
ఇస్లామాబాద్: భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. ఈ మేరకు పాకిస్తాన్ ఫారిన్ ఆఫీసు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. సొంత పౌరులతోపాటు విదేశీయులపైనా భారత ప్రభుత్వం›గూఢచర్యం చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నట్లు వెల్లడించింది. భారత ప్రభుత్వం నిఘా పెట్టిన వారి జాబితాలో తమ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం ఉండడం తీవ్ర ఆందోళనకరమైన విషయమని పేర్కొంది. భారత్ ఒక బాధ్యతాయుతమైన దేశంగా వ్యవహరించాలని, ఈ విషయంలో అంతర్జాతీయ నిబంధనలన పాటించాలని పాకిస్తాన్ విదేశాంగ శాఖ తెలిపింది. చట్టవిరుద్ధ గూఢచర్యానికి స్వస్తి పలకాలంది.
‘పెగసస్’పై ఇజ్రాయెల్‌లో కమిటీ ఏర్పాటు
జెరూసలేం: భారత్‌లో పెగసస్ స్‌పైవేర్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ గ్రూప్ నుంచి భారత ప్రభుత్వం ఈ స్‌పైవేర్‌ను కొనుగోలు చేసి, ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా కోసం ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. నిఘా సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గు తేల్చడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం పెగసస్ స్‌పైవేర్ లైసెన్సుల ప్రక్రియను సమీక్షించే పనికి ఈ కమిటీకి అప్పగిస్తామన్న సంకేతాలను ఇజ్రాయెల్ సర్కారు ఇచ్చింది. కమిటీ నివేదికను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎన్‌ఎస్‌ఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ షాలెవ్ హులియో స్వాగతించారు.
Comments
Please login to add a commentAdd a comment