ఇక... జమ్మూ వంతు! Sakshi Editorial On Terrorist attacks In Jammu and Kashmir | Sakshi
Sakshi News home page

ఇక... జమ్మూ వంతు!

Published Tue, Jun 18 2024 4:46 AM

Sakshi Editorial On Terrorist attacks In Jammu and Kashmir

జమ్మూలో వరుస తీవ్రవాద దాడులు కలవరం సృష్టించగా, ఎట్టకేలకు సర్కార్‌ రంగంలోకి దిగింది. కేంద్ర హోమ్‌ మంత్రి సారథ్యంలో ఆదివారం ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అందులో తొలి అడుగు. పాక్‌ నుంచి తీవ్రవాదుల చొరబాటు యత్నాలను నిర్వీర్యం చేసేందుకు భద్రతా దళాల సంఖ్యను పెంచడం సరైన దిశలో సరైన చర్యగా చెప్పుకోవాలి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి రాజౌరీ, పూంచ్‌ , రియాసీ, కఠువా, ఉధమ్‌పూర్, దోడా జిల్లాలు ఆరింటిలో ఆరు ప్రధాన తీవ్రవాద దాడులు జరిగాయి. 

సైనిక వర్గాల కథనం ప్రకారం విదేశీ తీవ్రవాదులు నలుగురైదుగురు చొప్పున బృందాలుగా ఏర్పడుతున్నారట. అలాంటి బృందాలు కనీసం అయిదు పీర్‌ పంజల్, చీనాబ్‌ ప్రాంతాల్లో పని చేస్తున్నాయి. జమ్మూలోని ఈ కొత్త తరహా తీవ్రవాద ధోరణి కశ్మీర్‌కూ వ్యాపించే ప్రమాదం పొంచివుంది. అందుకే, జమ్మూ కశ్మీర్‌పై స్వయంగా ప్రధాని గత వారం సమీక్షా సమావేశం నిర్వహిస్తే, తర్వాత మూడు రోజులకే హోమ్‌ మంత్రి సైతం సమీక్ష చేశారు. పరిస్థితి తీవ్రతకు ఇది దర్పణం.  

కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతున్న సమయంలోనే తాజా దాడులు యాదృచ్ఛికం అనుకోలేం. జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితులు సజావుగా లేవనీ, 370వ అధికరణం రద్దు తర్వాత శాంతి నెలకొనలేదనీ వీలైనప్పుడల్లా ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా పాకిస్తాన్‌ ప్రేరేపిత తీవ్రవాదులు పని చేస్తూనే ఉన్నారు. తాజా తీవ్రవాద దాడులు అందులో భాగమే. ఇటీవల కొన్నేళ్ళుగా కశ్మీరీ తీవ్రవాదులు ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలను అనుసరిస్తున్నారు. 

2022లో నిర్దేశిత వ్యక్తులే లక్ష్యంగా హత్యలు చేసే పద్ధతిని అనుసరిస్తే, గత ఏడాది నుంచి సాంప్రదాయిక విన్యాసాలు సాగిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాల పైచిలుకుగా ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో అలజడులు సృష్టించసాగారు. గతంలో కశ్మీర్‌ ప్రాంతంపై పంజా విసిరిన ముష్కర మూకలు ఇప్పుడు ప్రశాంతమైన జమ్ము ప్రాంతంపై గురి పెట్టాయి. దాంతో, భద్రతా దళాలు తమ వ్యూహాలను మార్చుకోక తప్పని పరిస్థితి. 

గతాన్ని సింహావలోకనం చేసుకుంటే, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన 370వ అధికరణాన్ని రద్దు చేసిన తర్వాత దృష్టి అంతా కశ్మీర్‌పై నిలిచింది. అప్పటికి పదిహేనేళ్ళుగా జమ్మూలోని అధిక భాగంలో నిస్సైనికీకరణ సాగింది. ప్రశాంతత నెలకొంది. ఫలితంగా, విదేశీ తీవ్రవాదులు ఈసారి జమ్మూని తమకు వాటంగా చేసుకున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రధానంగా అడవులు ఈ విదేశీ చొరబాటుదారులకు కలిసొచ్చాయి. రాజౌరీ, పూంచ్‌∙జిల్లాల్లోని దట్టమైన అడవులు, సంక్లిష్టమైన కొండలు తీవ్రవాదుల కొత్త కేంద్రాలయ్యాయి. 

అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకొని, గుహల్లో దాక్కొని వారు తమ ఉనికి, బలం పెంచుకున్నారు. తాజాగా నాలుగు రోజుల్లో నాలుగు చోట్ల దాడులు జరగడం, అందులోనూ రియాసీ జిల్లాలో జూన్‌ 9న యాత్రికుల బస్సుపై అమానుష దాడితో ఒక్కసారిగా దేశమంతా ఉలిక్కిపడింది. ప్రభుత్వం హడావిడిగా క్షేత్రస్థాయి పరిస్థితులపై మళ్ళీ దృష్టి పెట్టింది. 

2021 జనవరి నుంచే వాస్తవాధీన రేఖ వెంట జమ్మూలోకి చొరబడడానికి విదేశీ తీవ్రవాద బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అప్పట్లో జమ్మూలోని అఖ్నూర్‌లో మన సైన్యం ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టి, ముగ్గురిని హతమార్చింది. అదే ఏడాది జూన్‌లో భారత వైమానిక దళ స్థావరంపై డ్రోన్‌ దాడి ఘటనల నుంచి జమ్మూ ప్రాంత సరిహద్దు జిల్లాల్లో తీవ్రవాద కార్యకలపాలు పెరిగాయి. 

2021 నుంచి ఇప్పటి వరకు ఒక్క జమ్మూ ప్రాంతంలోనే 29 తీవ్రవాద హింసాత్మక ఘటనలు జరిగాయి. జమ్మూ కశ్మీర్‌లో దాదాపు 100 మందికి పైగా తీవ్రవాదులు క్రియాశీలంగా ఉన్నారట. వారిలో తీవ్రవాద బాట పట్టిన స్థానికుల కన్నా విదేశీ తీవ్రవాదులే ఎక్కువ. ఇది తీవ్రమైన అంశం. ఒకప్పటి భారీ వ్యవస్థీకృత హింసాకాండ నుంచి ఇప్పుడు పొరుగునున్న శత్రువుల అండతో పరోక్ష యుద్ధంగా మారిన ఈ బెడదపై సత్వరమే కార్యాచరణ జరగాలి.

నిజం చెప్పాలంటే, జమ్మూ కశ్మీర్, మణిపుర్‌లు రెండూ ఇప్పటికీ అట్టుడుకుతూనే ఉన్నాయి. మోదీ 3.0 సర్కార్‌ ముందున్న ప్రధానమైన సవాళ్ళు ఇవి. ప్రభుత్వ పెద్దలు వీటిని అశ్రద్ధ చేయడానికి వీలు లేదు. అందులోనూ ఈ జూన్‌ 29 నుంచి అమరనాథ్‌ యాత్ర మొదలు కానున్న వేళ జమ్మూలో భద్రత కీలకం. గతంలో సాంప్రదాయికంగా తీవ్రవాదులకు పెట్టనికోట అయిన కశ్మీర్‌ లోయలో ఆ పరిస్థితిని మార్చడంలో భద్రతాదళాలు విజయం సాధించాయి. 

నిరుడు ఏకంగా 2.11 కోట్ల మంది సందర్శకులతో కశ్మీర్‌లో పర్యాటకం తిరిగి పుంజుకొంది. మొన్న లోక్‌సభ ఎన్నికల్లోనూ జనం ఉత్సాహంగా పాల్గొన్నారు. గత 35 ఏళ్ళలో ఎన్నడూ లేనంతగా మొత్తం కేంద్రపాలిత ప్రాంతంలో 58.46 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. తీవ్రవాదం పీచమణిచి సాధించిన అలాంటి విజయాలు జమ్మూలోనూ పునరావృతం కావాలని హోమ్‌ మంత్రి ఆదేశిస్తున్నది అందుకే. 

తీవ్రవాదులు ప్రధానంగా అంతర్జాల ఆధారిత వ్యవస్థల ఆధారంగా సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. విదేశీ సిమ్‌ కార్డులతో, పాకిస్తానీ సర్వీస్‌ ప్రొవైడర్లతో సాగుతున్న ఈ వ్యవహారానికి సాంకేతికంగా అడ్డుకట్ట వేయాలి. ప్రజలు, పోలీసులు, స్థానిక రక్షణ దళ సభ్యులతో సహా అందరినీ కలుపుకొనిపోతూ దేశంలో చేరిన ఈ కలుపు మొక్కల్ని ఏరిపారేయాలి. 

ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించాలని చూస్తున్న ఈ దుష్టశక్తుల పాచిక పారనివ్వరాదు. ప్రభుత్వం వెనక్కి తగ్గక  సెప్టెంబర్‌లో జరగాల్సిన జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలను నిరాటంకంగా జరిపించాలి. పాక్‌ పాలకులు పైకి మెత్తగా మాట్లాడుతున్నా, అక్కడి సైన్యాధ్యక్షుడు, సైనిక గూఢచారి వ్యవస్థ ఐఎస్‌ఐ చేసే కుటిల యత్నాలకు సర్వదా కాచుకొనే ఉండాలి. అప్రమత్తత, సత్వర సన్నద్ధతే దేశానికి శ్రీరామరక్ష.  

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement