రష్యా దాడుల్లో ఇర్పిన్‌లో మంటల్లో చిక్కుకున్న భవనం
మారియుపోల్/లెవివ్: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం 18వ రోజుకు చేరుకుంది. రష్యా సైన్యం భీకర దాడులు కొనసాగిస్తోంది. రాజధాని కీవ్‌తోపాటు ముఖ్య నగరాలను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా క్షిపణులతో నిప్పుల వర్షం కురిపిస్తోంది. సైనిక స్థావరాలనే కాదు, సాధారణ నివాస గృహాలను కూడా విడిచిపెట్టడం లేదు. కీవ్, మారియుపోల్‌లో పరిస్థితి భీతావహంగా మారింది. కాల్పుల మోత ఆగకపోవడంతో పౌరుల తరలింపు సాధ్యం కావడంలేదు.
నీరు, ఆహారం, అత్యవసర ఔషధాలు అందక జనం హాహాకారాలు చేస్తున్నారు. ఎప్పుడే ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక బంకర్లలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మారియుపోల్‌లో విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా నిలిచిపోయింది. రాజధాని కీవ్ చుట్టూ రష్యా సైన్యం మోహరించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు మైఖేలో పొడొల్యాక్ చెప్పారు. కీవ్‌పై రష్యా సైన్యం చాలావరకు పట్టు సాధించిందని తెలిపారు. రాజధానిని ప్రత్యర్థుల కబంధ హస్తాల నుంచి కాపాడుకొనేందుకు జనం సిద్ధమవుతున్నారని వెల్లడించారు.
పశ్చిమ ఉక్రెయిన్‌లోని లెవివ్ నగర సమీపంలో ఉన్న యారోవివ్ సైనిక శిక్షణా కేంద్రంపై ఆదివారం ఉదయం రష్యా గగనతల దాడుల్లో 35 మంది మరణించారు. మరో 57 మంది గాయపడ్డారు. పోలండ్ సరిహద్దుకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న యారోవివ్ మిలటరీ రేంజ్‌పై రష్యా సైన్యం రాకెట్లు ప్రయోగించిందని ఉక్రెయిన్ అధికారులు చెప్పారు.
దీన్ని యారోవివ్ ఇంటర్నేషనల్ పీస్‌కీపింగ్, సెక్యూరిటీ సెంటర్‌గానూ పిలుస్తారు. అమెరికా సైనికాధికారులు ఇక్కడ ఉక్రెయిన్ సైన్యానికి స్వయంగా శిక్షణ ఇస్తుంటారు. ఈ మిలటరీ రేంజ్‌లో నాటో దేశాల సైనిక విన్యాసాలు జరుగుతుంటాయి. అయితే, యారోవివ్ శిక్షణా కేంద్రంలో మాటువేసిన 180 మంది విదేశీ కిరాయి సైనికులను హతమార్చామని, విదేశీ ఆయుధాలను ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది.
ఆయుధాలు సమకూర్చుకోవడానికి ఉక్రెయిన్‌కు మరో 20 కోట్ల డాలర్లు అందజేస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం అందజేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రష్యా హెచ్చరించింది. ఉక్రెయిన్‌కు ఆయుధాలు తెచ్చే నౌకలను పేల్చేస్తామని వెల్లడించింది.
నకిలీ రిపబ్లిక్‌లను సృష్టిస్తే సహించం
తమ దేశాన్ని ముక్కలు చేయడానికి రష్యా తమ భూభాగంలో నకిలీ రిపబ్లిక్‌లను సృష్టించేందుకు కుట్ర పన్నుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. డొనెట్‌స్క్, లుహాన్‌స్క్ తరహా అనుభవాలను పునరావృతం కానివ్వబోమన్నారు. ఖేర్సన్ ప్రాంతాన్ని రిపబ్లిక్‌గా మార్చేందుకు రష్యా ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందన్నారు. మానవతా కారిడార్ల ద్వారా 1,25,000 మందిని దేశం నుంచి క్షేమంగా బయటకు పంపించామని వివరించారు.
మరో మేయర్‌ను అపహరించిన రష్యా!
దినిప్రొరుడ్నె నగర మేయర్ యెవ్‌హెన్ మాట్‌వెయెవ్‌ను ఆదివారం రష్యా సైనికులు కిడ్నాప్ చేశారని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిత్రో కులేబా ఆరోపించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఇప్పటికే మెలిటోపోల్ సిటీ మేయర్ ఇవాన్ ఫెడోరోవ్‌ను రష్యా సైన్యం అపహరించినట్లు వార్తలు రావడం తెలిసిందే.
భారత ఎంబసీ పోలండ్‌కు మార్పు
ఉక్రెయిన్‌లో పరిస్థితులు భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉక్రెయిన్‌లోని తన రాయబార కార్యాలయాన్ని(ఎంబసీ) పొరుగు దేశం పోలండ్‌కు తాత్కాలికంగా మార్చాలని నిర్ణయించింది. రాజధాని కీవ్‌లో ఉన్న ఇండియన్ ఎంబసీ సిబ్బంది ఇప్పటికే లెవివ్ నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు.
రష్యా దాడుల్లో అమెరికా జర్నలిస్టు మృతి
ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలోని ఇర్పిన్‌లో రష్యా దాడుల్లో ప్రఖ్యాత ‘ద న్యూయార్క్ టైమ్స్’లో పనిచేసిన బ్రెంట్ రెనాడ్(51) మృతి చెందినట్లు ‘కీవ్ ఇండిపెండెంట్’ పత్రిక ఆదివారం వెల్లడించింది. మరో ఇద్దరు అమెరికా జర్నలిస్టులు గాయపడ్డారని తెలియజేసింది. అమెరికాకు చెందిన బ్రెంట్ రెనాడ్ సినీ దర్శకుడిగానూ పని చేస్తున్నారు.
నాటో జోలికొస్తే ప్రతిదాడులే: అమెరికా
ఉక్రెయిన్–నాటో దేశాల సరిహద్దుల్లో రష్యా దాడులకు దిగితే ప్రతిదాడులు చేస్తామని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవన్ తేల్చిచెప్పారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం, తాజా పరిణామాలపై జేక్ సలీవన్, చైనా విదేశాంగ విధానం సీనియర్ సలహాదారు యాంగ్ జీచీ సోమవారం రోమ్‌లో చర్చలు జరుపనున్నారు.
గూగుల్ ఉన్నతాధికారులకు బెదిరింపులు
పుతిన్‌కు వ్యతిరేకంగా ఓట్లను నమోదు చేసే ఒక యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించాలని రష్యా అధికారులు గూగుల్ మహిళా ఉన్నతాధికారిని బెదిరించారు. ఈ యాప్‌ను 24 గంటల్లో తొలగించకుంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని బెదిరించడంతో కంపెనీ ఆమెను ఒక హోటల్‌కు తరలించింది. కానీ కేజీబీ ఏజెంట్లు అక్కడకు వచ్చి మరోమారు బెదిరించారని తెలిపింది. దీంతో స్మార్ట్ ఓటింగ్ యాప్ గంటల్లో ప్లేస్టోర్ నుంచి మాయమైంది. తనకు ఇలాంటి బెదిరింపులే తమకూ వచ్చాయని యాపిల్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
ఉక్రెయిన్‌తో చర్చల్లో పురోగతి: రష్యా
ఇరుదేశాల మధ్య యుద్ధంపై ఉక్రెయిన్‌తో జరుగుతున్న చర్చల్లో గణనీయమైన పురోగతి లభించిందని రష్యా తరపు ప్రతినిధి లియోనిడ్ స్లట్‌స్కీ ఆదివారం చెప్పారు. చర్చల ప్రారంభం నాటితో పోలిస్తే ఇప్పుడు స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోందని అన్నారు. ఉక్రెయిన్–రష్యా ప్రతినిధుల మధ్య బెలారస్ సరిహద్దులు ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ చర్చలు ఇలాగే సానుకూల ధోరణితో కొనసాగితే రెండు దేశాల నడుమ ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని స్లట్‌స్కీ వివరించారు.
ఆశ్రయమిస్తే నెలకు 350 పౌండ్లు
ఉక్రెయిన్ శరణార్థులకు ఇళ్లల్లో ఉచితంగా వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తే నెలకు 350 పౌండ్లు చొప్పున భత్యం అందజేస్తామని యూకే హౌసింగ్ సెక్రెటరీ మైఖేల్ గోవ్ చెప్పారు. కనీసం 6 నెలలపాటు ఆశ్రయం కల్పించాల్సి ఉంటుందన్నారు. ఉక్రెయిన్ నుంచి ఎంతోమంది ప్రాణభయంతో తరలివస్తున్నారని, ఒక్కొక్కరి అవసరాలను తీర్చడానికి గాను స్థానిక కౌన్సిళ్లకు 10 వేల పౌండ్లుచొప్పున ఇస్తామన్నారు. శరణార్థులకు వైద్య సేవలు, వారి పిల్లల స్కూళ్ల ఫీజులు సైతం ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు ఆసక్తి ఉన్నవారు సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. శరణార్థులు మూడేళ్లపాటు ఉండొచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment