సాక్షి, న్యూఢిల్లీ: దేశం విస్తుపోయే ఉగ్ర దాడులన్నీ కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. నేరాలకు పాల్పడిన వ్యక్తులను వెంటనే గుర్తించి, దర్యాప్తును వేగవంతం చేసేందుకు వీలుగా అనుమానితులు, నేరస్తుల కొలతలు, బయోమెట్రిక్ నమూనాలను సేకరించే అధికారం పోలీసులు, జైలు వార్డెన్లకు కల్పించే క్రిమినల్ ప్రొసీజర్ (ఐడెంటిఫికేషన్) బిల్లుపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ నాయకుడు చిదంబరం అంతకుముందు ఈ బిల్లుపై చేసిన వ్యాఖ్యల్ని ఎంపీ విజయసాయిరెడ్డి తూర్పారబట్టారు. నాడు కాంగ్రెస్ పాల్పడిన దుశ్చర్యల కారణంగానే తాను ఈ బిల్లును సమర్థిస్తున్నట్లు చెప్పారు.
2007లో సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో, 2008లో అస్సాంలో, 2010లో పుణెలో బాంబు పేలుళ్లు, 2011లో ముంబైపై కసబ్ ముఠా దాడులు.. ఇలా దేశాన్ని నివ్వెరపరచిన ఈ ఉగ్ర దాడులన్నీ కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని గుర్తుచేశారు. కానీ నేడు మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ నాయకుడు చిదంబరం సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించాలని కోరుతున్నారుగా.. మరి హోం మంత్రిగా ఉన్న సమయంలో ఎన్ని బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపించారు..’ అని చిదంబరాన్ని ప్రశ్నించారు. చిదంబరం చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు.. చేసేవి తప్పుడు పనులు అని పేర్కొన్నారు. చిదంబరం, గులాంనబీ ఆజాద్ కలసి తనపై, తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు కేసులు బనాయించారని చెప్పారు.
అలాంటి దుష్టచింతన కలిగిన చిదంబరం బిల్లును వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో ఉదాశీనత కారణంగానే ఉగ్రవాదులు రెచ్చిపోయారని చెప్పారు. దేశ ప్రజలు తీవ్ర భయాందోళనలతో గడపాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ప్రపంచం దృష్టిలో నాడు భారత్ బలహీనమైన దేశంగా ముద్రపడిందన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ అధికారం చేపట్టిన తర్వాత టెర్రరిస్టుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారని చెప్పారు. ఉగ్రదాడులను ప్రోత్సహిస్తున్న పొరుగు దేశంపై సర్జికల్ దాడులు చేయడానికి కూడా మోదీ వెనుకాడలేదని గుర్తుచేశారు. ప్రధాని మోదీ అనుసరించిన విధానాల వల్ల దేశ భద్రతపై ప్రజల్లో మళ్లీ విశ్వాసం కలిగిందని ప్రశంసించారు. ఈ సమయంలో విజయసాయిరెడ్డి ప్రసంగానికి విపక్షాలు అంతరాయం కలిగించడంతో హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకున్నారు. కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ సహచర సభ్యుడు మాట్లాడుతుంటే వినే ఓపిక, సహనం లేకపోతే ఎలా అని అమిత్‌షా ప్రశ్నించారు. మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు విజయసాయిరెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్పాలని షా సూచించారు.
దిశ బిల్లుకు వెంటనే ఆమోదం తెలపండి
మహిళలపై జరిగే అత్యాచారం కేసుల్లో నిందితులను త్వరితగతిన శిక్షించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ బిల్లును తక్షణమే ఆమోదించాలని హోంమంత్రి అమిత్‌షాకు విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
శిక్షలు పడుతున్న కేసులు తక్కువ
విజయసాయిరెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఎప్పుడో 1920లో చేసిన ఈ చట్టానికి మారిన పరిస్థితులకు అనుగుణంగా సవరణ చేపట్టడం ఎంతైనా అవసరమని చెప్పారు. ఈ బిల్లును ప్రవేశపెట్టినందుకు హోంమంత్రి అమిత్‌షాను అభినందిస్తూ 2020 నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డుల ప్రకారం దేశంలో వివిధ నేరాలకు పడుతున్న శిక్షల శాతాన్ని వివరించారు. మర్డర్ కేసుల్లో 40 శాతం, రేప్ కేసుల్లో 39 శాతం, హత్యాయత్నం కేసుల్లో 24 శాతం నిందితులకు శిక్షలు పడ్డాయని తెలిపారు. శిక్షలు పడిన కేసుల శాతం ఇంత తక్కువగా ఉండటానికి కారణం నేరస్తులను శిక్షించే బలమైన ఆధారాల సేకరణకు పోలీసుల వద్ద తగిన ఉపకరణాలు లేకపోవడమేనని చెప్పారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో శిక్షలు పడుతున్న కేసులు చాలా తక్కువగా ఉంటున్నాయన్నారు.
యూకేలో 2020–21లో 83.6 శాతం కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయని, అమెరికాలో 93 శాతం, జపాన్‌లో 99 శాతం నేరాలకు తగిన శిక్షలు పడ్డాయని చెప్పారు. సమర్థమైన విచారణకు క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్స్, సిస్టమ్స్ ఎంతైనా అవసరమన్నారు. నేరస్తుల వేలి, కాలిముద్రల సేకరణ అనేది కొత్తగా ప్రవేశపెడుతున్నదేమీ కాదని, అనేక క్రిమినల్ కేసుల్లో వాటిని సాక్ష్యాలుగా వినియోగించుకున్న సందర్భాలున్నాయని చెప్పారు. ఉదాహరణకు 2013లో బుద్ధగయలో జరిగిన ఉగ్రదాడి అనంతరం ఘటనాస్థలంలో బౌద్ధభిక్షువు ధరించే వస్త్రం దొరికిందని, వస్త్రంలో దొరికిన వెంట్రుకలు బాంబు దాడికి పాల్పడిన నిందితుడి వెంట్రుకలకు సరితూగాయని గుర్తుచేశారు. ఈ కేసులో నిందితుడికి వ్యతిరేకంగా అవే కీలక సాక్ష్యంగా మారాయన్నారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్‌లో అందుబాటులోకి వచ్చిన అధునాతన టెక్నాలజీని మనం కచ్చితంగా వినియోగించుకుని తీరాల్సిందేనని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment