అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన నేపథ్యంలో దేశంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
జమ్మూ, ముంబైలో అప్రమత్తంగా ఉండండి: నిఘా వర్గాలు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన నేపథ్యంలో దేశంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని రాష్ట్రాలకు సూచించాయి. ముఖ్యంగా బిహార్, ఉత్తరప్రదేశ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలతోపాటు ముంబై పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
2000లో నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్‌కు వచ్చిన సమయంలో లష్కరే తోయిబా ముష్కరులు కశ్మీర్‌లోని చిత్తిసింగ్‌పురా గ్రామంలో 36 మందిని ఊచకోత కోశారు. ఇప్పుడు కూడా అలా దాడులకు తెగబడే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ముంబైలో సిద్ధివినాయక ఆలయం, తాజ్ ప్యాలెస్ హోటల్, గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ఉన్నతాధికారులకు నిఘా వర్గాలు సూచించాయి.
ఇక ఢిల్లీని భద్రతా బలగాలు శత్రు దుర్భేద్యంగా మార్చేస్తున్నాయి. అమెరికా నిఘా వర్గాలతో కలసి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నాయి. ఒబామా ప్రయాణించే మార్గాల్లో అమెరికా నిఘా వర్గాలు ఇప్పటికే క్షుణ్ణంగా పరిశీలించాయి.