దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులకు కుట్రపన్నిన ఐసిస్ భారత విభాగం జనూద్ ఉల్ ఖలీఫా-ఏ-హింద్(భారత్ ఖలీఫా సైన్యం) వివరాలు మరిన్ని వెలుగు చూశాయి.
భారత్‌లో పేలుళ్ల కోసం సంప్రదింపులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులకు కుట్రపన్నిన ఐసిస్ భారత విభాగం జనూద్ ఉల్ ఖలీఫా-ఏ-హింద్(భారత్ ఖలీఫా సైన్యం) వివరాలు మరిన్ని వెలుగు చూశాయి. ఈ మాడ్యూల్ నేరుగా ఇస్లామిక్ స్టేట్ అధినేత అబూబకర్ అల్ బాగ్దాదీ సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతోందని భారత అధికార వర్గాలు తెలిపాయి. రిపబ్లిక్ డే నేపథ్యంలో భారత్‌లోని కీలక ప్రాంతాల్లో పేలుళ్ల కోసం వారి నుంచి మాడ్యూల్‌కు ఆదేశాలు అందుతున్నాయని వెల్లడించాయి. జనూద్‌కు చెందిన 14 మందిని దర్యాప్తు సంస్థలు శుక్ర, శనివారాల్లో అరెస్ట్ చేసి, వారి ఆటకట్టించడం తెలిసిందే.
వీరిలో ముంబైలో అరెస్టయిన ముదాబిర్ ముస్తాక్ షేక్.. జనూద్‌కు ‘ఆమిర్’గా ప్రకటించుకున్నాడని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆ వర్గాల తెలిపిన వివరాల ప్రకారం.. జనూద్ ఏర్పాటు వెనక షేక్ కీలకపాత్ర పోషించాడు. అతడు బాగ్దాదీ ఆదేశాలతో ఆమిర్ అని ప్రకటించుకున్నట్లు తెలుస్తోంది. ఓ స్పోర్ట్స్ కంపెనీలో ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న అతడు సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్లలో చురుకుగా ఉన్నాడు. అతనిపై నిఘావర్గాలు కొన్ని నెలలుగా కన్నేసి ఉంచాయి. టర్కీ, సిరియాల నుంచి అతని డబ్బు అందాక వెంటాడాయి. ఈ మాడ్యూల్‌కు హైదరాబాద్‌లో అరెస్టయిన బిహార్ వాసి మొహమ్మద్ నఫీస్ ఖాన్ కోశాధికారిగా ఉన్నారు. కాగా, అరెస్టయిన హైదరాబాదీలు అబూ అనాస్, నఫీస్ ఖాన్‌లను ఆదివారం ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు13 రోజులపాటు ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగించింది.
రఫీక్‌పై హత్యాయత్నం కేసు
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో శనివారం పోలీసులు అదుపులోకి తీసుకునే సమంయలో చాకుతో దాడి చేసిన అనుమానిత ఉగ్రవాది రఫీక్ ఖాన్‌పై పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదైంది. దాడిలో గాయపడిన తెలంగాణ ఉగ్రవాద నిరోధక బృందానికి చెందిన కానిస్టేబుల్ శ్రీనివాస్ ఫిర్యాదుపై దీన్ని నమోదు చేశారు. రఫీక్‌ను, అతని భార్య యాస్మిన్ బానులను స్థానిక కోర్టు 15 రోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఇద్దరినీ ఢిల్లీకి తరలించినట్లు సమాచారం.