లష్కరే లఖ్వీ నిర్బంధం కొట్టివేత
ఇస్లామాబాద్: ముంబై ఉగ్రవాద దాడుల కీలక సూత్రధారి జకీవుర్ రెహ్మాన్ లఖ్వీకి ప్రజా భద్రతా రక్షణ చట్టం కింద పాకిస్తాన్ ప్రభుత్వం విధించిన నిర్భందాన్ని ఇస్లామాబాద్ హైకోర్టు సోమవారం రద్దు చేసింది. ఈ కేసుపై జనవరి 15లోగా పాక్ ప్రభుత్వం సమాధానం దాఖలు చేయాలని ఆదేశించింది. దీనితో ఈ కేసులో లఖ్వీ విడుదలకు మార్గం సుగమమైంది. అయితే, లఖ్వీని మరో కేసులో ప్రభుత్వం నిర్బంధించే అవకాశం ఉందని పాక్ హోం శాఖ అధికారి ఒకరు తెలిపారు.
ఉగ్రవాద దాడుల కేసులో లఖ్వీకి బెయిల్ మంజూరు చేస్తూ ఈ నెల 18నే ఉగ్రవాద వ్యతిరేక కోర్టు తీర్పు చెప్పింది. అయితే, అడియాలా జైలులో లఖ్వీ నిర్బంధాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీన్ని లఖ్వీ హైకోర్టులో సవాల్ చేశాడు. తన క్లయింట్ బెయిల్ దరఖాస్తును కోర్టు ఇదివరకే ఆమోదించిందని, అలాంటి పరిస్థితుల్లో పరిపాలనా యంత్రాంగమే లఖ్వీని నిర్బంధించడం చట్టవ్యతిరేకమని అతని న్యాయవాది వాదించారు. పాక్ ప్రభుత్వం తరఫున విచారణకు ఎవరూ హాజరుకాలేదు.
భారత్ తీవ్ర ప్రతిస్పందన.. లఖ్వీ నిర్బంధం రద్దుపై భారత్ తీవ్రంగా ప్రతిస్పందించింది. పేరుమోసిన ఉగ్రవాద సంస్థలకు పాక్ సురక్షిత కేంద్రమని మరోసారి తేలిందని విదేశాంగ శాఖ పేర్కొంది. ఢిల్లీలోని పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌కు విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాతా సింగ్ సమన్లు జారీ చేశారు. ఈ అంశాన్ని ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం పాక్ విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లింది.