భారతదేశ ద్రోహికి అమెరికాలో శిక్ష
రెనో: భారతీయుడై ఉండి అమెరికాలో శాశ్వత పౌరసత్వం పొందిన ఓ సిక్కు వ్యక్తి అమెరికాలో కటకటాల పాలయ్యాడు. అతడు భారత్‌లో ఉగ్రవాద చర్యలకు పాల్పడేందుకు సహాయపడ్డాడని అక్కడి జిల్లా కోర్టు నిర్ధారించడంతో దాదాపు 15 ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించనున్నాడు. బల్వీందర్ సింగ్ అనే వ్యక్తి అమెరికాలో స్థిరపడ్డాడు. ఇతడిది వాస్తవానికి పంజాబ్. ఖలిస్తాన్ ఉగ్రవాదులతో చేతులు కలిపి పంజాబ్‌లో పేలుళ్లకు పాల్పడే కుట్రతోపాటు భారత అధికారులను హత్య చేసేందుకు ప్రణాళికలు రచించాడు. అందుకు కావాల్సిన సామాగ్రిని కూడా అతడే పంపిణీ చేశాడు.
తమ ప్రణాళిక అమలుకు సంబంధించి ఫోన్ ద్వారా మాట్లాడాడు. అయితే, కొన్నాళ్లుగా అతడి చర్యలను గమనించిన అమెరికా అధికారులు.. 2013 డిసెంబర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడం మొదలుపెట్టారు. దానికి సంబంధించి చివరి వాదోపవాదాలు మంగళవారం కోర్టు ముందుకు రాగా అతడు నేరానికి పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది. కనీసం 15 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ‘భారత్ వంటి విదేశాల్లో ఉగ్రవాద దాడులతో హింసకు పాల్పడేందుకు, జన జీవితాన్ని చెదరగొట్టేందుకు బల్వీందర్ సింగ్ సహాయపడ్డాడు’ అని ఈ సందర్భంగా జడ్జీ స్పష్టం చేశారు.