ముందుగా బలయ్యేది తామే కాబట్టి... మా గోడు పట్టించుకోమన్న చిన్న, ద్వీప సముదాయ దేశాలు బతిమలాడినా... చివరకు స్పష్టమైన విషయం ఒక్కటే. భూమి పదికాలాలపాటు పదిలంగా ఉండాలంటే చేయి చేయి కలపాల్సిందేనని.. అందుకే పారిస్ సదస్సు చివరి క్షణాల్లో ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు బాన్ కీ మూన్ ‘‘మనల్ని కాపాడుతున్న ఈ భూమిని రక్షించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది’’ అని స్పష్టంగా ప్రకటించారు.
 
 పారిస్: పారిస్‌పై ఉగ్రవాద దాడులు జరిగిన కొన్ని రో జులకే... నవంబరు 30న మొదలైన ప్యారిస్ సదస్సు నిజానికి శుక్రవారమే ముగియాల్సి ఉంది. అయితే కొన్ని కీలక అంశాల విషయంపై దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలు రాత్రి పొద్దుపోయేంత వరకూ కొనసాగాయి. వాతావరణ మార్పులను తట్టుకునేందుకు పేద దేశాలకు అందించాల్సిన ఆర్థిక సాయం, కాలుష్య కారకులకు ఎక్కువ బాధ్యత తదితర అంశాలపై వ్యక్తమైన భిన్నాభిప్రాయాలను తొలగించేందుకు సమావేశాల పొడిగింపు తప్పలేదు. చివరకు శనివారం మధ్యాహ్నం సమయానికి 196 సభ్యదేశాల కరతాళ ధ్వనుల మధ్య  ఫ్రాన్స్ విదేశాంగ శాఖ మంత్రి లారెంట్ ఫాబియస్ తుది ముసాయిదాను సమావేశం ముందు ఉంచారు. ఈ తుది చర్చల్లో పాల్గొన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే మాట్లాడుతూ ‘‘భూమి భవితను నిర్ణయించే ఒప్పందం మన ముందుంది. ఈ తొలి వాతావారణ ఒప్పందాన్ని ప్రపంచదేశాలన్నీ ఆమోదించాలి’’ అని అభ్యర్థించారు. అనంతరం ఈ ఒప్పందానికి సమావేశం ఆమోద ముద్ర వేసింది.

 స్వాగతించిన భారత్
 పారిస్ సదస్సు తుది ముసాయిదా ఒప్పందాన్ని భారత్ బలపరిచింది. సదస్సు ప్రారంభమైన నాటి నుంచి చర్చల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవ్‌దేకర్ ఒప్పందం ముసాయిదాపై పొగడ్తలు కురిపించారు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలకు బాధ్యతల బరువు వేర్వేరుగా ఉండాలన్న భారత్ వాదనకు ఒప్పందంలో చోటు దక్కడం ఎంతైనా హర్షణీయమైన విషయమని, ఒప్పందంలోని అన్ని అంశాల్లోనూ దీని ప్రస్తావన ఉందని తెలిపారు. భారత్‌కు సంబంధించినంత వరకూ ఇది కీలక విజయమని స్పష్టం చేశారు. పర్యావరణ కాలుష్యాన్ని పెంచని సుస్థిర జీవనశైలుల అంశాన్ని కూడా భారత్ ప్రపంచం ముందుకు తెచ్చిందని, 31 పేజీల తుది ఒప్పంద ముసాయిదాలో దీనికీ చోటు దక్కిందని తెలిపారు.

‘‘ఈ ఒప్పంద ప్రతిని స్థూలంగా పరిశీలిస్తే భారత్ వ్యక్తం చేసిన ఆందోళనలు అన్నింటికీ సమాధానాలు ఉన్నట్టుగానే అనిపిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు.  శనివారం తుది ముసాయిదాను ప్రవేశపెట్టిన తరువాత వాటిపై అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు సభ్యదేశాలకు కొంత గడువు ఇచ్చారు. ఈ సమయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ భారత ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్ చేసి ఒప్పందానికి మద్దతు పలకాల్సిందిగా అభ్యర్థించినట్లు వార్తలు వచ్చాయి. నరేంద్రమోదీ ఒప్పంద సారాంశంపై హర్షం వ్యక్తం చేసినట్లు సమాచారం.
 
 అంతరాలు తగ్గాయి
 వాతావరణ మార్పులకు సంబంధించి ఇప్పటివరకూ జరిగిన సదస్సులకు ప్యారిస్ సదస్సుకు ఉన్న ముఖ్యమైన తేడా అంతర్జాతీయంగా చట్టబద్ధమైన ఒప్పందం కుదరడం. ఈ కొత్త ఒప్పందంలోని ముఖ్యాంశాలు...

► 2100 నాటికి భూమి సగటు ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల కంటే గణనీయంగా తక్కువ ఉండేలా చూడాలి. అదే సమయంలో 1.5 డిగ్రీ సెల్సియస్ పెరుగుదలకు పరిమితం చేసేందుకు అన్ని ప్రయత్నాలూ చేయాలి.
► వాతావరణ మార్పులకు తట్టుకునేందుకు, ఎదుర్కొనేందుకు అగ్రరాజ్యాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు 2020 నాటి నుంచి ఏటా పదివేల కోట్ల డాలర్ల (రూ.6.5 లక్షల కోట్లు) కనీస మొత్తం అందించాలి. 2025లో ఈ మొత్తాన్ని మరోసారి సమీక్షిస్తారు.
 హా గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించేం దుకు జరుగుతున్న ప్రయత్నాలను ఐదేళ్లకు ఒకసారి సమీక్షించాలి.
 
 ఇవీ గత ఒప్పందాలు...
 భూ తాపోన్నతి, వాతావరణ మార్పుల నియంత్రణకు ప్రపంచదేశాలు చర్యలు మొదలుపెట్టింది రియో డి జెనీరోలో (1992) జరిగిన ఎర్త్ సమ్మిట్‌తోనే. ఈ సమావేశం ఫలితంగా 1997లో క్యోటో ప్రోటోకాల్ అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందానికి 82 దేశాలు మాత్రమే అంగీకారం తెలిపాయి. అమెరికా సహా కొన్ని పారిశ్రామిక దేశాలు ఒప్పందంపై సంతకాలు చేయలే దు. దీని ప్రకారం పా రిశ్రామిక దేశాలు త మ కర్బన ఉద్గారాల ను 1990 నాటి స్థాయి కంటే కనీసం 5 శాతం తక్కువ చేయాలి. ఈ ఒప్పందం అమల్లో కొన్ని దేశాలు విఫలమైనా మొత్తమ్మీద ఉద్గారాలు లక్ష్యం కంటే రెండు రెట్లు ఎక్కువ మోతాదులో తగ్గడం విశేషం. అయితే ఇదే సమయంలో 36 దేశాలు తగ్గించుకున్న ఉద్గారాల కంటే ఎక్కువ మోతాదులో చైనా వంటి దేశాలు ఉద్గారాలను విపరీతంగా పెంచేయడంతో మొత్తమ్మీద క్యోటో ప్రోటోకాల్ తాలూకూ ఫలితం కనిపించకుండా పోయింది.

► 2009 కోపెన్‌హెగెన్ సదస్సులో తొలిసారి అన్ని దేశాలు తమ తమ కర్బన ఉద్గారాలను తగ్గించుకోవాలన్న ఉమ్మడి నిర్ణయానికి వచ్చాయి. అయితే ఇందుకు సంబంధించి చట్టబద్ధమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం మాత్రం కుదరలేదు.
► 2012లో దోహాలో జరిగిన సమావేశంలో క్యోటో ప్రోటోకాల్ ఒప్పంద కాలాన్ని 2020 వరకూ పొడిగించారు. ప్యారిస్ సదస్సులో కుదిరే ఒప్పందం 2020 నుంచి 2030 వరకూ అమల్లో ఉంటుంది.
 
 ఎందుకు..? ఏమిటి..? ఎలా..?
 సమస్య ఏమిటి?
 భూమి వెచ్చబడుతోంది. గత వందేళ్ల కాలంలో భూమి సగటు ఉష్ణోగ్రత 0.85 డిగ్రీ సెల్సియస్ వరకూ పెరిగింది. 2000 సంవత్సరం మొదలుకొని ఇప్పటివరకూ దాదాపు 13 ఏళ్లు అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది కూడా దీనికి భిన్నమేమీ కాదు!

 ఎందుకు ఇలా...
 వాతావరణంలో గ్రీన్‌హౌస్ వాయువులు మరీ ముఖ్యంగా కార్బన్‌డ యాక్సైడ్ మోతాదు పెరిగిపోవడం. పెరిగిపోతున్న పరిశ్రమలు, వ్యవసా యం కారణంగా కార్బన్‌డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి గ్రీన్‌హౌస్ వాయువులు వాతావరణంలో ఎక్కువ గా పేరుకుపోతున్నాయి. ఫలితంగా భూమి అంతరిక్షంలోకి ప్రతిఫలించే సూర్యరశ్మి తాలూకూ వేడి వాతావరణంలో ఎక్కువ కాలంపాటు ఉండిపోతోంది. కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకుని నిక్షిప్తం చేసుకోగల అడవుల విస్తీర్ణం తగ్గిపోతూండటం అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతోంది. ఈ ఏడాది మే నెలకు వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడ్ మోతాదు 400 పార్ట్స్ పర్ మిలియన్‌కు చేరుకుంది. గడచిన 8 లక్షల సంవత్సరాల్లో ఈ వాయువు ఇంత మోతాదులో ఉండటం ఇదే తొలిసారి.

 దుష్పరిణామాలు ఏమిటి?
 ఏటికేడాదీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో పడుతున్న ఇబ్బందులు మనకు తెలియనివి కావు. అయితే భూతాపోన్నతి దుష్పరిణామాల్లో వేసవి ఉష్ణోగ్రతల పెరుగుదల ఒక చిన్న అంశం మాత్రమే. భూతాపోన్నతి కారణంగా అకాల వర్షాలు, వరదలు (చెన్నై, ఉత్తరాఖండ్ కుంభవృష్టుల మాదిరిగా), సముద్రమట్టాల పెరుగుదల, పంట దిగుబడులు తగ్గిపోవడం, అంటువ్యాధులు ప్రబలుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 1900తో పోలిస్తే సముద్రమట్టాలు ఇప్పటికే దాదాపు 19 సెంటీమీటర్లు పెరిగినట్లు గుర్తించారు. అంతేకాకుండా ధ్రువప్రాంతాల్లోని మంచు, హిమాలయాలతోపాటు ఇతర హిమనదాలు వేగంగా కరిగిపోతున్నాయి.

 మరి భవిష్యత్తులో ఎలా....?
 ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో పెరుగుతూ పోతే భూమిపై మనిషి మనుగడ మరింత కష్టమవుతుంది. వాతావరణ మార్పుల కారణంగా చాలా ప్రాంతాల్లో విపరీతమైన నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది. తరచూ పలకరించే కరువులు, వడగాడ్పులు, ఆకస్మిక కుంభవృష్టులతో విపరీతమైన ఆస్తి, ప్రాణ నష్టాలు జరుగుతాయి. నీటి కొరత, వాతావరణ మార్పుల ప్రభావంతో వరి, గోధుమ వంటి పంటల దిగుబడులు దాదాపు 30 శాతం వరకూ తగ్గవచ్చునని అంచనా.

 ఎవరెవరు ఎంతెంత?
 వాతావరణంలో కార్బన్ డైయాక్సైడ్ మోతాదు పెరిగిపోవడం భూతాపోన్నతికి కారణమని తెలుసుకున్నాం కాదా... మరి ఈ విషవాయువులు ఎవరు ఎంత మోతాదులో విడుదల చేస్తున్నారో తెలుసా? పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన దేశాలు చైనా, అమెరికాలు దాదాపు 36 శాతం ఉద్గారాలకు కారణమవుతున్నాయి. యూరోపియన్ యూనియన్ మరో 9 శాతం, భారత్, బ్రెజిల్‌లు మరో ఆరు శాతం చొప్పున గ్రీన్‌హౌస్ వాయువులను వాతావరణంలోకి విడుదల చేస్తున్నాయి. రష్యా(5), జపాన్(3), కెనెడా (2), ఇండొనేషియా (1.5), కాంగో (1.5) తరువాతి స్థానాల్లో ఉన్నాయి.

 పెరుగుదల ఎంత ఉండొచ్చు?
 ఈ శతాబ్దం చివరి నాటికి భూమి ఉష్ణోగ్రతలు ఎంత మేరకు పెరగవచ్చు అన్న అంశం కర్బన ఉద్గారాల తగ్గింపునకు తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంటాయి. ప్రపంచ దేశాలన్నీ ఏ చర్య తీసుకోకుండా ఉద్గారాలను ఇలాగే కొనసాగిస్తే... పెరుగుదల 4.6 డిగ్రీ సెల్సియస్ వరకూ ఉండవచ్చు. ప్రభుత్వాలు ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాలను ఇలాగే కొనసాగిస్తే ఇది 3.6 డిగ్రీ సెల్సియస్‌కు, పారిస్ సదస్సులో తీసుకున్న విధాన నిర్ణయాలకు కట్టుబడితే 2.7 డిగ్రీ సెల్సియస్‌కు పరిమితమవుతుందని అంచనా.     
- జి. గోపాలకృష్ణ మయ్యా, సాక్షి
 
 ఒప్పందంలో..భారత అభిప్రాయాలకు చోటు
 పారిస్: వాతావరణ మార్పుపై కాప్-21 సదస్సు ఆమోదం తెలిపిన ఒప్పందంలో భారత్ వెల్లడించిన అభిప్రాయాలకు చోటు దక్కిందని పరిశీలకులు వెల్లడించారు. సుస్థిర జీవన, వినియోగ విధానాలు, వాతావరణ న్యాయం అంశాలను ఒప్పంద పీఠికలో పొందుపరిచారు. వాతావరణ మార్పుపై పోరాటంలో అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల బాధ్యత ఎవరెవరిది ఎంత అనేది... అన్ని అంశాల్లోనూ తప్పక పాటించాలనే భారత్ అభిప్రాయాన్ని ఇందులో పొందుపరిచారు. వాతావరణ మార్పుకు సంబంధించి అన్ని అంశాలపై దృష్టిసారించి తయారుచేసిన ఈ ఒప్పందం.. సమతుల్యమైనదని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి లారెంట్ ఫేబియస్ పారిస్‌లో అన్నారు.

సభ్యత్వ దేశాల మధ్య మరింత విశ్వాసాన్ని పెంచేదిలా ఒప్పందం తయారుచేశామన్నారు. ఆయా దేశాల్లో అమల్లో ఉన్న వ్యవస్థలను దృష్టిలో ఉంచుకుని అత్యుత్తమమైన, సమర్థవంతమైన, పారదర్శకమైన విధివిధానాలను రూపొందించామన్నారు. కాగా, భారత్, చైనా, సౌదీ అరేబియా సహా సభ్యత్వ దేశాల్లోని 134 అభివృద్ధి చెందుతున్న దేశాలు ఒప్పందాన్ని స్వాగతించాయి. తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నందుకు సంతోషంగా ఉందని డజనుకుపైగా దేశాలు ఉన్న లైక్-మైండెడ్ డెవలపిం గ్ కంట్రీస్(ఎల్‌ఎండీసీ) గ్రూప్ అధికార ప్రతినిధి గురుదయాళ్ సింగ్ నజార్ ప్రకటించారు.
 
 మనకు కావాల్సింది..* 650,00,00,00,00,000
 వాతావరణ మార్పులను తట్టుకోవ డం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దాదాపు అన్ని రంగాల్లోనూ కర్బన ఉద్గారాలను తగ్గించుకోవాల్సి ఉంటుంది. కొత్త టెక్నాలజీలతోపాటు మానవ వనరుల అభివృద్ధి పరిశోధనల కోసం కొత్తకొత్త సంస్థల ఏర్పాటు తదితర చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒక్క భారతదేశానికి మాత్రమే ఎంత మొత్తం అవసరమవుతుందో తెలుసా? దాదాపు లక్ష కోట్ల డాలర్లు! రూపాయల్లో చెప్పాలంటే.. 65 లక్షల కోట్లు! దేశంలోనే పేరెన్నికగన్న మూడు సంస్థలు సంయుక్తంగా తయారు చేసిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

‘క్లైమెట్ ఛేంజ్ అండ్ ఇండియా అడాప్టేషన్ గ్యాప్ (2015).. ఏ ప్రిలిమినరీ అసెస్‌మెంట్’ పేరుతో ఐఐటీ, ఐఐఎం(గాంధీనగర్, అహ్మదాబాద్)లతోపాటు కౌన్సిల్ ఆన్ ఎనర్జీ ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్‌లు ఈ నివేదికను సిద్ధం చేశాయి. గత 14 ఏళ్లలో దేశంలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాల (వరదలు, తుపానులు, వడగాడ్పులు, చలిగాలులు, కరువు కాటకాలు) వల్ల జరిగిన నష్టం ఆధారంగా ఈ మొత్తాన్ని లెక్కించారు. ఈ కాలంలో 131 సందర్భాల్లో వరదలు, 51 తుపానులు సంభవించగా, 26 సార్లు చలిగాలులు, వడగాడ్పులతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వీటన్నింటి వల్ల జరిగిన నష్టం దాదాపు రూ. 3 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా భవిష్యత్తులోనూ ఇలాంటివి మరిన్ని ఎక్కువ చోటు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీస్థాయిలో నష్టాలు నమోదవుతాయి. అందుకే వీటిని తట్టుకునేందుకు, ఆస్తి ప్రాణ నష్టాలను తగ్గించేందుకు అనేక చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. వీటన్నింటికీ అయ్యే ఖర్చును పరిగణనలోకి తీసుకుంటే అది దాదాపు 65 లక్షల కోట్ల రూపాయల వరకూ ఉంటుంది.
 
 కార్బన్ బడ్జెట్ అంటే ఏమిటి?
 పారిస్ సదస్సు సందర్భంగా తరచూ ఒక మాట వినిపిస్తోంది... అది కార్బన్ బడ్జెట్. ఏమిటిది? అన్న సందేహం మీకూ వచ్చే ఉంటుంది. సమాధానం ఇదిగో... 2100 నాటికి భూమి ఉష్ణోగ్రతలను నిర్దిష్ట స్థాయికి పరిమితం చేసేందుకు ఎంత మేరకు గ్రీన్‌హౌస్ వాయువులను విడుదల చేసే అవకాశం ఉందో దాన్ని కార్బన్ బడ్జెట్ అని పిలుస్తున్నారు. ఒక అంచనా ప్రకారం... పారిశ్రామిక విప్లవం మొదలైనప్పటి నుంచి 2100 వరకూ దాదాపు లక్ష కోట్ల టన్నుల కార్బన్ డైయాక్సైడ్‌ను విడుదల చేసినా భూమి ఉష్ణోగ్రత  రెండు డిగ్రీల సెల్సియస్‌కు మించి పెరగదు. అయితే ఈ లక్ష కోట్ల టన్నుల కార్బన్ బడ్జెట్‌లో 2011 నాటికల్లా మనం 52 శాతం వాడేశాము. అంటే ఇప్పటికే దాదాపు 52 వేల కోట్ల టన్నుల కార్బన్ డైయాక్సైడ్ వాతావరణంలోకి చేర్చేశామన్నమాట. ఫలితంగా ఉష్ణోగ్రత దాదాపు 0.85 డిగ్రీ సెల్సియస్ పెరిగింది. మిగిలిన 85 ఏళ్లలో కేవలం 48 వేల కోట్ల టన్నులు మాత్రమే విడుదల చేసేందుకు అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement