
‘డస్ట్ లేడీ’ వెళ్లిపోయింది...
న్యూయార్క్: అమెరికాలోని ‘వరల్డ్ ట్రేడ్ సెంటర్’పై 2001, సెప్టెంబర్ 11వ తేదీన హైజాక్ చేసిన విమానాలతో టెర్రరిస్టులు జరిపిన భయానక దాడికి ప్రత్యక్ష సాక్షి, బాధితురాలు మార్సి బోర్డర్స్. ఆ దాడికి చేదు జ్ఞాపకంగా ‘డస్ట్ లేడీ’గా, ఓ ఐకాన్‌గా ప్రపంచానికి పరిచయమైన మార్సి బోర్డర్స్ సోమవారం కేన్సర్ వ్యాధితో చనిపోయారు. తన 28వ ఏటనే జరిగిన ఊహించని దారుణ అనుభవాన్ని మరిచిపోలేక భయం నీడల మధ్య, మద్యం మత్తులో బతుకుతూ చిక్కి శల్యమైన బోర్డర్స్ చివరకు తన 42వ ఏట తనువు చాలించారు. ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించిన ‘ది బలాడ్ ఆఫ్ మార్సి బోర్డర్స్’ పాటను మనకు మిగిల్చి వెళ్లి పోయారు.
బోర్డర్స్ మరణించిన విషయాన్ని ఆమె సోదరుడు మైఖేల్ బోర్డర్స్ సామాజిక వెబ్‌సైట్ ‘ఫేస్‌బుక్’లో తెలియజేశారు. తన సోదరి మరణించిన విషయాన్ని తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానంటూ వ్యాఖ్యానించారు. ఆనాడు జరిగిన టైస్టు దాడి గురించి ఆమె అనేక అంతర్జాతీయ పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనంలోని బ్యాంక్ ఆఫ్ అమెరికాలో పనిచేస్తున్న మార్సి బోర్డర్స్ టెర్రరిస్టులు విమానాలతో దాడి చేసినప్పుడు ఆమె ఆఫీసులోనే ఉన్నారు. దాడి అనంతరం ఆమె మెట్ల మార్గం గుండా కిందకు తప్పించుకు వెళ్లింది. ఆ సమయంలో ఆమె శరీరం నిండా ధూళి, దుమ్ము, బూడిద కమ్ముకున్నాయి. అదే సమయంలో ఆనాటి దాడిని ప్రత్యక్షంగా కవర్ చేస్తున్న ఏఎఫ్‌పీ ఫొటోగ్రాఫర్ స్టాన్ హోండా ఆమె ఫొటో తీశారు.
ఆఫొటో ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆనాటి సంఘటనకు ఒక ఐకాన్‌గా మిగిలింది. దశాబ్దకాలంలోని అత్యుత్తమ ఫొటోలంటూ ‘టైమ్ మేగజైన్’ ప్రచురించిన పాతిక ఫొటోల్లో ఈ ఫొటోకు స్థానం లభించింది. ఆనాటి భయానక అనుభవాన్ని ఆమె ఎప్పుడూ మరచిపోలేక పోయింది. ఆకాశమార్గాన ఏ విమానం కనిపించినా ఆమె వణికిపోయేది. ఏ భవనంపై ఎవరు కనిపించినా తననే కాలుస్తున్నాడేమోనని ఇంట్లోకి పరిగెత్తేది. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు రావడమే మానేసింది. మద్యానికి బానిసైంది. కొకైన్‌కూ అలవాటయింది. 2014, ఆగస్టులో ఆమెలో కేన్సర్ బయటపడింది. ఎలాంటి జబ్బులులేని తనకు కేన్సర్ వచ్చిందంటే కారణం ఆ నాడు టెర్రరిస్టు దాడి కారణంగా తనపై పడిన దుమ్మూ దూళియే కారణమని భావిస్తూ వచ్చింది. ఆమె తీపి గుర్తులుగా ఇద్దరు పిల్లలు ఉన్నారు.