మంగళూరులో మూలాలు | Dilsukhnagar blasts Suspects Asylum in Mangalore | Sakshi
Sakshi News home page

మంగళూరులో మూలాలు

Published Fri, Sep 13 2013 2:45 AM | Last Updated on Fri, Sep 28 2018 4:46 PM

మంగళూరులో మూలాలు - Sakshi

మంగళూరులో మూలాలు

దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లపై కీలక ఆధారాలు సంపాదించిన ఎన్‌ఐఏ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు కర్ణాటకలోని మంగళూరులో ఆశ్రయం పొందినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) విచారణలో బయటపడింది. ఆ పేలుళ్లకు ముందు అక్తర్ అలియాస్ తబ్రేజ్ మరో ఉగ్రవాది వకాస్ అలియాస్ అహ్మద్ మంగళూరు నుంచి పలుమార్లు హైదరాబాద్‌కు వచ్చివెళ్లినట్లు తేలింది. వారు ఆశ్రయం పొందిన మంగళూరు పట్టణం జఫర్ హైట్స్‌లోని ఫ్లాటును ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. తమ కస్టడీలో ఉన్న తబ్రేజ్‌ను ఆ ఫ్లాట్‌కు తీసుకువెళ్లి సోదాలు చేశారు. ఆ ఫ్లాటులో బాంబుల్లో టైమర్లుగా ఉపయోగించే 50 డిజిటల్ వాచీలు, కొన్ని సెల్‌ఫోన్లు, ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, కొంత అమ్మోనియం నైట్రేట్, మండే స్వభావం కలిగిన ఆయిల్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 21న జరిగిన దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల అనంతరం మంగళూరుకు వెళ్లిన తబ్రేజ్, వకాస్ మార్చి నెల వరకు కూడా అదే ఫ్లాట్‌లో ఉన్నట్లు విచారణలో బయటపడింది.
 
 ఆ తరువాతే దేశం వదిలివెళ్లినట్లు పోలీసుల విచారణలో తబ్రేజ్ వెల్లడించినట్లు సమాచారం. కోణార్క్ థియేటర్ సమీపంలోని టిఫిన్ సెంటర్ వద్ద తబ్రేజ్ సైకిల్ బాంబు పెట్టాడు. మరో ఉగ్రవాది వకాస్ ఆయనకు సహాయంగా ఆ ప్రాంతానికి వచ్చినట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. వెంకటాద్రి థియేటర్ ఎదురుగా ఉన్న బస్టాప్‌లో యాసిన్ భత్కల్ బాంబు పెట్టగా.. అతనికి సహాయంగా తహసీన్ అక్తర్ అలియాస్ హసన్ ఉన్నట్లు విచారణలో తేలింది. కర్ణాటకలో యాసిన్ భత్కల్‌ను గుర్తించే అవకాశం ఎక్కువగా ఉండటంతో అతను మాత్రం హైదరాబాద్‌లోనే ఆశ్రయం పొంది నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. యాసిన్ భత్కల్, హసన్ హైదరాబాద్‌లోనే మకాం వేసి పేలుళ్లకు అవసరమైన బాంబులను తయారుచేసినట్లు గుర్తించారు. దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లకు వారం ముందు నుంచే నగరంలో మకాం వేసిన భత్కల్, హసన్ పేలుళ్లు జరిగిన మరుసటి రోజు ఇక్కడి నుంచి వెళ్లినట్లు బయటపడింది. అయితే, యాసిన్‌భత్కల్ ఎక్కడ ఆశ్ర యం పొందాడు? పేలుళ్లకు ఉపయోగించిన సైకిళ్లను ఎక్కడి నుంచి సేకరించాడు? స్థానికంగా సహకరించిన మాడ్యూల్ ఏమిటి? అనే అంశాలను ఎన్‌ఐఏ అధికారులు శోధిస్తున్నారు.
 
దేశవ్యాప్తంగా వంద పేలుళ్లకు కుట్ర!
కరాచీ ఆపరేషన్ పేరుతో దేశవ్యాప్తంగా వంద భారీ పేలుళ్లు జరిపేందుకు కుట్ర పన్నినట్లు ఎన్‌ఐఏ విచారణలో యాసిన్ భత్కల్ వెల్లడించినట్లు సమాచారం. పాకిస్థాన్ సహకారంతో 2008 నుంచి ఇప్పటివరకు 44 పేలుళ్లకు పాల్పడ్డామని, మిగతా పేలుళ్లు కూడా ఎక్కడెక్కడ జరపాలనేదానిపై ఒక ప్రణాళిక రూపొందించుకున్నామని చెప్పినట్లు తెలిసింది. ఆ పేలుళ్ల కోసం పేలుడు పదార్థాలను కూడా సమీకరించామని భత్కల్ చెప్పాడు. దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల తర్వాత మరిన్ని పేలుళ్ల కోసం మంగళూరులోని అపార్ట్‌మెంట్‌లో పేలుడు పదార్థాలను సమకూర్చుకున్నట్లు వెల్లడించాడు. అయితే, హైదరాబాద్ సహా పలు పట్టణాల్లో వరుస పేలుళ్లకు కుట్ర చేసిన విషయాలన్నీ యాసిన్ భత్కల్ నుంచి ఒక్కొక్కటిగా దర్యాప్తు అధికారులు రాబడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement