కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వర్తమానంలో సైతం కశ్మీర్‌కు ఉగ్రవాద బెడద తప్పలేదు. సరిహద్దుల్లో పాకిస్తాన్ వైపు నుంచి కాల్పుల మోత ఆగలేదు. ఒకపక్క పాకిస్తాన్ కరోనాతో నానా యాతన పడుతోంది. అయినా తన కుటిల ఎత్తుగడల్ని యధావిధిగా కొనసాగిస్తోంది. ఉత్తర కశ్మీర్ లోని హంద్వారా మండలం పరిధిలోని గ్రామం వద్ద 16 గంటలపాటు సుదీర్ఘంగా సాగిన ఎన్ కౌంటర్‌లో ఉగ్రవాదుల తుపాకి గుళ్లకు ఆదివారం మన సైన్యానికి చెందిన కల్నల్ అశుతోష్ శర్మ, మేజర్ అనూజ్ సూద్, జవాన్లు నాయక్ రాజేష్, లాన్స్ నాయక్ దినేశ్‌లతోపాటు ఎస్‌ఐ సాగిర్ అహ్మద్ క్వాజీ పఠాన్ కన్నుమూశారు. ఆ మర్నాడు అదే హంద్వారా ప్రాంతంలోని మరో గ్రామంలో ఉగ్రవాదులు సీఆర్‌పీఎఫ్ జవాన్లపై దాడి చేసి మరో ముగ్గురిని పొట్టనబెట్టుకున్నారు. ఈ దాడిలో మరో ఏడుగురు గాయపడ్డారు.
ఈ రెండు దాడుల వెనకా పాక్ సైన్యం కుట్రే వుంది. గత నెలలోనే నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) వద్ద అది పలుమార్లు కాల్పులకు తెగబడింది. కాల్పుల విరమణ ఒప్పం దాన్ని ఉల్లంఘించింది. ఉగ్రవాదుల్ని సరిహద్దులు దాటించడమే లక్ష్యంగా తరచు ఈ పని చేస్తోంది. గత నెల 5న ఎల్‌ఓసీ పొడవునావున్న ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో పాకిస్తాన్ వైపు నుంచి మన దేశంలో ప్రవేశించిన అయిదుగురు ఉగ్రవాదుల్ని మన జవాన్లు గుర్తించి కాల్చిచంపారు. అప్పుడు జరిగిన ఎన్‌కౌంటర్‌లో అయిదుగురు సైనిక కమాండోలు కూడా ప్రాణాలు కోల్పోయారు. మన దేశాన్ని చికాకు పరచడానికి పాకిస్తాన్ ఇంకా అనేకానేక ఎత్తుగడలకు పాల్పడుతోంది. సైనిక పరంగా మాత్రమే కాక సాంకేతిక రంగంలోనూ భారత్‌పై అది కత్తి కట్టింది. మన దేశం కరోనా కట్టడి కోసమని రూపొందించిన ఆరోగ్యసేతు యాప్‌కు అది నకిలీని రూపొందించి సైబర్ ప్రపంచంలో వదిలిందని ఇటీవలే వెల్లడైంది.
ఇరుగు పొరుగు దేశాల మధ్య ఘర్షణలు ముదిరితే వాటి పర్యవసానంగా రెండు దేశాలూ దెబ్బతింటాయి. పైగా కరోనా మహమ్మారి చుట్టుముట్టిన ఈ తరుణంలో ఘర్షణలకు దిగడం వల్ల ఆ వ్యాధి నియంత్రణ చర్యలపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించడం సాధ్యం కాదు. పాకిస్తాన్ కూడా కరోనా బాధిత దేశమే అయినా, దాన్నుంచి బయటపడటానికి కొట్టుమిట్టాడుతున్నా అక్కడి సైన్యానికి భారత్‌ను చికాకు పరచడమే ప్రధాన లక్ష్యం కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. గతంలో సైన్యాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వాల నుంచి ఎంతో కొంత ప్రయత్నం జరిగేది. కొన్నిసార్లు అది లొంగకతప్పేది కాదు. ఇప్పుడు పాక్ సైన్యానికి ఆ బాధ లేదు. ప్రస్తుతం ప్రధానిగావున్న ఇమ్రాన్ ఖాన్ వారి చలవతో గద్దెనెక్కిన వ్యక్తే. ఆయన పని తీరు ఎలావుంటున్నదో చెప్పడానికి మార్చి 15న జరిగిన సార్క్ అధినేతల వీడియో కాన్ఫరెన్సే నిదర్శనం.
ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన ఆ కాన్ఫరెన్స్‌కు ఇమ్రాన్ తప్ప అన్ని దేశాల నేతలూ హాజరయ్యారు. కరోనా కట్టడిలో అనుసరిం చాల్సిన వ్యూహం గురించి, సభ్య దేశాల మధ్య వుండాల్సిన సహకారం గురించి అందులో చర్చిం చారు. మన దేశం తన వంతుగా ఏమేం చేయదల్చుకున్నదో తెలిపింది. పాకిస్తాన్ నుంచి ఇమ్రాన్ తరఫున ఒక అధికారి హాజరయ్యారు. ఆయన కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించకుండా కశ్మీర్ సమస్యను లేవనెత్తారు. ఆ తర్వాత గత నెల 10న జరిగిన సమావేశంలో సైతం అది వితండవాదన చేసింది. ఏం చేసినా సార్క్ చట్రం పరిధిలోనే చేయాలి తప్ప ఎవరో ఒకరు చొరవ తీసుకుని చేయడం కుదరదని వాదించింది. ఏకాభిప్రాయం వస్తే తప్ప ఏదీ చేయకూడదన్న నిబంధన విధించాలన్నదే ఈ వ్యూహంలోని ఎత్తుగడ. ఆ తర్వాత భారత్ ప్రతిపాదించే ఏ చర్యకైనా మోకాలడ్డవచ్చని అది భావించింది. ఇతర సభ్య దేశాలన్నీ మన ప్రతిపాదనకు అంగీకారం తెలిపి, సమష్టిగా పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేయడంతో చేసేది లేక సమావేశం నుంచి పాక్ నిష్క్రమించింది. సంక్షోభ సమయాల్లో సైతం పాకిస్తాన్ పోకడ ఎలా వుంటుందో చెప్పడానికి సార్క్ అధినేతల వీడియో కాన్ఫరెన్స్‌లో అది వ్యవహరించిన తీరు, ఎల్‌ఓసీ వద్ద అది యధేచ్ఛగా సాగిస్తున్న కాల్పులు నిదర్శనం.
ఉగ్రవాదుల దుశ్చర్యకు లక్ష్యంగా మారిన 21 రాష్ట్రీయ రైఫిల్స్(ఆర్‌ఆర్) అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో తన కర్తవ్యాన్ని నిర్వహిస్తోంది. కశ్మీర్‌లో హంద్వారా సెక్టార్ దేశ భద్రత రీత్యా ఎంతో కీలకమైనది. ఆ ప్రాంతంనుంచే పాకిస్తాన్ సైన్యం ఎల్‌ఓసీ వద్ద ఉగ్రవాదుల్ని సరి హద్దులు దాటిస్తుంటుంది. కల్నల్ అశుతోష్ శర్మ ఆధ్వర్యంలో మన జవాన్లు అక్కడ ఈమధ్య కాలంలో ఎన్నో విజయాలు సాధించారు. అక్కడ ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించే ప్రత్యేక దళాలు(ఎస్‌ఎఫ్) నాలుగేళ్లక్రితం పాకిస్తాన్ గడ్డపై వున్న ఉగ్రవాద స్థావరాలను సర్జికల్ దాడుల్లో ధ్వంసం చేశాయి. హఠాత్తుగా దాడి మొదలైనప్పుడు, అప్పటికప్పుడు అంచనా వేసుకుని ఎదురుదాడికి పాల్పడవలసివస్తుంది. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు నష్టాలు సంభవించడానికి ఆస్కారం వుంటుంది.
ఈ తరహా ఆపరేషన్లలో కమాండింగ్ ఆఫీసర్(సీవో) ఎక్కడోవుండి ఆదేశాలివ్వడంకాక, ముందుండి తన దళాలను నడిపించవలసివుంటుంది. అక్కడ చావుకీ, బతుక్కీ మధ్య వెంట్రుకవాసి దూరం మాత్రమే వుంటుంది. సీవోగా వున్న కల్నల్ శర్మ హంద్వారా ప్రాంతంలో అలాంటి నాయకత్వ పటిమనే ప్రదర్శించారు. పౌరుల ప్రాణాలకు ముప్పు వాటి ల్లకుండా అక్కడినుంచి ఖాళీ చేయించగలిగారు. కానీ ఆ క్రమంలో ఆయన, ఆయన సహచరులు నేలకొరిగారు. ఇతర కమాండోలు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టగలిగారు. ఉగ్రవాదులద్వారా మన దేశాన్ని చికాకు పరుస్తూ ఎప్పటికైనా పైచేయి సాధించగలనని పాకిస్తాన్ పగటి కలలు కంటోంది. దాని కుట్రలను వమ్ము చేస్తూనే, ఆ దేశాన్ని అంతర్జాతీయంగా ఏకాకి చేయడమే మన కర్తవ్యం కావాలి.
Comments
Please login to add a commentAdd a comment