Government of Pakistan
-
పాక్ నాయకత్వానికి అసలు పరీక్ష
ఎన్నికలపై రాజకీయ గందరగోళం, వివాదాలతో కూడిన వాతావరణంలో పాకిస్తాన్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రధానిగా తన రెండవ పదవీ కాలంలో, షెహబాజ్ షరీఫ్ బలహీనమైన ఆరు పార్టీల సంకీర్ణానికి నాయకత్వం వహిస్తున్నారు. ఇది పాలనాపరమైన పని నుండి ప్రభుత్వ దృష్టిని మరల్చగలదు. ఆందోళనా రాజకీయాలను ఆశ్రయించాలని ‘పీటీఐ’ భావించడం కూడా పాలక కూటమికి సవాలే. పరిపాలనలో సైనిక వ్యవస్థ అజమాయిషీ కూడా ప్రభుత్వ అధికారాన్ని పరిమితం చేసేదే. ఇక ఆర్థిక సవాలు, అత్యంత ముఖ్యమైనది. పాక్ దారుణమైన సంక్షోభంలో ఉంది. అయితే, కఠినమైన ఆర్థిక చర్యల ద్వారా భారత్ సహా పలు దేశాలు భయంకరమైన ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాయని గుర్తుంచుకోవాలి.పూర్తి మెజారిటీ లేని నాయకుడిగా షెహ బాజ్ షరీఫ్ తన ప్రభుత్వ మనుగడ కోసం పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)పై ఆధారపడ్డారు. ఈ పార్టీ కేబినెట్లో చేరడానికి నిరాకరిస్తూ ప్రభుత్వానికి మద్దతునిచ్చింది. దీని అర్థం ఏమిటంటే, పీపీపీ, ఇతర మిత్రపక్షాలను సంతోషంగా ఉంచడానికీ, వారి డిమాండ్లను నెరవేర్చడానికీ ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలలో నిమగ్నమై ఉంటుంది. ఆందోళనా రాజకీయాలను ఆశ్రయించాలని పాకిస్తాన్ తెహ్రిక్ ఎ ఇన్సాఫ్ (పీటీఐ) భావిస్తున్నందున ఇది పాలక కూటమికి నిరంతరం సవాలును విసురుతుంది. జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్షం పెద్ద కూటమిగా ఏర్పడినందున పార్లమెంటరీ వ్యవహారా లను నిర్వహించే పనిని అది మరింత కష్టతరం చేస్తుంది. అసెంబ్లీ ప్రారంభ సెషన్లలో పీటీఐ మద్దతుగల జాతీయ అసెంబ్లీ సభ్యుల విఘాతకరమైన ప్రవర్తన, రాబోయే పరిణామాల స్వరూపాన్ని సూచి స్తోంది. ప్రత్యేకించి వారు ప్రతి సెషన్ లోనూ నిరసనలు తెలుపుతామని తేల్చి చెప్పారు. ఈ ఘర్షణ శాసన నిర్మాణానికి అడ్డంకులుగా మారు తుంది. పైగా పార్లమెంట్ కార్యకలాపాలను కూడా స్తంభింపజేస్తుంది. పరిపాలనలో సైనిక వ్యవస్థ అజమాయిషీ కూడా ప్రభుత్వ అధికా రాన్ని పరిమితం చేస్తుంది. తన మునుపటి పదవీకాలంలో, షెహబాజ్ షరీఫ్ సైనిక వ్యవస్థకు చాలా ప్రాధాన్యతనిచ్చారు. ఇప్పుడు ఏదైనా ముఖ్యమైన మార్గంలో దానిపై తిరగబడడం లేదా దాని పాత్రను తగ్గించడం అసంభవం. కాబట్టి దేశం ఎలా నడుస్తుందనే అంశంపై సైన్యం అజమాయిషీ కొనసాగుతుందని దీని అర్థం. తర్వాత క్లిష్టమైన ప్రాదేశిక ముఖచిత్రం కూడా ఉంది. రాష్ట్రాలకు సంబంధించి పిఎమ్ఎల్–ఎన్ ఒక ప్రావిన్ ్సను మాత్రమే నియంత్రి స్తోంది. మిగిలిన మూడు ప్రావిన్సులను వేర్వేరు పార్టీలు నియంత్రి స్తున్నాయి. పైగా ఖైబర్ పఖ్తున్క్వాలో పూర్తిగా వ్యతిరేకమైన ప్రభుత్వం కొనసాగుతోంది. ఇది కూడా కొత్త ప్రభుత్వానికి పరిమితులు విధిస్తుంది. కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలను నిర్వహించడం ఒక స్పష్టమైన సవాలుగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఆచరణాత్మకమైన తత్వం, దృఢంగా వ్యవహరించడం మధ్య తెలివైన కలయిక అవసరం. అయితే దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ పరిమితులు ఏవీ ప్రభుత్వాన్ని నిరోధించకూడదు. ఏదేమైనా, అది ప్రభుత్వ బాధ్యత. దీని కోసం, ప్రధానమంత్రి తన మునుపటి పదవీకాలంలో నియమించిన విచిత్రమైన, సంఖ్యరీత్యా పెరిగి పోయిన క్యాబినెట్‌ను కాకుండా, ఒక సమర్థమైన బృందాన్ని ఎంచు కోవాలి. స్పష్టమైన, పొందికైన విధాన ఎజెండాను రూపొందించాలి. ఆర్థిక సవాలు, వాస్తవానికి అత్యంత ముఖ్యమైనది. పాకిస్తాన్ భారీ విదేశీ రుణ సేవా బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుండి కోరుకోవాల్సింది పొందేందుకు షరీఫ్ ప్రభుత్వం కఠినమైన, రాజకీయంగా బాధాకరమైన నిర్ణయాలను తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆర్థిక సవాలు తీవ్రమైనది అయినప్పటికీ ఈ సంక్షోభంలోనూ ప్రభుత్వం ఒక అవకాశాన్ని చూడాలి. ఎక్కువ రుణాలు తీసుకోవడం, ఉద్దీపనలు, సంస్కరణలను వాయిదా వేయడం, అధిక స్థాయి రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని సృష్టించకుండా ఎక్కువ రుణాలు సేకరించడం– ఇవన్నీ పాక్ రహదారిపై మరొక సంక్షోభానికి మాత్రమే హామీ ఇస్తాయి. వృద్ధి, పెట్టుబడులను ప్రోత్సహించడానికి లేదా రికార్డు స్థాయి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే విషయంలో ఏమీ చేయదు. కాబట్టి రోగాన్ని దాచిపెట్టే బ్యాండ్ ఎయిడ్ విధానం, ఏ విధంగానూ ఇప్పుడు ఆమోదయోగ్యం కాదు. ప్రత్యామ్నాయంగా ఈ సంక్షోభాన్ని విస్తృత శ్రేణి నిర్మాణాత్మక సంస్కరణలను ప్రారంభించడానికీ, ఆర్థిక వ్యవస్థను విష వలయం నుండి బయట పడేయటానికీ ఉపయోగించవచ్చు. నిలకడలేని ఆర్థిక అసమతుల్య తలు, భారీ దేశీయ, విదేశీ రుణాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తక్కువ పొదుపులు, పెట్టుబడి, స్తంభించిన వృద్ధి– ఇవన్నీ ఈ విషవలయంలో భాగమే. ప్రపంచంలోని పలు దేశాలు పాకిస్తాన్ ఎదుర్కొంటున్న దాని కంటే భయంకరమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. కానీ అవి సంక్షోభాన్ని బలంగా, మరింత స్థితిస్థాపకంగా తిరిగి లేచినిలబడేలా ఉపయోగించుకోగలిగాయి. 1997లో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న ఆగ్నేయాసియా దేశాలు ప్రాథమిక సంస్కరణలను చేపట్టడం ద్వారా, కఠినమైన ఆర్థిక చర్యలతో నిర్మాణాత్మక సమస్యలను పరిష్కరించడం ద్వారా గట్టెక్కాయి. అదేవిధంగా, 1990లలో భారతదేశం, 1980లు, 1990లలో అనేక లాటిన్ అమెరికన్ దేశాలు కూడా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొన్నాయి. అవి తర్వాత కోలుకోవడమే కాకుండా పటిష్టమైన వృద్ధి బాటలో పయనించగలిగాయి. ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాయి. ప్రతి సందర్భంలోనూ, దీర్ఘకాల నిబద్ధత చూపుతూ, స్థిరమైన విధానాలను ఈ దేశాల నాయకులు అమలుపరిచారు. అతుకుల బొంత పరిష్కారాలు నిజానికి పరిష్కారాలే కావనీ, నిర్మా ణాత్మక సర్దుబాట్లు, కఠినమైన ఆర్థిక విధానం, ఇతర సంస్కరణ చర్యలు ముందుకు సాగడానికి చాలా అవసరమనీ విశ్వసించిన సమర్థ బృందాల దన్నుతో నాయకులు తగు చర్యలు ప్రారంభించారు. స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని నెలకొల్పడానికి తక్షణ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పటికీ, మరొక సంక్షోభం కూడా షరీఫ్ ప్రభుత్వానికి సవాలుగా నిలుస్తుంది. ఇది మానవాభివృద్ధిలో సంక్షోభం. అక్షరాస్యత, విద్య, ఆరోగ్యం, పేదరికం, సామాజిక న్యాయం, మానవ సంక్షేమానికి సంబంధించిన ఇతర అంశాలు ఇటీ వలి సంవత్సరాలలో క్షీణిస్తున్నాయి. ప్రపంచ మానవాభివృద్ధి ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ గణనీయంగా పడిపోవడంతో ప్రపంచ బ్యాంక్ దీనిని ‘నిశ్శబ్ద, లోతైన మానవ మూలధన సంక్షోభం’గా పేర్కొంది. అత్యధిక సంఖ్యలో బడి మానేసిన 2 కోట్లకు పైగా పిల్లలతో ప్రపంచంలోనే పాకిస్తాన్ రెండవ స్థానంలో ఉందనే భయంకరమైన వాస్తవం, దాని విద్యా అత్యవసర పరిస్థితిని ప్రతిబింబిస్తుంది. 40 శాతం మంది నిరక్షరాస్యులతో అక్షరాస్యత స్థాయిలు నిలిచి పోయాయి. అంతకుముందటి సంవత్సరంతో పోలిస్తే 2023లో 1.25 కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి నెట్టబడ్డారని అంచనా. మానవ అభివృద్ధికి సంబంధించిన పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఇది దేశ స్థిరత్వం, ఆర్థిక పురోగతి గొప్ప ప్రమాదంలో పడనుందనే వాస్తవాన్ని తెలియజేస్తోంది. పాకిస్తాన్ నిద్రలో నడుచుకుని వెళ్తూ విపత్తులో పడిపోవచ్చని సూచిస్తుంది. ఈ సవాళ్లను నిండు రాజకీయ వాతావరణంలోనే పరిష్కరించవలసి ఉంటుందనీ, ప్రభుత్వ అధికారంపై ఉన్న పరిమితులు, ప్రధాన విధాన చర్యలను అమలు చేయగల దాని సామర్థ్యంపై భారంగా పడతాయనీ అంగీకరించాలి. రాజకీయ ఉద్రిక్తతలను తగ్గించడానికీ, కీలక చర్యలపై రాజకీయ ఏకాభిప్రాయాన్ని ఏర్పరచడానికీ ప్రభుత్వం మార్గాలను అన్వేషించాలి. ఇది సులభం కాదు. ప్రభుత్వ సంకీర్ణ భాగస్వాములు కఠినమైన ఆర్థిక చర్యల నుండి తమను తాము దూరం చేసుకోవాలనుకుంటున్నారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన నాయకులను వారి పోరాట మార్గం నుండి తప్పించడం కూడా అంతే కష్టం. అందుకే, షెహబాజ్ షరీఫ్‌కు ఇది నాయకత్వ పరీక్ష. మలీహా లోధి వ్యాసకర్త పాకిస్తాన్ దౌత్యవేత్త; ఐరాసలో పాక్ మాజీ ప్రతినిధి (‘ద డాన్’ సౌజన్యంతో) -
పాక్ నేతల ఆడియో సంభాషణలు లీక్ కలకలం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రభుత్వంలోని కీలక నేతల మధ్య సాగిన సంభాషణల ఆడియో క్లిప్పులు బయటకు రావడం కలకలం రేపుతోంది. అత్యంత భద్రత ఉండే ప్రధానమంత్రి కార్యాలయంలో అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్(నవాజ్) నేతల సంభాషణలు ఆ క్లిప్పుల్లో ఉండటం గమనార్హం. అంతర్గత, రక్షణ, న్యాయ, ఆర్థిక శాఖల మంత్రులు రాణా సనాఉల్లా, ఖ్వాజా ఆసిఫ్, ఆజం తరార్, అయాజ్ సాదిఖ్‌లు గత తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ ప్రభుత్వం గద్దె దిగడంపై చేసిన వ్యాఖ్యలు అందులో ఉన్నాయి. మరో ఆడియో క్లిప్పులో, ఆర్థిక మంత్రి ఇస్మాయిల్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పీఎంఎల్–ఎన్ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్, ఆర్థిక మంత్రి షెహబాజ్ షరీఫ్‌ల మధ్య జరిగిన సంభాషణ ఉంది. ప్రభుత్వం ఈ వ్యవహారంపై స్పందించలేదు. ప్రతిపక్షాలు మాత్రం సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. -
ప్రజల బంగారంపై పాక్ ప్రభుత్వం కన్ను
ఇస్లామాబాద్: నానాటికీ క్షీణిస్తున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలను పెంచుకునేందుకు ప్రజల నుంచి బంగారాన్ని అప్పుగా తీసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వం యోచిస్తోంది. పాక్ ఆర్థిక పరిస్థితి ఇటీవల కాలంలో వేగంగా క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ ఈఈసీ (ఎకనమిక్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్) ప్రజల నుంచి బంగారం తీసుకునే ప్రతిపాదన చేసింది. దీని ప్రకారం కమర్షియల్ బ్యాంకులు ప్రజల నుంచి బంగారం రుణంగా తీసుకొని వడ్డీ చెల్లిస్తాయి. ఇలా సేకరించిన బంగారాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్లో డిపాజిట్ చేసి విదేశీ నిల్వలు పెంచుకోవడానికి ఉపయోగిస్తారు. పాక్ ప్రజల వద్ద దాదాపు 5వేల టన్నుల బంగారం ఉంటుందని అంచనా. -
పెగసస్‌పై ఐరాస దర్యాప్తు జరపాలి: పాక్
ఇస్లామాబాద్: భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్ స్పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. ఈ మేరకు పాకిస్తాన్ ఫారిన్ ఆఫీసు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. సొంత పౌరులతోపాటు విదేశీయులపైనా భారత ప్రభుత్వం›గూఢచర్యం చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నట్లు వెల్లడించింది. భారత ప్రభుత్వం నిఘా పెట్టిన వారి జాబితాలో తమ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం ఉండడం తీవ్ర ఆందోళనకరమైన విషయమని పేర్కొంది. భారత్ ఒక బాధ్యతాయుతమైన దేశంగా వ్యవహరించాలని, ఈ విషయంలో అంతర్జాతీయ నిబంధనలన పాటించాలని పాకిస్తాన్ విదేశాంగ శాఖ తెలిపింది. చట్టవిరుద్ధ గూఢచర్యానికి స్వస్తి పలకాలంది. ‘పెగసస్’పై ఇజ్రాయెల్‌లో కమిటీ ఏర్పాటు జెరూసలేం: భారత్‌లో పెగసస్ స్పైవేర్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ నుంచి భారత ప్రభుత్వం ఈ స్పైవేర్‌ను కొనుగోలు చేసి, ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా కోసం ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. నిఘా సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గు తేల్చడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం పెగసస్ స్పైవేర్ లైసెన్సుల ప్రక్రియను సమీక్షించే పనికి ఈ కమిటీకి అప్పగిస్తామన్న సంకేతాలను ఇజ్రాయెల్ సర్కారు ఇచ్చింది. కమిటీ నివేదికను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎన్ఎస్ఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ షాలెవ్ హులియో స్వాగతించారు. -
పాక్‌లో రేప్ చేస్తే మగతనం మటాష్!
ఇస్లామాబాద్: రేపిస్టులకు కెమికల్ కాస్ట్రేషన్ (రసాయనాల ద్వారా పుంసత్వాన్ని దెబ్బతీయడం) చేయడం, రేప్‌ల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం కోసం పాక్ ప్రభుత్వం రెండు కొత్త ఆర్డినెన్సులు తీసుకువచ్చింది. ఈ చట్టాలను కేబినెట్ మరోమారు పరిశీలించి ఆమోదం తెలిపిన అనంతరం అధ్యక్షుడు ఆమోదించాల్సి ఉంటుంది. కొత్త చట్టాల ప్రకారం అన్ని వయసుల స్త్రీలను మహిళగా నిర్వచిస్తారు. ప్రస్తుత చట్టం ప్రకారం 15ఏళ్లలోపు స్త్రీలతో సంభోగాన్ని మాత్రమే రేప్‌గా పరిగణిస్తారు. అలాగే రేప్‌కు విధించే కెమికల్ కాస్ట్రేషన్ ప్రభావం కేసు స్వభావాన్ని అంటే తొలిసారి నేరం చేశారా లేక పదేపదే ఇలాంటి నేరాలు చేస్తున్నారా అనే విషయాన్ని బట్టి తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ఉంటుంది. కొత్త చట్టం ప్రకారం రేప్‌కేసులకు ప్రత్యేక కోర్టులతో పాటు యాంటీ రేప్ సెల్స్‌ను కూడా ఏర్పరుస్తారు. అలాగే మహిళల కన్యత్వాన్ని పరీక్షించేందుకు చేసే టూ ఫింగర్ టెస్ట్‌ను నిషేధిస్తారు. -
పాక్ జాతీయ స్వీటు గులాబ్ జామూన్!
పాకిస్తాన్లో తాజాగా ఎన్నికలు జరిగా యి. అయితే, మీరెన్నడూ కనీవినీ ఎరుగని ఎన్నికలవి. పాక్ జాతీయ స్వీటు ఎంపిక కోసం జరిగిన ఈ ఎన్నికల్లో అభ్యర్థులు మాత్రం.. గులాబ్ జామూన్, బర్ఫీ, జిలేబీ. జాతీయ స్వీటుగా గులాబ్ జామూన్‌ను నెటిజన్లు ఎన్నుకున్నారు. పాక్ ప్రభుత్వం ఆ దేశ నేషనల్ స్వీట్ ఎన్నికలో ట్విట్టర్ ద్వారా పాల్గొనా ల్సిందిగా ప్రజలను కోరింది. ఈ ట్విట్టర్ పోల్‌లో ప్రజలు తమ ఓటుహక్కును ఉపయో గించుకొని గులాబ్ జామూన్‌కు పట్టం కట్టారు. 47 శాతం మంది పాక్ ప్రజలు గులాబ్జామ్కే ఓటు వేయడంతో ఆ దేశపు జాతీయ స్వీటుగా గులాబ్ జామూన్‌ని ప్రకటించారు. 34 శాతం ఓట్లతో జిలేబీ ద్వితీయ స్థానంలో, బర్ఫీ 19 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచాయి. రిగ్గింగ్ జరిగింది. నేషనల్ స్వీట్పోల్లో ఓటింగ్ నిజాయితీగా సాగలేదనీ, రిగ్గింగ్ జరిగిందనీ పాక్ ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం 5 లక్షల కన్నా తక్కు వమంది ఫాలోవర్స్ ఉన్న అధికారిక ట్విట్టర్ నుంచే పోల్ నిర్వహించడం వారి వ్యతిరేకతకు కారణం. ట్విట్టర్ మినహా ఈ ఎన్నికల్లో ఇతర సోషల్ మీడియాకు అవకాశం లేకపోవడంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. అసలు గులాబ్ జామూన్ పాకిస్తానీ స్వీటు కాదన్నది కొందరి వాదన. దీన్ని మొగలుల కాలంలో షాజహాన్ వంటవారు కనుగొన్నారని కొందరంటోంటే, మధ్య ఆసియా నుంచి దండెత్తిన టర్కీ ఆక్రమణదారుల ద్వారా ఈ పాక్‌లోకి వచ్చిందని కొందరు ఆరోపిస్తున్నారు. మొత్తంగా జామూన్ పాకిస్తానీ స్వీటు కాదనీ, దీనికి విదేశీ రుచులున్నాయన్నది వీరి వాదన. -
పఠాన్‌కోట్ దాడిలో పాక్ హస్తం లేదు: ఎన్ఐఏ
న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి చేసిన ఉగ్రవాదులకు పాక్ ప్రభుత్వం సహకరించినట్లు, దాడి వెనుక దాని హస్తం ఉన్నట్లు ఆధారాలు లేవని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) డెరైక్టర్ జనరల్ శరద్ కుమార్ ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. జైషే మహ్మద్ సంస్థ చేసిన ఈ దాడి వెనుక పాక్ ప్రభుత్వ సహకారంగాని, దాని సంస్థల హస్తంగాని లేదన్నారు. ఈ ప్రకటన ప్రకంపనలు సృష్టించడంతో ఎన్ఐఏ వివరణ ఇచ్చింది. ప్రకటనను వక్రీకరించారంది. -
లష్కరే లఖ్వీ నిర్బంధం కొట్టివేత
ఇస్లామాబాద్: ముంబై ఉగ్రవాద దాడుల కీలక సూత్రధారి జకీవుర్ రెహ్మాన్ లఖ్వీకి ప్రజా భద్రతా రక్షణ చట్టం కింద పాకిస్తాన్ ప్రభుత్వం విధించిన నిర్భందాన్ని ఇస్లామాబాద్ హైకోర్టు సోమవారం రద్దు చేసింది. ఈ కేసుపై జనవరి 15లోగా పాక్ ప్రభుత్వం సమాధానం దాఖలు చేయాలని ఆదేశించింది. దీనితో ఈ కేసులో లఖ్వీ విడుదలకు మార్గం సుగమమైంది. అయితే, లఖ్వీని మరో కేసులో ప్రభుత్వం నిర్బంధించే అవకాశం ఉందని పాక్ హోం శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఉగ్రవాద దాడుల కేసులో లఖ్వీకి బెయిల్ మంజూరు చేస్తూ ఈ నెల 18నే ఉగ్రవాద వ్యతిరేక కోర్టు తీర్పు చెప్పింది. అయితే, అడియాలా జైలులో లఖ్వీ నిర్బంధాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీన్ని లఖ్వీ హైకోర్టులో సవాల్ చేశాడు. తన క్లయింట్ బెయిల్ దరఖాస్తును కోర్టు ఇదివరకే ఆమోదించిందని, అలాంటి పరిస్థితుల్లో పరిపాలనా యంత్రాంగమే లఖ్వీని నిర్బంధించడం చట్టవ్యతిరేకమని అతని న్యాయవాది వాదించారు. పాక్ ప్రభుత్వం తరఫున విచారణకు ఎవరూ హాజరుకాలేదు. భారత్ తీవ్ర ప్రతిస్పందన.. లఖ్వీ నిర్బంధం రద్దుపై భారత్ తీవ్రంగా ప్రతిస్పందించింది. పేరుమోసిన ఉగ్రవాద సంస్థలకు పాక్ సురక్షిత కేంద్రమని మరోసారి తేలిందని విదేశాంగ శాఖ పేర్కొంది. ఢిల్లీలోని పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌కు విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాతా సింగ్ సమన్లు జారీ చేశారు. ఈ అంశాన్ని ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం పాక్ విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లింది.