సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం పార్లమెంటరీ సంప్రదాయాలను సైతం తుంగలో తొక్కి అశాస్త్రీయంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించి, ఏపీకి తీరని నష్టం చేసిందని వైఎస్సార్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ను ఎన్నటికీ క్షమించరని అన్నారు. పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో విజయసాయిరెడ్డి మాట్లాడారు.
వైఎస్సార్‌సీపీ, పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరపున రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రకటిస్తూ ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఏపీకి కాంగ్రెస్‌ను విలన్‌గా అభివరి్ణంచారు. రాష్ట్రం ప్రత్యేక హోదా పొందలేకపోవడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోర నేరమే కారణమన్నారు. ఆనాడు తెలంగాణలో అధికారంలోకి రావడానికి రాష్ట్ర విభజన చేసి ఏపీకి కంటితుడుపు చర్యగా ప్రత్యేక హోదాను చట్టంలో పెట్టకుండా కేవలం ప్రకటన మాత్రమే చేసిందని చెప్పారు. ఈ అంశాన్ని విభజన బిల్లులో పొందుపరిచి పార్లమెంట్ ఆమోదం పొంది ఉంటే రాష్ట్రానికి హోదా చట్టబద్ధంగా వచ్చేదన్నారు.
ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశమని తెలిపారు. హోదాపై కాంగ్రెస్ కపట నాటకం ఆడి ఈరోజు వైఎస్సార్‌సీపీని నిందిస్తోందన్నారు. ఎవరో మాణిక్కం ఠాగూర్ అనే కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిద్ర లేచిన దగ్గర నుంచి వైఎస్సార్‌సీపీని ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ యవనికపై కుటుంబ సమస్యలు తీసుకురావద్దని కాంగ్రెస్‌కు హితవు పలికారు. రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను లాగడం సరైన చర్య కాదని చెప్పారు.
రాష్ట్ర ఆర్థిక, సామాజిక వ్యవస్థను దెబ్బ తీసింది
కాంగ్రెస్ పార్టీ దుష్పరిపాలనకు అతి పెద్ద బాధిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజించి రాష్ట్ర ఆర్థిక, సామాజిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బ తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2004 ఎన్నికల మేనిఫెస్టోలోనే తెలంగాణ రాష్ట్రం ఇస్తామని ప్రకటించి, పదేళ్ల తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌కు పది రోజుల ముందు అడ్డదారిలో విభజనకు పూనుకుందని, రెండు రాష్ట్రాల ప్రయోజనాలను నాశనం చేసిందని తెలిపారు. కాంగ్రెస్ లోక్ సభలో ప్రవేశపెట్టిన విభజన బిల్లును రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సభ్యులే తీవ్రంగా వ్యతిరేకించారన్నారు.
ప్రధానంగా నీళ్లు, విద్యుత్తు, రెవెన్యూ పంపిణీ, రాజధాని హైదరాబాద్ వంటి ప్రధాన అంశాల్లో ఏపీకి న్యాయం జరిగేలా బిల్లులో సవరణ కోసం ఏపీ కాంగ్రెస్ ఎంపీలు పట్టుబట్టినా పట్టించుకోలేదన్నారు. లోక్‌సభ ద్వారాలు మూసేసి, గ్యాలరీలు ఖాళీ చేయించి, ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా నిలిపివేసి, పార్లమెంటరీ సంప్రదాయాలను సైతం తుంగలో తొక్కి నికృష్ట చేష్టలకు పాల్పడిందని విమర్శించారు. ఈ బిల్లుతో ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాజ్యసభలో సైతం సభ్యులు గట్టిగా పట్టుబట్టారని తెలిపారు.
నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఏపీకి అయిదేళ్లు ప్రత్యేక హోదా కలి్పస్తున్నట్లు రాజ్యసభలో ప్రకటించినప్పటికీ, ఆయన హామీని చట్టబద్ధం చేసేలా బిల్లులో సవరణలు చేయలేదన్నారు. విభజన చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత అది అమల్లోకి రావడానికి మూడు నెలలు ఉన్నప్పటికీ, మంత్రివర్గంలో తీర్మానం చేయలేదని చెప్పారు. ఇంత ద్రోహం చేసిన కాంగ్రెస్‌ను పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ నమ్మరని, అందుకే 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదని అన్నారు. 2014 నుంచే కాంగ్రెస్ పతనం మొదలైందని, 2029 నాటికి భారత్‌కు కాంగ్రెస్ నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
హోదా కోసం ప్రధానమంత్రికి పదే పదే విజ్ఞప్తి
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి ఎనిమిదిసార్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రధాన మంత్రిని కలిసి ప్రత్యేక హోదా కోసం విజ్ఞప్తి చేశారని విజయసాయిరెడ్డి చెప్పారు. నోడల్ ఏజెన్సీ అయిన హోం శాఖ మంత్రిని కలిసిన పన్నెండుసార్లూ ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారన్నారు. లోక్‌సభ, రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ సభ్యులు లెక్కలేనన్నిసార్లు ప్రత్యేక హోదా కోసం ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment