తొక్కిస్తున్నారు
► చవకగా... తేలికగా
► వాహనంతో దాడులకు ఉగ్రసంస్థల మొగ్గు
‘సాధ్యమైనంత ఎక్కువగా ప్రాణనష్టం కలిగించడం... అదీ పెద్దగా వ్యూహరచన అవసరం లేకుండా, అత్యంత చవకగా’ అనేది ఇప్పుడు ఉగ్ర సంస్థల లక్ష్యంగా మారింది. ఒకప్పుడు ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి, ఎంతోమందిని దాడిలో భాగస్వాములను చేసి... రెక్కీలు నిర్వహించి, పక్కా ప్రణాళికతో దాడులు చేసి విధ్వంసం సృష్టించేవారు.
ఎక్కడ, ఏ రోజు, ఏ సమయానికి దాడికి తెగబడాలనే దాన్ని ముందే నిర్ణయించుకునే వారు. భారీ ప్రాణనష్టం కలిగించడం ద్వారా పాశ్చాత్యులను భయభ్రాంతులకు గురిచేసేవారు. కానీ ఇప్పుడు పంథా మారింది. ఓ పికప్ (సరుకు రవాణా) వాహనాన్ని అత్యంత వేగంగా నడుపుతూ జనాన్ని తొక్కించడమే. ఉగ్రవాద సంస్థలు ఈ తరహా దాడులకు మొగ్గడం వెనుక పలు అనుకూలతలు ఉన్నాయి. బార్సిలోనా దాడి నేపథ్యంలో అవేమిటో చూద్దాం...
కనిపెట్టే అవకాశం ఉండదు...
రైళ్లలో, బస్సుల్లో, స్టేడియాల్లో లేదా ఇతర జనసమ్మర్థ ప్రాంతాల్లో బాంబులు పెట్టాలంటే... వాటిని గుట్టుగా రవాణా చేయాలి. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ లాంటి చోట్ల మెటల్ డికెట్లర్లు, సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఉంటుంది. కాబట్టి బాంబులను అనుకున్న చోటకు చేర్చడం కష్టం. మానవ బాంబులుగా మారి దాడి చేద్దామన్నా ఇదే పరిస్థితి. పైగా బాంబులను తయారుచేయడం, రవాణా... రిస్క్‌తో కూడుకున్నవి. ఏమాత్రం తేడా వచ్చినా... పేలిపోతారు.
కుట్ర భగ్నం చేయడం కష్టం...
సాధారణంగా నిఘా వ్యవస్థలు ఉగ్ర కదలికలపై గట్టి నిఘా పెడతాయి. ఇంటర్నెట్‌పై, సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే సంభాషణలపై కన్నేసి ఉంచుతాయి. ఫోన్ సంభాషణలపైనా నిఘా ఉంటుంది. ఆధునిక భద్రతా వ్యవస్థల కళ్లుగప్పి... ఐసిస్ ఆక్రమిత ప్రాంతం నుంచి యూరోప్ దేశాల్లోని తమ సానుభూతిపరులతో, ఉగ్రవాదులుగా మారిన వారితో సంప్రదింపులు జరపడం అంత తేలిక కాదు.
ఇలా ప్రయత్నించే సందర్భాల్లో పలు ఉగ్రకుట్రలు భగ్నమవుతుంటాయి. అదే సానుభూతిపరులను ఒంటరిగా వాహనదాడులకు ప్రేరేపిస్తే... ఎలాంటి అవరోధాలు లేకుండా పని ఇట్టే పూర్తయిపోతుంది. భారీ ప్రాణనష్టం ద్వారా... విపరీతమైన ప్రచారం లభిస్తుంది. ఉగ్ర సంస్థల లక్ష్యం తేలికగా నెరవేరుతుంది. అందుకే ఉగ్రసంస్థలు తమ మాధ్యమాల ద్వారా ఇలా ఒంటరిగా దాడులు చేసే వారిని అమరయోధులుగా కీర్తిస్తూ ఆకాశానికెత్తుతున్నాయి. తద్వారా మరింత మందిని ఈ దిశగా ప్రేరేపించే ప్రయత్నం చేస్తున్నాయి.
శిక్షణ అక్కర్లేదు...
ఉగ్రసంస్థలు తాము రిక్రూట్ చేసుకునే వారిని... తమ అనుకూల ప్రాంతాలకు రప్పించి శిక్షణ ఇస్తుంటాయి. తుపాకీ కాల్చడం, బాంబుల తయారీ, ఎవరికీ అనుమానం రాకుండా పనిచేసుకుపోవడం, సంభాషణల్లో వాడే కోడ్ భాష... తదితర అంశాల్లో శిక్షణ ఇస్తుంటాయి. అదే పికప్ వ్యాన్‌తో జనాన్ని తొక్కించాలంటే ఎలాంటి శిక్షణా అక్కర్లేదు. డ్రైవింగ్ తెలిస్తే చాలు.
చవక... తేలిక
బాంబుదాడుల్లో ఎన్నో వ్యయప్రయాసలుంటాయి. అదే పికప్‌తో చేసే దాడి చాలా చవక. చేయాల్సిందల్లా ఓ వాహనాన్ని అద్దెకు తీసుకోవడం. పైగా చట్టవిరుద్ధం కూడా కాదు. జనంతో కిటకిటలాడే ప్రదేశానికి వెళ్లి విచక్షణారహితంగా వాహనాన్ని నడిపి భీభత్సాన్ని సృష్టించడం. ఖర్చుపరంగా ఇది చాలా చవక, అమలుపరంగా అత్యంత తేలిక. ఒకవేళ ముందుజాగ్రత్తగా ఇలాంటి వాహనాలను తనిఖీ చేసినా... నడుపుతున్న వ్యక్తి ఉద్దేశాన్ని పసిగట్టం అసాధ్యం.
ఎలా మొదలైంది...
పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో శత్రు శిబిరంలోకి చొచ్చుకెళ్లి పేల్చివేయడం... చాలా కాలంగా ఉంది. కానీ వాహనంతో గుద్దిచంపడాన్ని 2008లో ఇజ్రాయిలీలపై దాడికి పాలస్తీనియన్లు తొలుత ప్రారంభించారు. తర్వాత అల్‌ఖైదా, ఐసిస్‌లు వ్యతిరేకులపై దాడికి దీన్నో సమర్థ ఆయుధంగా వాడొచ్చని గుర్తించి ప్రచారం ప్రారంభించాయి.
2014లో ఐసిస్ మీడియా గ్రూపు ఎనిమిది నిమిషాల వీడియోను విడుదల చేసింది. పాశ్చాత్యులను, ఇస్లాంను అనుసరించని వారిని భయబ్రాంతులకు గురిచేయండి. ఎప్పుడేం జరుగుతుందోననే భయంతో వారికి నిద్ర కూడా పట్టకూడదు. మనవారి కోసం పొరాడటానికి సిరియా, ఇరాక్‌లకు రానక్కర్లేదు. మీరున్న చోటే... మీ కార్లను ఆయుధాలుగా వాడండి. జనాన్ని కార్లతో తొక్కిచంపండి’ అని ఇందులో ఐసిస్ పిలుపిచ్చింది. తర్వాత ఈ తరహా దాడులు పెరిగాయి.
డిసెంబరు 2014: ఫ్రాన్స్‌లోని నాంతెస్‌లో క్రిస్మస్ మార్కెట్లోకి ఒక వ్యాన్ దూసుకెళ్లింది. అలాగే డిజాన్‌లో ఓ కారు పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ రెండు ఘటనల్లో 20 మంది గాయపడ్డారు.
జులై 14, 2016: ఫ్రాన్స్‌లోని నైస్‌లో అత్యంత ఘోర దుర్ఘటన జరిగింది. ట్యునీషియా దేశస్థుడైన మహ్మద్ బౌహ్‌లెల్ ఓ భారీట్రక్కుతో జనంపైకి దూసుకెళ్లి ఏకంగా 86 మంది చావుకు కారణమయ్యాడు. వందమంది పైచిలుకు క్షతగాత్రులయ్యారు. ఉగ్రభావాలతో ప్రేరేపితుడైన బౌహ్‌లెల్ జనాన్ని ట్రక్కుతో తొక్కిస్తూ మైలు దూరం వెళ్లాక చివరికి పోలీసులు అతన్ని కాల్చిచంపారు.
డిసెంబరు 19, 2016: బెర్లిన్‌లోని క్రిస్మస్ మార్కెట్లోకి ట్రాక్టర్ ట్రైలర్‌ను నడపి అనిస్ అమ్రీ (ట్యునీషియా) 12 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నాడు. యూరప్‌ను జల్లెడ పట్టిన పోలీసులు... ఘటన జరిగిన నాలుగురోజులకు అమ్రీని ఇటలీలోని మిలన్‌లో కాల్చిచంపారు. ఇతను ఐసిస్‌కు విధేయతను ప్రకటిస్తున్న వీడియోను ఆ సంస్థ విడుదల చేసింది.
మార్చి 22, 2017: లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జిపై నడిచి వెళుతున్న పాదచారులపైకి ఎస్‌యూవీని నడిపి నలుగురిని చంపిన ఖాలిద్ మసూద్... తర్వాత వాహనం ఆగిపోవడంతో... కిందకు దిగి ఓ పోలీసు అధికారిని పొడిచి చంపాడు. చివరకు పార్లమెంటుకు సమీపంలో భద్రతాబలగాలు ఇతన్ని కాల్చి చంపాయి.
ఏప్రిల్ 7, 2017: స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో ఓ ఫుట్‌పాత్‌పైకి ట్రక్కును నడిపి ఐదుగురిని పొట్టనబెట్టుకున్నాడు ఉబ్జెకిస్థాన్‌కు చెందిన రఖ్‌మత్ అకిలోవ్. ఉగ్రదాడిగా నిందితుడు అంగీకరించాడు.
జూన్ 3, 2017: లండన్ బ్రిడ్జిపై పాదచారులపైకి వ్యాన్‌ను నడిపి... తర్వాత దారినే పోయేవారిని కత్తులతో పొడిచారు ముగ్గురు తీవ్రవాదులు. ఈ దాడిలో మొత్తం ఎనిమిది మంది మృతి చెందారు.
జూన్ 19, 2017: మసీదులో ప్రార్థన చేసుకువచ్చిన వారిపైకి డారెన్ ఓస్బోర్న్ అనే వ్యక్తి వ్యాన్‌తో ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. నిందితుడిపై తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డాడనే అనుమానం కూడా ఉంది.
ఆగష్టు 17, 2017: బార్సిలోనాలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో జనంపైకి ఓ వ్యాన్ దూసుకెళ్లింది. 13 మంది మృతి చెందగా, 100 మంది దాకా గాయపడ్డారు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్